Sunday, January 28, 2018

ధనూరాశి శనికి అష్టమాధిపతైన చంద్రునికి మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం -భాగం 4

శ్రీ హేమలంబ నామ సంవత్సరం మాఘ పూర్ణిమ సరియగు తేదీ 31 జనవరి 2018 బుధవారం కర్కాటక రాశిలో పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో రాహు గ్రస్తంగా సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించనుంది. తూర్పు, ఆగ్నేయాల చంద్రునికి స్పర్శ ప్రారంభమై 76 నిముషాల పాటు సంపూర్ణ గ్రహణ బింబముండును. ఈ గ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఫసిఫిక్ ప్రాంతాలలో గోచరించును.

భారత కాలమాన ప్రకారం 2018 జనవరి 31 సాయంత్రం 5 గంటల 18 నిముషాలకు చంద్రునికి గ్రహణ స్పర్శ ప్రారంభమగును. అయితే ఈ సమయానికి దేశంలోని కొన్ని ప్రాంతాలలో సూర్యాస్తమయం కాకపోవచ్చును. కనుక సూర్యుడు అస్తమించిన ప్రాంతాలలోనే స్పర్శ కనపడును.

ముఖ్యంగా గర్భవతులు విషయంలో గ్రహణం చూడకూడదని అందరికీ తెలిసినటువంటిదే. అయితే గ్రహణ విషయాలలో గ్రహణానికి ముందు, మరియు గ్రహణం తర్వాత ఒక గంట పాటు కాలాన్ని గర్భవతులు గుర్తుంచుకోవాలి. అదేమిటంటే ఛాయలోనే గ్రహణ  స్పర్శ ప్రారంభమవుతుంది. ఛాయలోనే గ్రహణం ముగింపు జరుగుతుంది. కానీ గ్రహణ ప్రారంభానికి ముందు ఒక గంట పాటు చంద్రుడు ప్రతిఛాయ (క్రీనీడ) లో ఉండును. అలాగే గ్రహణం తర్వాత కూడా ఓ గంట పాటు ప్రతిఛాయలో ఉండును. ప్రతిఛాయ అనగా చంద్రుడు తన తేజస్సును కోల్పోయి కాంతి విహీనంతో మసక  బారినట్లుగా కనపడును.

కనుక గ్రహణానికి గంట ముందు చంద్రుడు కాంతి విహీనమగును. తిరిగి గ్రహణం పూర్తయిన తర్వాత 60 నిముషాల పాటు కాంతి విహీనంతోనే చంద్రుడు కొనసాగును. ఆ తర్వాతనే తేజో కాంతితో చంద్రుడు కనపడును. జనవరి 31 రాత్రి 8 గంటల 41 నిముషాలకి గ్రహణం పూర్తయిననూ మరొక గంట పాటు అనగా 9 గంట పాటు అనగా 9 గంటల 41 నిముషముల వరకు మసక బారినట్లుగా ఉంటాడు. అనగా ఈ సమయం వరకు గర్భవతులు చంద్రుడిని చూడవద్దు. ముఖ్యంగా గర్భవతులు తమ తమ గృహాలలో అన్నీ పనులు చేసుకుంటూ తిరగవచ్చును. ఒక చోటనే ఉండాలని,అటు ఇటు తిరగకూడదని, మల మూత్ర విసర్జనకు కూడా వెళ్లకూడదని చెప్పేటటువంటి మాటలు సరియైనవి కావు. భౌతికంగా చంద్రగ్రహణమును చూడకుండా ఉంటే చాలు. టీవీ లలో ప్రసారాలు ప్రత్యక్షంగా చేస్తుంటే, చక్కగా చూడవచ్చును.

