Tuesday, March 8, 2016

ఓ పార్శ్వం పాక్షికం, మరో పార్శ్వం సంపూర్ణ గ్రహణం

9 మార్చి 2016 శ్రీ మన్మధ నామ సంవత్సర మాఘ అమావాస్య  బుధవారం రోజున పూర్వాభాద్ర నక్షత్ర కుంభ రాశిలో కేతు గ్రస్తంగా సంపూర్ణ  సూర్యగ్రహణం గోచరించును. అయితే భారత దేశంలో పాక్షికం మాత్రమే. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.46 నిముషాలకు పాక్షికంతో సూర్య గ్రహణ స్పర్శ ప్రారంభమగును. భారతదేశంలో వివిధ ప్రాంత సూర్యోదయాల కంటే ముందే గ్రహణం ప్రారంభమై తదుపరి కొన్ని కొన్ని నిముషాలు వివిధ ప్రాంతాలలో పాక్షికంగా కనపడి గ్రహణం ముగిసిపోవును.

భారతంలో ఉదయం 6.50 నుంచి 9.08 వరకు సూర్యుడు గ్రహణం లేకుండానే కనపడుతుంటాడు. కాని ఇదే సమయంలో సూర్యునికి రెండవ పార్శ్వంలో సంపూర్ణ గ్రహణం ఏర్పడును. భారత కాలమాన ప్రకారం  ఉదయం 7.25 నిముషాలకు సంపూర్ణ గ్రహణ స్థితికి  బింబము  వచ్చి 7 గం. 29ని 4 సెకన్లకు గ్రహణ విడుపు ప్రారంభమై 9.08 నిముషాలతో గ్రహణ ముగింపు జరుగును. కనుక గ్రహణ పూర్తికాలము 3గం. 22నిముషాలు. ఫసిఫిక్ మహా సముద్రంలో సంపూర్ణంగా కనపడును.

ప్రస్తుతం రాహువు, గురువును సమీపిస్తున్నందున గురుచండాల యోగం సింహరాశిలో జరుగుతున్నది. సింహరాశి అధిపతి సూర్యుడు కావటం సూర్యునికి కేతుగ్రస్తంగా సంపూర్ణ సూర్య గ్రహణం పంచ గ్రహ కూటమితో ఏర్పడటం, ఈ కూటమిపై కుజ గ్రహ వీక్షణ ఉండటం, తిరిగి సెప్టెంబర్ 1వ తేదిన సింహరాశిలోనే మరో కంకణ పూర్వక సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించటం, ఈ రెండు గ్రహణాల మధ్య నాగ బంధనంతో పాటు వైరి గ్రహాలైన కుజ, శనులు వక్ర సంచారం చేసి తిరిగి ఋజు మార్గంలోకి వచ్చి ఆగస్ట్ 24న ఏక బిందువులో కుజ శనులు కలవటం మొదలైన వ్యతిరిక్త గ్రహ స్థితుల ప్రభావం ఉంది కనుకనే సప్త మహా సూర్య యాగాలు ఆచరించటం జరుగుతున్నది. 

గ్రహణము ఉదయం 6.50తో భారత్ లో పాక్షికంగా ముగిసిపోవును. ఆకాశంలో సూర్యుడు  గ్రహణం లేకుండా కాంతివంతంగా భారతదేశంలో కనపడుతుంటాడు కనుక గ్రహణం లేదనుకొని  గర్భవతులు తమ తమ గృహాల నుంచి వెలుపలికి వచ్చి సూర్య కాంతి సోకేలా దిన చర్యను చేసుకొనేవారు చాలామంది ఉండవచ్చు. కాని ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారతంలో 6.50 నుంచి 9.08 నిముషాల వరకు గ్రహణం లేని సూర్యుడు గోచరిస్తున్నప్పటికీ, రెండవ పార్శ్వం వైపు సంపూర్ణం ఏర్పడి ఇతర దేశాలకు కనపడును. కాని గ్రహణ వేద అనుభవిస్తున్న గ్రహ రాజైన సూర్యుని నుంచి వచ్చే కాంతి కిరణాలు గర్భవతులకు ఇబ్బందికరం.

కనుక సూర్యోదయాల నుంచి  9.08 వరకు గృహంలోనే గర్భవతులు ఉండవలసింది. వారి వారి అన్ని పనులు చేసుకోవచ్చును. మల, మూత్ర విసర్జనకు వెళ్ళవచ్చును. ఒకే ప్రాంతంలో పడుకోవాలనే నిబంధన లేదు. టీవీ లలో చూపించే గ్రహణ బిమ్బాలను కూడా చూడవచ్చును. ఆందోళన వద్దు.

