Wednesday, January 24, 2018

ధనస్సులోకి శని ప్రవేశం భాగం - 2

ధనుస్సు రాశిలోకి శని ప్రవేశం మొదటి భాగం చదివి ఉంటారు అనుకుంటాను. ఈ రెండవ భాగం నుంచి వెంట వెంటనే పోస్టింగ్లను అందచేస్తాను. జాగ్రత్తగా చదివి ఆకళింపు చేసుకుంటారని ఆశిస్తాను. జ్యోతిష శాస్త్ర రీత్యా శనికి అంతర్గత శత్రువు చంద్రుడు. శని అనగానే జ్యోతిష పరంగా ఆయుష్కారకుడని అర్థము. ఆయుస్థానం అనగానే ఏదో ప్రమాదం ముంచుకొస్తుంది భయపడేవారు చాలా మంది ఉంటారు.

ఇక్కడ ఆయుష్యు అంటే మనిషికి ఉన్న ప్రాణమని అర్థం కాదు. మన చేతిలో ఒక సెల్ ఫోన్ ఉందనుకుందాం. ఒక్కోసారి పొరపాటున పైనుంచి క్రిందపడి పగిలిపోవచ్చు లేదా కోపావేశాలతో విసిరి కొట్టవచ్చు. ఇక్కడ పొరపాటైనా, ఆవేశమైనా దానికి కారణము చంద్రుడే. .విసిరి కొట్టబడిన సెల్ ఫోన్ పగిలిపోయింది. అంటే దాని ఆయుష్యు తీరిపోయిందన్నమాట.

అలాగే ఓ క్రొత్త వాహనాన్ని ఓ వ్యక్తి నడపటం మొదలెట్టాడు. ఎన్నెన్నో బాధలతోనో, ఇతర వ్యాపకాలతోనో తన మనస్సును డ్రైవింగ్ మీద సక్రమంగా నిలపలేక పరధ్యానంగా ఉన్న కారణంగా ప్రమాదం జరిగి వాహనం ధ్వంసమైనది. అదృష్టవశాత్తు వ్యక్తి బతికి బయటపడ్డాడు. ఇక్కడ శనికి అంతర్గత శత్రువు చంద్రుడు పరధ్యానంగా ఉన్న కారణంగానే శని సంబంధమైన ఆ ఇనుప వాహనము ధ్వంసమైపోయింది.

పైన చెప్పిన ఉదాహరణ వలన ఆయుష్యనేది ఎలా ఉంటుందో అర్ధమైంది. అలాగే మానవుల ఆయుష్యు కూడా ఒక్కోసారి ఇదే శని చంద్రుల వలనే తీరిపోతుంటుంది. ద్వాదశ రాశులలో చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రమే వ్యక్తులకు జన్మ నక్షత్రం అవుతుంది. ఉదాహరణకు అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి చంద్రుడు అశ్వినిలో ఉన్నాడని అర్థము. అలాగే పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికీ చంద్రుడు పుష్యమిలో సంచారం చేస్తున్నాడని అర్థము. అంటే 27 నక్షత్రాలలో జన్మించినవారికి చంద్రుడు ఆ నక్షత్రంలో ఉన్నాడనే అర్థము.

ఈ నేపథ్యంలో చంద్రుడున్న స్థానానికి, శని ఉన్న స్థానం లెక్కగట్టే ఫలితాలు చూస్తుంటాం. ఈ ఫలితాలలోనే రజత మూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి, సువర్ణమూర్తిగా ఫలితాలు ఉంటాయని ముందు భాగంలో చెప్పుకున్నాం. అయితే ఒక్కొక్క రాశికి శని యొక్క స్థితిని తెల్పబోయే ముందుగా చంద్రుడికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశాన్ని ఈ సంవత్సరం ఒకసారి మనం గుర్తు చేసుకుందాం.

ఆయుస్థానము అనగా అష్టమ స్థానము. ప్రస్తుతం ధనుస్సు రాశిలో శని సంచారం చేస్తున్న తరుణంలో, శని ఉన్న రాశికి అష్టమ స్థానం ఎలా ఉందో పరిశీలిద్దాం. అనగా శని ధనస్సులో ఉంటే ఆ స్థానం నుంచి 8వ స్థానాన్ని లెక్కిస్తే, అది కర్కాటక రాశి అవుతుంది. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. జ్యోతిష పరంగా ధనుస్సు రాశికి అష్టమాధిపతి చంద్రుడైనాడు. ఇట్టి చంద్రుడికి 2018 జనవరి 31 బుధవారం రోజున అదే కర్కాటక రాశిలోనే సంపూర్ణ చంద్ర గ్రహణం పుష్యమి నక్షత్రంతో ప్రారంభమవుతుంది. ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి శని.