ప్రతి గ్రహణానికి 3 గంటల ముందు నుంచే ఆహార పదార్థాలను స్వీకరించరు. కనుక ఈ గ్రహణము రాత్రి 8 గంటల 41 నిముషాలకే ముగిసిపోవును కనుక ఆ తర్వాత భోజన పదార్థాలను తయారుచేసుకొని స్వీకరించవచ్చు. భారతీయ శాస్త్ర సంప్రదాయాల ప్రకారంగా భోజన పదార్థాలను మధ్యాహ్నం వరకు మాత్రమే వండుకొనేది. ఎక్కడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5 గంటల 18 నిముషాలకు గ్రహణం ప్రారంభమై, 6 గంటల 22 నిముషాలకు సంపూర్ణ  స్థాయికి చేరుతుంది. అక్కడ నుంచి రాత్రి 7 గంటల 38 నిముషాల వరకు సంపూర్ణ గ్రహణ బింబము రక్త వర్ణములో ఉండును. గ్రహణ విడుపు రాత్రి 8.38 నిముషాలకు ప్రారంభమై, 8.41 నిముషాలకు గ్రహణం ముగియును. తెలుగు రాష్ట్రాలలో మొదటిగా గ్రహణమును శ్రీకాకుళం జిల్లా వాసులు చూడగలరు.

సంపూర్ణ గ్రహణ బింబము 6 గంటల 22 నిముషాల నుంచి 7 గంటల 38 నిముషాల వరకు నిలబడును. ఈ సమయం అత్యంత విశేషమైనదిగా గుర్తించాలి. ఎందుకంటే సహజంగా గ్రహణ సమయాలలో భగవతారాధన చాలా విశేషమైనది. కొన్ని దేవత మంత్రములను ఉపాసించే వారు గ్రహణ సమయాలలో ఆయా మంత్రాలను పఠిస్తే అనేక రేట్లు పఠించిన ఫలితం వస్తుంది. అయితే గ్రహణ సమయాలను బట్టి , గ్రహణం జరిగే రాశిని బట్టి, జరిగే నక్షత్రాలను బట్టి, అనుష్టాన ఫలితాలు పలు రెట్లు పెరుగుతుంటాయి. చంద్రుని యొక్క రాశిలోనే చంద్రునికి రెండు నక్షత్రాలలో గ్రహణం సంభవిస్తూ, 76 నిముషాల పాటు స్థిర బింబము ఉండును కాబట్టి ఎవరైనా ఒక మంత్రమును ఒక్కసారి మనః స్ఫూర్తిగా విశ్వాసంతో పఠిస్తే, 10 లక్షల సార్లు పఠించినంత మహా పుణ్యం వచ్చును. కనుక స్థిర బింబమున్న 76 నిముషాలలో ఒక దేవత నామాన్ని (ఉదాహరణకు ఓం శ్రీమాత్రే నమః ) స్మరిస్తే 10 లక్షల సార్లు పఠించిన మహద్భాగ్యం కల్గును. కనుక ఉపదేశ మంత్రాలు ఉన్నటువంటి వారు ఆ సమయంలో శుచిగా దైవీ దేవతలను ప్రార్ధించవచ్చును. ఇక పట్టు స్నానాలు, విడుపు స్నానాలు చేయాలనే ఉద్దేశ్యంతో గృహంలోని వృద్ధులను, చిన్నారులను దయచేసి ఇబ్బంది పెట్టవద్దు. కేవలం బీజాక్షర సహితంగా మంత్రోపదేశం ఉన్నవారు మాత్రమే గ్రహణానికి పట్టు స్నానాలు, విడుపు స్నానాలు ఆచరిస్తారు.. అందరూ కాదు.

మొత్తం మీద ఈ గ్రహణం శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా బ్లుమూన్ గా కనపడుతుందని శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ అది ఎట్టి పరిస్థితిలోను రక్త వర్ణములో ఉండును. నీలి రంగులో గ్రహణం కనపడదు. జనవరి నెలలో 2 పూర్ణిమలు వచ్చినందున, రెండవ పూర్ణిమ నాటి జాబిల్లిని శాస్త్రీయ పరిభాషలో బ్లూ మూన్ గా పిలుస్తారు. నీలి రంగులో చంద్రుడు మాత్రం కనపడదు. కేవలం రక్త వర్ణములోనే ఉంటాడు. సోషల్ మీడియా లో చంద్ర గ్రహణం యొక్క తీవ్రత అనేక మందిపై దారుణాతి దారుణంగా ఉంటుందని చెప్పే మాటలను దయచేసి నమ్మకండి. రాబోయే పోస్టింగ్ లో ప్రపంచ వ్యాప్తంగా చంద్ర గ్రహణ సమయాలను తెలుసుకుంటూ శని, చంద్రులను గురించి మరింత విశ్లేషించుకుందాం. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.