Sunday, August 21, 2016

శని, కుజ సంఘర్షణ ఉపశాంతికై శ్రీ లలితా సహస్రంలోని షోడశ "రకార" నామాలు

వ్యాస మునీంద్రులు రచించిన 18 పురాణాలలో మార్కండేయ మహా పురాణం ఒకటి. దీనిలోని 13 అధ్యాయాలలో 700 శ్లోకాలు ఉన్నాయి. శ్రీ దేవి మహాత్య్మము గురించి ఈ పురాణంలో సవివరంగా తెలియచేయబడింది.  మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకంలో..
"సావర్ణిః సూర్యతనయో యో మనుః కథ్యతే అష్టమః" అనగా 8వ మనువుగా చెప్పబడే సూర్య భగవానుడి పుత్రుడైన సావర్ణి గురించి అని భావము. కానీ మంత్రం శాస్త్ర ప్రకారం పై పదాలకు అర్ధం ఏమనగా..  ఈంకార, రకార, హకారములతో కలిసిన హ్రీం కారమనే బీజాక్షరము మొదటి శ్లోకంలో వస్తుంది. ఈ విధంగా దుర్గా సప్తశతిలో 700 శ్లోకాలకు, శ్రీదేవికి సంబందించిన బీజములు మంత్రశాస్త్ర ప్రకారం ఉండును. ఈ హ్రీం అనే బీజములో రకారము అగ్ని బీజము. ఈ బీజాక్షరము చాలా విశేషవంతమైనది. కనుకనే ఈ రకారముతో కలిసిన నామాలు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మనం గమనించవచ్చు.

71వ శ్లోకం - రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా
రంజనీ రమణీ రస్యా రణత్కింకిణిమేఖలా ||

72 వ శ్లోకం - రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా
రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా ||


పై రెండూ శ్లోకాలలో మొత్తం 16 నామాలు ఉన్నాయి. ఈ 16 నామాలకి ప్రధమాక్షరము ర. మంత్రం శాస్త్రం ప్రకారం "ర" అనేది అగ్ని బీజము. ఈ ర కారముతో మొదలైన షోడశ నామాలు మహా తేజోవాచకములు. శని గ్రహ, కుజ గ్రహ సంఘర్షణ అగ్నితోనే ప్రారంభమవుతుంది. అంతేకాక ఖగోళంలో సెప్టెంబర్ 1 నాడు సంభవించే సంపూర్ణ సూర్య గ్రహణంపైన శని దృష్టి ఏర్పడింది. అక్కడ గ్రహణం ఏర్పడేది కూడా అగ్ని సంబంధిత సూర్యునికే .

305వ నామం - ఓం రాజరాజార్చితాయై నమః
306వ నామం - ఓం రాఙ్ఞై నమః
307వ నామం - ఓం రమ్యాయై నమః
308వ నామం - ఓం రాజీవలోచనాయై నమః
309వ నామం - ఓం రంజన్యై నమః
310వ నామం - ఓం రమణ్యై నమః
311వ నామం -  ఓం రస్యాయై నమః
312వ నామం -  ఓం రణత్కింకిణిమేఖలాయై నమః
313వ నామం - ఓం రమాయై నమః
314వ నామం -  ఓం రాకేందువదనాయై నమః
315వ నామం - ఓం రతిరూపాయై నమః
316వ నామం - ఓం రతిప్రియాయై నమః
317వ నామం - ఓం రక్షాకర్యై నమః
318వ నామం - ఓం రాక్షసఘ్న్యై నమః
319వ నామం - ఓం రామాయై నమః
320వ నామం - ఓం రమణలంపటాయై నమః

ఈ తేజోవాచకములైన రకారము ద్వారా పరాశక్తి యొక్క ఆవిష్కరణ జరుగును. హ్రీం కారములో కూడా అగ్ని బీజమైన అట్టి "ర" కారమున్నది. ఆ చైతన్యమే చిదగ్ని అని చెప్పబడింది. దానికి సంకేతమే ఈ రకారము. రాజరాజార్చితా అనగా రాజులచేత అర్చింపబడినదని భావము. రాజులకు కూడా రాజులు అనగా ఆ పాలకులకు కూడా పాలకులైన వారిచే పూజింపబడినదని భావము. "శ్రీ మంత్రరాజా రాజ్ఞీ చ శ్రీవిద్యా క్షేమకారిణీ, హ్రీంబీజ జపసంతుష్టా" అంటూ పరాశక్తిని స్తుతించారు.

"రమతే యోగినో లలితే సత్యానంద చిదాత్మని ఇతి రామపదేనాసౌ పరబ్రహ్మా విధీయతే"  అనునది ఉపనిషత్ వాక్యము. అనగా యోగులందరుకు పరమ యోగ్యమైన కైవల్యము ద్వారా ఆనందమును ప్రసాదించుచున్న పరమాత్మయే రామచంద్ర వాక్యము. అదే మంత్రం స్వరూపముగా 319వ నామమైన రామా అయినది. సర్వ స్త్రీ శక్తి అమ్మ యొక్క స్వరూపమని తెలుసుకోవాలి. ఇది మన భారతీయ సంస్కృతీ. శాక్తేయం పేరుతో మాతృ స్వరూపముగా అత్యుత్తమముగా ఆరాధించు పరబ్రహ్మ చైతన్యమే స్త్రీ శక్తిగా చెప్పబడింది.  కనుక ఇట్టి చిదగ్ని మయమైన అమ్మవారి తత్వమును పై రెండు శ్లోకములలో షోడశ "రకార" నామ పరంపరలో చెప్పబడినది.

దివ్యమైన, నిర్మలమైన, నిరంజనమైన, నిర్వికారమైన, సత్య శివ సచ్చితానంద సౌందర్యమే తల్లి స్వరూపము. కనుక శాశ్వతమైన సుఖమునిచ్చే ఈ రకారముతో కూడిన 16 నామములను ఆపత్కల్పము అంటారు. సమస్త ఆపదలను, విపత్తులను తొలగించి శక్తి కల్గిన కల్ప శాస్త్రము. కనుక నామములుగా గానీ లేక శ్లోకములు గాని భక్తి విశ్వాసాలతో ఉచ్ఛరించు వారలు ఖగోళంలో ఏర్పడే శని గ్రహ, కుజ గ్రహ సంఘర్షణ పూరిత ఆపత్తుల నుంచి విముక్తులగుటకు అవకాశములు ఏర్పడును.

కనుక ద్వాదశ రాశుల వారు ఖాళీ సమయాలలో పై రెండు శ్లోకములు కానీ లేదా లలితా సహస్ర నామావళిలోని 305 నుంచి 320 వరకు గల 16 నామాలను అక్టోబర్ 11 వరకు మననం చేస్తుండేది.

గమనిక 1 - పైన చెప్పిన 50 రోజులలో ద్వాదశ రాశుల వారు ఏయే సమయాలలో ఏయే అంశాలలో తగు తగు జాగ్రత్తలు తీసుకొనవలయునో తదుపరి పోస్టింగ్ లో చెప్పబడును.
గమనిక 2 - జాతకాలలో శని, కుజుల సంఘర్షణ ఉన్నటువంటి వారు కూడా ప్రతి మంగళ, శుక్ర శని వారాలలో అవకాశమున్నప్పుడల్లా మానసికంగా పై పదహారు నామాలను విశ్వాసంతో మననం చేసుకొనటం సర్వ విధాలా శుభకరం.

- దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.