ఈ గ్రహణం సంపూర్ణ స్థాయికి చేరిన తర్వాత 76 నిముషాల పాటు స్థిరమైన గ్రహణ బింబం నిలబడుతుంది. సరే ఇలాంటి గ్రహణాలు అప్పుడప్పుడు వస్తుంటాయి అనుకుందాం. కానీ ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం జరిగిన తదుపరి 178 రోజులకు శని క్షేత్రమైన మకర రాశిలో మరో సంపూర్ణ చంద్ర గ్రహణం 2018 జూలై 27 న సంభవించనున్నది. ఈ గ్రహణము సంపూర్ణ స్థాయికి చేరిన తర్వాత 103 నిముషాల పాటు స్థిరంగా ఉండటం గమనార్హం.

ఈ రెండవ సంపూర్ణ చంద్ర గ్రహణం జరిగిన మరో 178 రోజులకు అనగా 2019 జనవరి 21న అదే కర్కాటక రాశిలోనే మూడవ సంపూర్ణ చంద్ర గ్రహణం 62 నిముషాల పాటు స్థిరబింబం గోచరించనుంది.

పాఠకులు ఇప్పుడు చెప్పే విషయాన్నీ బాగా గమనించండి. వరుస మూడు సంపూర్ణ చంద్ర గ్రహణాలలో రెండు కర్కాటక రాశిలోను (చంద్రుని యొక్క స్వక్షేత్రము), ఒక గ్రహణము మకర రాశిలో (శని యొక్క స్వక్షేత్రము) జరుగుతున్నవి. 

పై మూడు గ్రహణాలలో మొదటిది శని నక్షత్రమైన పుష్యమిలోనే ఉంటుంది. కనుక ధనుస్సు రాశిలో ఉన్న శనికి అంతర్గత శత్రువు, అష్టమాధిపతి అయిన చంద్రునికి వరుస మూడు సంపూర్ణ గ్రహణాలు జరుగుతున్నాయి.  కనుక ఈ మూడు సంపూర్ణ చంద్ర గ్రహణాలు మకర కర్కాటక రాశులలోనే జరగటం, పైగా చంద్రునికి సంభవించటము ఈ చంద్రుడు ద్వాదశ రాశులలో సువర్ణ రజత తామ్ర లోహ మూర్తులుగా ఉంటున్న కారణంగా వాటి వాటి ప్రభావాలు ఆలోచన చేయవలసిన విధి విధానాలు వెంట వెంటనే తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం.

సహజంగా ఒక గ్రహణం జరిగితే దాని ప్రభావం కొద్ది రోజులుంటుందని జ్యోతిష నిర్ణయం. పైగా గ్రహణ స్థాయిని బట్టి (పాక్షికంగా లేక సంపూర్ణము గాని), సంపూర్ణ గ్రహణ స్థిర బింబము ఉన్న సమయాన్ని బట్టి ప్రభావము యొక్క పీరియడ్ ఉంటుంది.

2018 జనవరి 31 బుధవారం నాడు సంభవించే సంపూర్ణ చంద్ర గ్రహణ ప్రభావం 6 మాసాలు ఉంటుంది. అనగా 2018 జూలై 31 వరకు ఉండునని భావము.

కానీ 2018 జూలై 27న మరొక సంపూర్ణ గ్రహణము 103 నిముషాల పాటు ఉండటంతో, తిరిగి దాని ప్రభావం 6 మాసాలు అనగా 2019 జనవరి 27 వరకు ఉండును. కానీ 2019 జనవరి 21న మరొక సంపూర్ణ చంద్ర గ్రహణం 62 నిముషాలు స్థిరబింబం సంభవించనున్న కారణంగా, దీని ప్రభావం కూడా అక్కడ నుంచి 6 మాసాలు ఉండును.

అంటే 2018 జనవరి 31 నుంచి 2019 జూలై 21 వరకు వరుస సంపూర్ణ చంద్ర గ్రహణాలు ప్రభావం ఉంటుందని అర్థము. ఈ వరుస మూడు గ్రహణాల అధిపతి చంద్రుడే  ధనుస్సు రాశిలో ఉన్న శనికి అష్టమాధిపతి కావటం విశేషం. కనుక ధనుస్సు రాశి సంచారంలో ఉన్న శని సమయంలో వరుస మూడు గ్రహణాలు రావటాలు, వాటి ప్రభావాలు, వీటికి ద్వాదశ రాశుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, ఈ గ్రహణాలు ఏ ఏ సమయాలలో.. ఏ ఏ ప్రాంతాలలో కనపడతాయి పరిపూర్ణంగా మూడవ భాగంలో తెలుసుకుందాం. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.