Saturday, July 15, 2017

2017 శ్రావణమాసంలో విరుద్ధ గ్రహణాలు

ఈ శ్రావణమాసంలో 2 గ్రహణాలు ఖగోళంలో సంభవిస్తున్నాయి. ఈనెలలో వచ్చే గ్రహణాలకి, ఇతర మాసాలలో వచ్చే గ్రహణాలకి చాలా  తేడా ఉన్నది. ఇక వివరాలలోకి వెళితే హేమలంబ నామ సంవత్సర శ్రావణ పూర్ణిమ సోమవారం సరియగు తేదీ 7 ఆగష్టు 2017 న మకర రాశిలో శ్రవణా నక్షత్రంలో మేష, వృషభ లగ్నాలలో కేతు గ్రస్తంగా పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తున్నది. చంద్రునికి వాయువ్య భాగంలో స్పర్శించి గ్రహణం పాక్షికంగా ఉండును.

భారత కాలమాన ప్రకారం ఆగష్టు 7 రాత్రి 10 గంటల 53 నిముషాలకు చంద్రునికి గ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 12 గంటల 48 నిముషాలకు ముగియును.. ఇది పాక్షికం మాత్రమే. మొత్తం 115 నిముషాలు గ్రహణము జరుగును. అయితే ఈ గ్రహణం జరిగే సమయంలో చంద్రుడు మకర రాశిలో ఉంటే కేతువు మాత్రం కుంభరాశిలో ఉన్నాడు. ఈ ఇరువురు పక్క పక్కనే లేరు.

అలాగే శ్రావణ అమావాస్యకు అంటే 21 ఆగష్టు 2017 సోమవారం నాడు సింహరాశిలో సంపూర్ణ సూర్య గ్రహణం సంభవిస్తుంది. ఇది భారతదేశంలో కనపడదు. ఈ గ్రహణం రాహు గ్రస్తంగా జరుగుచున్నప్పటికీ రాహువు మాత్రం కర్కాటక రాశిలో ఉన్నాడు. గ్రహణాలు జరిగే సమయాలలో రాహు కేతువులు రవి చంద్రులున్న రాశిలోనే ఉండాలి. కానీ కొద్దీ వ్యత్యాసంతో ప్రక్క రాశులలో ఛాయా గ్రహాలు ఉండటం, చంద్రుడు ఉన్న రాశికి 7వ రాశిలో సూర్య గ్రహణం జరగవలసి ఉండగా 8వ రాశిలో గ్రహణం జరిగింది. అనగా ఈ రెండు గ్రహణాలు ఒకదానికొకటి షష్టాష్టకాలలో ఉన్నాయి.

కనుక ఈ రెండు గ్రహణాలకు జ్యోతిష పరంగా విశేష ప్రాముఖ్యం ఉన్నది. శ్రావణ మాసంలో పాడ్యమి, పూర్ణిమ అమావాస్యలు సోమవారమే రావటము, సూర్య గ్రహణం రోజునుంచే శని, కుజుల పరస్పర వీక్షణలు ప్రారంభం కావటము, ఈ రెండు గ్రహణాల మధ్యనే కుజ రాహువుల కలయికలు జరగటం మొదలైన అనేక ఇతర అంశాలు చోటుచేసుకోనున్నవి. కనుక ఈ రెండు గ్రహణాల ప్రభావం ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉంటాయో ఈ క్రింది వీడియోల ద్వారా తెలుసుకొనండి. సంపూర్ణ సూర్య గ్రహణ ప్రభావ ఫలితాలు ఆచరించాల్సిన పరిహార క్రమ వీడియోలు కూడా త్వరలో పోస్టింగ్ జరగబడును. -  శ్రీనివాస గార్గేయ పొన్నలూరి

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.