Sunday, August 14, 2016

నీటిలో మునిగితే చేసిన పాపం పోయి పుణ్యం వస్తుందా ?

కశ్యప మహర్షికి ఇరువురు భార్యలు ఒకరు అదితి రెండవ వారు దితి. దితి గర్భాన్ని అదితి 7 ముక్కలు చేయించింది. (ఒక వస్తువును 7 ముక్కలు చేయాలంటే 6 సార్లు చేస్తే 7 ముక్కలవుతాయి. ఒక కర్రను 3 పర్యాయాలు నరికితే 4 ముక్కలవుతాయి.) అట్టి అదితి తదుపరి జన్మలో వసుదేవుని భార్య దేవకిగా జన్మించింది. దేవకికి గల్గిన మొదటి ఆరుగురు శిశువులను కంసుడు హతమార్చటం జరిగింది. పూర్వ జన్మలో అదితిగా ఉండి 7 ముక్కలుగా చేసినందున (6 సార్లు ఖండించినందున), తదుపరి జన్మలో తన గర్భాన జన్మించిన తొలి ఆరుగురు హతం కావటమే కర్మ సిద్ధాంతం. 

కర్మ సిద్ధాంతం ప్రకారం అనుభవించి తీరాలి. కశ్యపుడి భార్య చేసిన పాపం తదుపరి జన్మలో దేవకీ ఆరుసార్లు శిక్ష అనుభవించింది. వసుదేవుని భార్య పైగా శ్రీ కృష్ణుని తల్లి అయిన దేవకికే గత జన్మ పాపం తొలగలేదు. కేవలం పాపాలు చేసి నీటిలో మునిగితే పుణ్యాలు వస్తాయనుకోవటం పొరపాటు. ఈమాట ఎందుకు చెబుతున్నానంటే 24 సంవత్సరాల క్రితం వచ్చిన గోదావరి, కృష్ణ పుష్కరాలలో మునకలు వేసిన వారు వేల సంఖ్యలో లేరు. మరి ఈ ఒక్క కృష్ణా పుష్కరాలకు 5 కోట్ల మంది మునకలేస్తారని అంచనా. మరి రాబోయే 12 సంవత్సరాలకు ఎన్ని కోట్ల మంది మునకలు వేస్తారు ? ఎన్ని వేలాది కోట్లు ప్రభుత్వాలు ఖర్చు పెట్టాలి ? కనీసం టెలివిజన్ కార్యక్రమాలలో చెప్పే పండితులందరూ పురాణాలు చెప్పిన విషయాల అర్ధాన్ని, పరమార్ధాన్ని విడమర్చి చెప్పాలి. అంతేతప్ప నదిలో మునిగితే చేసిన పాపం పోతుందని చెప్పటం హాస్యాస్పదం . పుష్కర స్నానం అంటే సరియైన అర్ధం చెప్పకుండా, పుణ్యం వస్తుందని ఊదర గొట్టటం సమంజసం కాదు. 

రాబోయే 12 సంవత్సరాలకు ప్రభుత్వ ఖజానా అంతా పుష్కరాలకు వెచ్చించాలి. ఇప్పటికైనా పండితులు గమనించండి. ప్రజలని చైతన్య వంతులుగా చేయటానికి కృషి చేయండి. అంతేతప్ప చేసిన పాపాలు పోతాయని చెప్పకండి. కలుషితమయ్యే నదులను ప్రక్షాళన చేయటానికే తుందిలుడు శివుని యొక్క అష్టమూర్తిత్వములో ఒకటైన జల రూప దేహాన్ని బ్రహ్మ ద్వారా స్వీకరించి పుష్కరుడుగా నీటి యందు ప్రవేశించి... జీవ నదులను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతోటే బృహస్పతి రాశి ప్రవేశంతో నదులకు పుష్కరాలు వస్తుంటాయి. జీవావరణ పరిరక్షణార్థం ప్రతివారు ముందుండాలి. అంతేకాని ఇంటిల్లిపాది వెళ్లి ఆటపాటలతో మునకలు వేస్తున్నందున నది ప్రక్షాళన కాకపోగా మరింత కలుషితం అవుతూ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఇప్పటికైనా ప్రజలు గమనించండి. టీవీలలో చెప్పే పండితులు ఆలకించండి. చేసిన పాపం ఈ జన్మలో లేక మరు జన్మలో అనుభవించి తీరాలి. అంతేతప్ప నీటిలో మునిగినా, దీపం వెలిగించినా పోనే పోదు. ఇదే కర్మ సిద్ధాంతం. 

