Tuesday, March 15, 2016

వివాహాలలో వ్యతిరేకతలనిచ్చే అరుదైన నాగబంధనం - పార్ట్ 3

మంచి మనస్సుతో ఉంటూ నిబద్దతో కూడిన జీవితం సాగిస్తున్నప్పటికీ ఈ గురు రాహు నాగబంధన అంశాలు మొత్తం  432 ఉన్నవి. అసలు వివాహం విధి నిర్ణయమా ? లేక గ్రహచార, గోచార స్థితులలో వచ్చే మార్పుల అనుసరించి విధి నిర్ణయాన్ని తారుమారు చేసే ఫలితమా? ఈ రెండు అంశాలలో రెండవది నాగ బంధనానికి సంబంధించినది. వివాహం ముందే నిర్ణయింపబడితే చేయగలిగిందేమి లేదు. అది ప్రేమ వివాహమైనా మరేదైనా, ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం, అవసరం ఉండనే ఉండదు. చేయవలసినది వివాహం మాత్రమే.

ఎన్నో సంబంధాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. ఏ ఒక్కటి కుదరదు. సంవత్సరాలు గడిచిపోతాయి. తల్లి తండ్రులతో పాటు విసిగిపోయిన జాతకులు కూడా.. ఇక జన్మలో వివాహం చేసుకోకూడదనే పరిస్థితికి వచ్చేస్తారు. కాని అనుకోకుండా ఓ సంబంధం రావటం, కుదరటం చక చకా వివాహం జరగటం అంతే వేగంతోనే ఊహించని రీతిలో మలుపులు తిరిగిపోవటం నాగ బంధనానికి ఉన్న లక్షణం.

వివాహం నిశ్చయమైనది. ఫలానా తేది వివాహమని తెలియచేసుకున్నారు. అనుకోకుండా అవాంతరం వచ్చింది. వివాహం ఆగిపోయిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. మళ్లీ కొత్త శుభలేఖలు, పునః ప్రయత్నాలు చేయటమా లేక ఈ సంబంధంతో మానుకొని మరొకటి చూసుకోవటమా ఇది కూడా ఓ నాగ బంధనమే. అయితే ఇక్కడ పునః ప్రయత్నాలకు కారణమయ్యే గ్రహం శని. అవాంతరాలు కల్గించటం, కార్యక్రమాలని తల్లక్రిందులు చేసేయటం, వివాహ తేదిని మార్చివేయటం... ఒక విధమైన ఆందోళన కల్గించటం ఒక భాగమైతే, అసలు వధూ వరులలోనే ఒకరిని మార్చేయటం మరొక ఎత్తు. ఇంతటి చిత్ర విచిత్రాలు చేయగల సర్వ సమర్ధుడు ఈ శని మహారాజు. కాని ఇది అన్ని సమయాలలో కానేకాదు.
ఎక్కడైనా నాగ బంధనం జరిగి ఉండి ఉన్న జాతకాలలో మాత్రమే పై ప్రకారంగా జరుగుతుంటుంది.

మొత్తం మీద వివాహం అనేది ఇరు జీవితాలను శాశ్వతంగా ముడి వేసే స్నేహ సంబంధం వంటిది. ఇరువురికి వ్యవస్థ పై నమ్మకం లేకుంటే ఈ బంధం నిలబడదు. ఈ విధంగా నిలబడని బంధాలను అనేక కోణాల్లోనూ, విభిన్న రీతులలోను భంగపరిచే లక్షణం ఒక్క నాగబంధనానికే ఉన్నది.

ఒక్కోసారి ఇరు జాతకాలు అద్భుతంగా ఉన్నాయని ఓ పండితులవారు చెప్పారని, ఆ పండితులవారి మాట భరోసాతో కార్యక్రమం పూర్తయిందని, చివరికి పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత మరో పండితులవారు ఇది గమనించి, జాతకాలు కలవలేదని, అందుకే సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పటం అనేది తరచూ వింటుంటాం. ఒకవేళ మొదటి పండితులవారు చెప్పిన నిర్ణయాన్ని ఖాతరు చేయకుండా, సెకండ్ ఒపీనియన్ గా ఆసమయంలో మరో అనుభవశాలి గల పండితుడిని ప్రశ్నిస్తే ఇలా జరిగి ఉండేది కాదేమో అని చాలా మంది వాపోతుంటారు. కాని నాగ బంధన దోషం ఉన్నప్పుడు , శాస్త్రీయమైన పరిహార పరిష్కారము చేసుకోకుండా సహస్రాది పండితులని సంప్రదించినప్పటికీ జరిగేది జరిగి తీరుతుంది.

