Monday, March 27, 2017

మార్చి 28 మంగళవారమే శ్రీ హేమలంబ ఉగాది

స్వస్తిశ్రీ హేమలంబ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని మార్చి 28 ఏ ఆచరించుకోవాలి. 29 బుధవారం ఆచరించటం శాస్త్రీయం కానీ కాదు. నాచే రచింపబడిన కాలచక్ర పంచాంగంతో పాటు, కంచి కామకోటి పీఠ పంచాంగం (లక్కావజ్జల సిద్ధాంతి గారు), పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, కుప్పం ద్రవిడ యూనివర్సిటీ, సంస్కృత విద్యా పీఠ్ (ఢిల్లీ, వారణాసి, తిరుపతి), శ్రీ కాళహస్తి దేవస్థాన పంచాంగం (ములుగు సిద్ధాంతి గారు), ఆంధ్రజ్యోతి పంచాంగ, ఆంధ్రభూమి పంచాంగం, పిడపర్తి వారి పంచాంగం, హనుమంత వజ్జల సుబ్రమణ్య శర్మ గారి పంచాంగం, ద్విభాష్యం సుబ్రమణ్య శర్మగారి పంచాంగం, ముక్తేవి శశికాంత్ గారి పంచాంగం, అనపర్తి కృష్ణశర్మ గారి భాస్కర పంచాంగం, చిత్రాల గురుమూర్తి గుప్త గారి పంచాంగం, గొర్తి పట్టాభి శాస్త్రి గారు, ఉపద్రష్ట కృష్ణమూర్తి గారు, బిజుమల్ల బింధుమాధవ శర్మ గారు , కారుపర్తి కోటేశ్వర రావు గారు , కాలెపు భీమేశ్వర రావు గారు ,  పిచుక గిరిరాజు సిద్ధాంతి  గారు, పల్లావజ్జల రామకృష్ణ శర్మ గార్ల పంచాంగాలు...వీరు కాక మరో 40 మంది దృగ్గణిత పంచాంగ కర్తలు మరియు కేంద్ర ప్రభుత్వంచే ప్రతి సంవత్సరము విడుదలయ్యే రాష్ట్రీయ పంచాంగాలలో మార్చి 28న ఉగాది గా ప్రకటించారు. 

వీరు కాక గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు మార్చి 28 మంగళవారమే ఉగాదిగా ప్రకటించాయి. 2016 ఆగష్టు నెలలో కంచి పీఠం వారు నిర్వహించిన సదస్సులో తిరుమల సిద్ధాంతి తంగిరాల వారు పాల్గొని మార్చి 28న ఉగాది ఒప్పుకొని సంతకం చేసి సన్మానించుకొని, బయటకు వెళ్లిన తదుపరి పండిత ధిక్కారంతో మార్చి 29 శ్రీ హేమలంబి ఉగాదిగా ప్రకటించటంతోనే అయోమయం ప్రారంభమైనది. 

కనుక తెలుగు ప్రజలందరూ శాస్త్రీయమైన, ప్రామాణికమైన కంటికి ప్రత్యక్షంగా రుజువునకు సిద్ధపడే దృక్ పంచాంగాన్నే పాటించి మార్చి 28 మంగళవారం ఉగాదిగా ఆచరించేది. - పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.