ఉదయము 9.08 నిముషముల తదుపరి స్నానమాచరించి భోజన కార్యక్రమ ఏర్పాటు చేసుకొనవచ్చును.  పాలు, పెరుగు లాంటి ఆహార పదార్ధములపై దర్భలను వేసుకొనేది. ఈ గ్రహణ సమయంలో పట్టు స్నానము, విడుపు స్నానము, మధ్య స్నానములు ఉండును. కాని ఇవి భారత దేశంలో సూర్యోదయాల నుంచి ప్రారంభమై ఉదయం 6.50 కి పూర్తగును. కనుక పట్టు స్నానం, మధ్య స్నానం ఆచరించలేక పోయిననూ 6.50 తదుపరి విడుపు స్నానం ఆచరించటం ఒక పద్ధతి. అలా కాకుండా సూర్యోదయం తదుపరే పట్టు స్నానం ఆచరించి, 7 గంటల 27 నిముషాలకు మధ్య స్నానాన్ని ఆచరించి 9.08 తదుపరి గ్రహణ మోక్ష స్నానాన్ని ఆచరించవచ్చును. మంత్రోపాసన చేయువారలు ఈ మూడు స్నానాలు ఆచరిస్తూ, మంత్రం జపాన్ని అనుష్టానం చేసినచో రెట్టింపు లబ్ధి లభించునని శాస్త్ర వచనం.

దీర్ఘ వ్యాధితో బాధపడే వారలు ఎటువంటి స్నానాలను దయచేసి చేయవద్దు. కేవలం పసుపు కలిపిన జలాన్ని స్వల్పంగా శరీరంపై ప్రోక్షించుకొనిన చాలును.

పూనే, బొంబాయి, అహ్మదాబాద్ ప్రాంతాలలో గ్రహణం కనపడదు.