పై అంశాన్ని ఫేస్ బుక్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా తెలియచేశాను. ఒకరు ఇది చదివి ఏమని స్పందించారంటే... పాపం పోనిమాట యదార్ధమే... తీర్ధ విధి, పుష్కర స్నానం పుణ్యప్రదమే కదా. ఈ పుణ్య ప్రదం అనటం ఆర్ష దృష్టే కదా అని వాట్సాప్ ద్వారా మెసెజ్ పంపారు. దానికి సమాధానంగా ... 

భారతీయ సనాతన ధర్మాలు చాలా  గొప్పవి. ఆర్ష సంస్కృతిని గౌరవించవలసిన బాధ్యత ప్రతి భారతీయుడి యందు ఉన్నది. కానీ చేసే కార్యక్రమాలు వెర్రితలలు వేయకుండా చూడవలసిన బాధ్యత ప్రతి హిందువుపై ఉన్నదనే విషయాన్ని మరువకూడదు. ప్రస్తుతం ముద్రితమవుతున్న పురాణ గ్రంధాలలో అనేక ప్రక్షిప్తాలు కనపడుతున్నాయి. అలాగే ధర్మాన్ని పరిరక్షించవలసిన మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా వారి వారి నియమాలను ఉల్లంఘిస్తున్నారు. ఆర్ష ధర్మం ప్రకారంగా సన్యాసం స్వీకరించిన వారు సముద్రం దాటి వెళ్లకూడదని నియమం ఉన్నది. గతంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు కూడా ఒకానొక అంశంలో ప్రాయశ్చిత్తం చేసుకొనవలసి వచ్చింది . మరి ఈనాడు పీఠాధిపతులుగా పేరెన్నిక గన్నవారు చేస్తున్న విదేశీ ప్రయాణాలకు అడ్డుకట్ట వేసే వారే లేరా? మరి ఆర్ష ధర్మాన్ని గురించి చెప్పవలసిన వారే ఈ విధంగా చేస్తుంటే కంచే చేను మేసినట్లు కాదా! సనాతన ధర్మాలు కానీ, పర్వదిన నియమాలు కానీ , ఇతర వ్రతాలు మొదలైన వాటిని పరిశీలిస్తే... ఇవన్నీఈ కూడా మానవాళి ఆరోగ్య శ్రేయస్సుతో  ముడిపడి ఉన్నాయనే నగ్న సత్యాన్ని తేటతెల్లం చేస్తాయి.

ప్రతిరోజు చేసే సంధ్యావందనాది సంకల్పాలలో జీవనదులు ప్రస్తావన ముడిపడి ఉంటుంది. ఆ ప్రకారంగానే ఎప్పుడైతే పుష్కరాలు జరుగుతాయో ఆ సమయంలో పుష్కర నదిని సంకల్పించుకుంటూ చేసే స్నానమే పుణ్య స్నానం. అసలు నదిని ప్రక్షాళన చేయటం కొరకుగా పుష్కర రాజు వేంచేయటం జరుగుతుంది. దీనిని ఆసరాగా తీసుకొని నదిని విపరీతంగా కలుషితం చేస్తున్నారు. రాబోయే పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల ప్రజా ధనమంతా పుష్కర ఘాట్ల ఏర్పాటుకే సరిపోతాయి. ప్రస్తుతం జరుగుతున్న పుష్కర సరళిని గమనిస్తే... ఇప్పుడు నిర్ణయాలు చెప్పే వారే నిజమైన పండితులని, రెండు దశాబ్దాల క్రితం పండితులు లేరని, అందుకే ఆనాడు పుష్కరాలకు జన సందోహం లేరని అనుకునే వారు కూడా ఉన్నారు. ఇది పొరపాటు. ప్రతి గ్రామంలో ఓ పండితులవారు ఉంటారు. ఆ పండితులవారి చేతిలో పంచాంగము ఉంటుంది, వివరాలు ఉంటాయి. ఆ గ్రామం వరకు ఆ పండితుల వారు తెలియచేస్తారు. ఆనాడు దినపత్రికలు ఉన్నాయి, రేడియోలు ఉన్నాయి. మరి ఆనాటి పుష్కరాలకు జనసందోహం ఎందుకు రాలేదు? ... అంటే  రవాణా సౌకర్యాలు అధికంగా లేవు గనక జనసందోహం లేదని సమాధానం చెప్తారు. ఏది ఏమైనా భారతీయ సనాతన సంప్రదాయాలను సరియైన రీతిలో చెబుతూ ప్రజలకు మార్గ దర్శకులుగా ఉండాలి. అంతేతప్ప విపరీత ప్రచారాలు చేసి అనారోగ్యాలు తెప్పించే విధంగా ఉండకూడదు. టోల్ ప్లాజాల వద్ద గంటల పాటు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ లు రోడ్ల మీద జరుగుతుంటే... పిల్లలు, వృద్దులు తాగటానికి నీళ్లు, తినటానికి తిండి లేక వాహనాలలో ఇబ్బందులు పడుతున్నవారు కోకొల్లలు. మరి ఈ పాపం ఎవరిది????