అందుకే 13వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు గల ఏడూ సంవత్సరాలను టీనేజ్ అంటారు. ఈ 7 సంవత్సరాల టీనేజ్ లో మధ్యలో ఉన్నదే 16వ సంవత్సరం. కనుక దోష శాతము ఏ స్థాయిలో ఉన్నది ? మరి నాగ బంధన రూపంలో ఉన్నదా ? చండాల యోగంలో ఉన్నదా ? కుజ రాహు కలయికతో ఉన్నదా ? శుక్ర రాహు కలయికతో ఉన్నదా ? రెండు గ్రహాల మధ్య ఉన్న దూరమెంత ? ఈ రెండు గ్రహాలూ ఉన్న స్థానం పైన పాప గ్రహాల వీక్షణ ఉన్నదా ? లేక శుభ గ్రహాల వీక్షణ ఉన్నదా ? రాశి, నవాంశ చక్రాలలో స్థితి గతులు అనే అంశాలను తల్లి తండ్రులు 16వ సంవత్సరం దాటిన లగాయితు జ్యోతిష శాస్త్ర నిర్ణయాలను సరియైన రీతిలో తీసుకుంటూ దీర్ఘకాల పరిహారమును ఆచరించినప్పుడు మాత్రమే నాగబంధనం వంటి దోషాలకు పూర్తి స్థాయిలో పరిహారం చేసిన వారవుతారు.

అనగా ప్రస్తుత వయస్సు 16 సంవత్సరాలు. జాతకంలో వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలను బేరీజు వేసుకొని అనుకూల స్థితులు  ఎంత వరకు ఉన్నాయి ? లేక ప్రతికూల పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయి తెలుసుకుని, ఆ 16వ సంవత్సరం నుంచి మొదటి 9 సంవత్సరాల వరకు అనగా 24వ సంవత్సరం వయసు వచ్చే వరకు ఖగోళంలో నాగ బంధనాలు ఏ ఏ సమయాలలో జరగబోతున్నాయి, అవి జాతకుల జన్మ రాశికి ఏ స్థానంలో ఉండబోతున్నాయి, ఆ ఫలితాలు ఎంత వరకు వ్యతిరేకంగా ఉంటాయి అనే వివరాలను ముందుగానే గమనించి తగిన రీతిలో దీర్ఘకాల పరిహారమును ఆచరించాలి.

నాగ బంధనం అనేది ఖగోళంలో ప్రతి 6 నుంచి 7 సంవత్సరాల మధ్యలో వస్తూనే ఉంటుంది. కాబట్టి 16 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే గమనించి, భవిష్య 36 సంవత్సరాల వరకు అనగా జాతకునికి దాదాపు 50 సంవత్సారాలు వయస్సు వచ్చేంతవరకు ఇట్టి బంధనాలు ఏయే రాశులలో ఎన్ని సార్లు వస్తున్నాయి ? ఆయా తేదీలు ఎప్పుడెప్పుడు ? ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి అనే పూర్తి స్థాయి పూర్వాపరాలను తెలుసుకున్నప్పుడు మాత్రమే నాగ బంధన దోషాల నుంచి విముక్తి కావచ్చు.

అలా కాకుండా మరో 2 రోజులలో బంధనం జరగబోతున్నది అని తెలుసుకొని చేసే  ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. అందుకే రాబోవు సంవత్సరాలలో ఈ బంధన దోషాలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే కొంత వరకు లోతైన విశ్లేషణ ఇవ్వటం జరిగింది. 432 అంశాలు ఉన్నాయి కనుక ఇట్టి అంశాలు అందరికీ ప్రస్తుత రోజులలో తెలియదు కనుక కొంతకు కొంత ప్రజలను చైతన్య వంతులు చేయాలనే సంకల్పంతోనే ఇప్పటినుంచి నాగ బంధన అంశాలను వెలుగులోకి తీసుకొని వస్తున్నాను. అందుకే గోధుమ పిండి దీపారాధనతో ప్రతి ఆదివారం చేయటం ఒక చిన్ని పరిహారం లాంటిది.  వీటితో పాటు వైదిక మార్గంలో శాస్త్ర క్రియలను ఆచరించి, క్రియ తదుపరి హోమం ద్వారా వచ్చే భస్మాన్ని ప్రత్యేక పద్ధతులలో కొన్ని ఇతర ద్రవ్యాలను కలిపి, తద్వారా వచ్చే దానిని కంఠమునకు బొట్టు రూపంలో ధరించటం చాలా శ్రేయస్కరం.

కనుకనే నాగ బంధనం వైవాహిక అంశంలో ఇంకా ఏ విధంగా సమస్యలను ఇస్తుంటుంది ? ఒక్కోసారి పూర్తి స్థాయిగా అనుకూలతలను రుచి చూపించి, అకస్మాత్తుగా సమస్యలను చిత్రీకరిస్తుంది అనే అంశాలను కూడా తదుపరి పోస్టింగ్లో తెలుసుకుందాం. ఎందుకంటే ఎవరైనా ఆనందకరమైన స్థితులలో ఉండి, ఇటువంటి నాగ బంధన దోషాలను నమ్మకుండా ఉండే వారు కూడా ఉంటుంటారు. కనుక గత సంవత్సరాలలో ఈ బంధనాలు ఏయే సంవత్సరాలలో వచ్చాయో తెలుసుకుంటూ, ఆ సంవత్సర వివరాలను కూడా తదుపరి పోస్టింగ్లో చెప్పుకొని, భవిష్యత్ లో ఆనందకరమైన, సంతృప్తికరమైన, సుఖవంతమైన జీవితాన్ని పొందవచ్చును.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.