భారతదేశంలో పాక్షికంగా గ్రహణ సమయాలు ఈ క్రింది విధంగా ఉండును
తిరుమల ఉ 6.26 నుంచి 6.48 వరకు, 22 నిముషాలు కనపడును
తిరుత్తని  ఉ 6.25 నుంచి 6.47 వరకు, 22 నిముషాలు కనపడును
శ్రీకాళహస్తి  ఉ 6.25 నుంచి 6.48 వరకు, 23 నిముషాలు కనపడును
మదనపల్లి ఉ 6.29 నుంచి 6.47వరకు,18 నిముషాలు కనపడును
చిత్తూరు  ఉ 6.27 నుంచి 6.48 వరకు, 21 నిముషాలు కనపడును
శ్రీశైలం  ఉ 6.28 నుంచి 6.48 వరకు, 20 నిముషాలు కనపడును
కర్నూల్ ఉ 6.32 నుంచి 6.48 వరకు, 16 నిముషాలు కనపడును
నంద్యాల  ఉ 6.30 నుంచి 6.48 వరకు, 18 నిముషాలు కనపడును
కడప  ఉ 6.28 నుంచి 6.47 వరకు, 19 నిముషాలు కనపడును
రాజంపేట ఉ 6.27 నుంచి 6.48 వరకు, 21 నిముషాలు కనపడును
ప్రొద్దుటూరు ఉ 6.30 నుంచి 6.48 వరకు, 18 నిముషాలు కనపడును
హైదరాబాద్  ఉ 6.31 నుంచి 6.47 వరకు, 16 నిముషాలు కనపడును
వరంగల్  ఉ 6.27 నుంచి 6.48 వరకు, 21 నిముషాలు కనపడును
ఆదిలాబాద్ ఉ 6.26 నుంచి 6.47 వరకు, 16 నిముషాలు కనపడును
భద్రాచలం  ఉ 6.21 నుంచి 6.48 వరకు, 27 నిముషాలు కనపడును
నిజామాబాద్ ఉ 6.33 నుంచి 6.47 వరకు, 14 నిముషాలు కనపడును
మహబూబనగర్ ఉ 6.33 నుంచి 6.47 వరకు, 14 నిముషాలు కనపడును
ఖమ్మం ఉ 6.24 నుంచి 6.48 వరకు, 24 నిముషాలు కనపడును
మెదక్ ఉ 6.32 నుంచి 6.47 వరకు, 15 నిముషాలు కనపడును
నల్గొండ  ఉ 6.28 నుంచి 6.48 వరకు, 20 నిముషాలు కనపడును
సిద్ధిపేట ఉ 6.33 నుంచి 6.47 వరకు, 14 నిముషాలు కనపడును
కరీంనగర్ ఉ 6.29 నుంచి 6.48 వరకు, 19 నిముషాలు కనపడును
సూర్యాపేట ఉ 6.26 నుంచి 6.48 వరకు, 22 నిముషాలు కనపడును
నెల్లూరు ఉ 6.24 నుంచి 6.48 వరకు, 24 నిముషాలు కనపడును
అనంతపురం ఉ 6.33 నుంచి 6.47 వరకు, 14 నిముషాలు కనపడును
హిందూపురం ఉ 6.34 నుంచి 6.48 వరకు, 14 నిముషాలు కనపడును
ఒంగోలు ఉ 6.25 నుంచి 6.49 వరకు, 24 నిముషాలు కనపడును
చీరాల ఉ 6.24 నుంచి 6.49 వరకు, 25 నిముషాలు కనపడును
గుంటూరు ఉ 6.23 నుంచి 6.48 వరకు, 25 నిముషాలు కనపడును
తెనాలి  ఉ 6.21 నుంచి 6.48 వరకు, 27 నిముషాలు కనపడును
విజయవాడ ఉ 6.22 నుంచి 6.48 వరకు, 26 నిముషాలు కనపడును
ఏలూరు  ఉ 6.20 నుంచి 6.48 వరకు, 28 నిముషాలు కనపడును
రాజమండ్రి  ఉ 6.17 నుంచి 6.48 వరకు, 31 నిముషాలు కనపడును
అమలాపురం ఉ 6.16 నుంచి 6.48 వరకు, 32 నిముషాలు కనపడును
కాకినాడ ఉ 6.15 నుంచి 6.48 వరకు, 33 నిముషాలు కనపడును
అన్నవరం ఉ 6.15 నుంచి 6.49 వరకు, 34 నిముషాలు కనపడును
పిఠాపురం  ఉ 6.15 నుంచి 6.48 వరకు, 33 నిముషాలు కనపడును
యానం ఉ 6.16 నుంచి 6.48 వరకు, 32 నిముషాలు కనపడును
విశాఖపట్నం ఉ 6.12 నుంచి 6.48 వరకు, 36 నిముషాలు కనపడును
శ్రీకాకుళం ఉ 6.09 నుంచి 6.49 వరకు, 40 నిముషాలు కనపడును
ఇచ్చాపురం ఉ 6.06 నుంచి 6.49 వరకు, 43 నిముషాలు కనపడును
టెక్కలి ఉ 6.09 నుంచి 6.49 వరకు, 40 నిముషాలు కనపడును
సాలూరు ఉ 6.12 నుంచి 6.49 వరకు, 37 నిముషాలు కనపడును
చెన్నై ఉ 6.22 నుంచి 6.48 వరకు, 26 నిముషాలు కనపడును
బెంగుళూరు ఉ 6.33 నుంచి 6.47 వరకు, 17 నిముషాలు కనపడును
త్రివేండ్రం ఉ 6.34 నుంచి 6.46 వరకు, 12 నిముషాలు కనపడును
ఢిల్లీ  ఉ 6.40 నుంచి 6.44 వరకు, కేవలం 4 నిముషాలు మాత్రమే కనపడును
కలకత్తా  ఉ 5.53 నుంచి 6.50 వరకు, 57 నిముషాలు కనపడును

లక్నో ఉ 6.24 నుంచి 6.45 వరకు, 21 నిముషాలు కనపడును
నాగపూర్  ఉ 6.30 నుంచి 6.47 వరకు, 17 నిముషాలు కనపడును

గమనిక : మాఘ అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఖగోళంలో జరుగుతున్నది కనుక సముద్ర స్నానాలు ఆచిరించే వారు జాగ్రత్తలు పాటిస్తూ ఆచరించేది. ఎందుకంటే ఈ గ్రహణానికి ముందు ఒక వారము, తదుపరి రెండు వారాల వరకు భూకంప, సునామి సంబందితములు రాగల సూచన వున్నది. కనుక సముద్రపు అలలు ఉవ్వెత్తున లేచును. కాబట్టి సముద్ర స్నానాల వైపు వెళ్ళకుండా ఉండటం చాలా  మంచిదని గ్రహ సంచార రీత్యా తెలియచేస్తున్నాను. దేశ, విదేశ రాజకీయ స్థితిగతులపై గ్రహణ మరియి అరిష్ట గ్రహస్థితుల ప్రభావాన్ని తదుపరి పోస్టింగ్ లో తెలుసుకుందాం.
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.