ఇప్పటికైనా ప్రతివారు మేల్కొనండి. ధర్మాన్ని కాపాడటానికి మార్గాలు ఎన్నో ఉంటాయి. రాబోయే సంవత్సరాలలో తెలిసీ తెలియక తప్పులు జరుగుతుంటే మూల్యం ఎవరు చెల్లించుకుంటారు. కనుక చెప్పవలసిన రీతిలో ప్రజలకు చెప్పాలి. తమ తమ స్వగృహాలలోనే ఉంటూ నదులను సంకల్పించుకుంటూ ఆయా రోజులలోనే స్నానాలు ఆచరించండి. అవే పుణ్యస్నానాలు. ప్రజలందరినీ నదులు దగ్గరికి వెళ్ళమని సలహాలు ఇవ్వకూడదు. ఉగాది పండుగ నాడే ఉగాది పచ్చడి తింటాము. అంతే కానీ శ్రీరామ నవమి రోజు ఉగాది పచ్చడి తినము.. ఇది ఎలాగో... అలాగే పుష్కరాలు వచ్చిన 12 రోజులలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ అక్కడ ఉండే జలాన్ని తీసుకొని సంకల్పిస్తే... తక్షణమే పుష్కరుడు ఆనీటి యందు ఉంటాడు. మనస్సాక్షిగా... ఆత్మసాక్షిగా చేసే సంకల్పాలకు దేవతల అనుగ్రహం ఉంటుందని ఆర్ష ధర్మం తెలియచేస్తుంది. కనుక అలాంటి సంకల్పాలకు వెళ్ళమని ప్రజలను చైతన్య పరచాలి. మన జీవ నదులను కాపాడుకోవాలి. మాటకు మాట విసురుతూ పొతే చివరలో ఆర్ష ధర్మానికి తూట్లు పడుతుంటాయి. ప్రజలకు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తూ, విజయంవైపు పయనించేలా మంచి మనసును అందించేవాడే చంద్రుడు. ఈ చంద్రుడు జల రాశికి అధిపతి. కనుక మన సమీపంలో ఉన్న జలరాశులతోనే మనం విజయం సాధించేలా ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆర్ష ధర్మానికి పెద్దపీట వేసినట్లవుతుంది.

ముగింపుగా ప్రతిరాశిలోకి గ్రహ రాజైన సూర్యుడు ప్రవేశించటమే సంక్రమణం ప్రారంభమై, పితరులకు తర్పణాదులు పుణ్యకాలంలోనే ఆచరిస్తారు . అలాగే గురు గ్రహం కూడా ప్రతి రాశి ప్రవేశం కాగానే ఆ 12 రోజులు నదిని సంకల్పించుకొని చేసే స్నానాలే పుణ్య స్నానాలని అర్ధం. కనుక రాబోయే సంవత్సరాలలో శాస్త్ర అంశాలను అర్ధమయ్యే రీతిలో పండితులు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. చెప్పటంలో పొరపాటు జరిగితే అవాంఛనీయ సంఘటనలు మొదలై పలు అనర్ధాలకు హేతువగుననే విషయం విస్మరించరాదు. - దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.