శ్రీ హేమలంబ మాఘ పూర్ణిమ 31 జనవరి 2018 బుధవారం కర్కాటకరాశిలో పుష్యమి,ఆశ్లేష నక్షత్రాలలో రాహుగ్రస్తంగా రక్తవర్ణంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును.ఇది నీలిరంగులో (బ్లూ మూన్ గా) ఉండదు. కేవలం రక్త వర్ణం మాత్రమే.ఈ చంద్ర గ్రహణం వలన ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Sunday, November 29, 2015

రవి, శనుల సంఘర్షణలో బుధ గ్రహం చేతనే చంద్రునికి అడ్డుకట్ట

ఆయుర్దాయము అంటే ఆయుష్యు. దీనినే ఆంగ్లంలో లైఫ్ స్పాన్ అంటారు. ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని సంవత్సరాలు జీవిస్తాడు. అని జ్యోతిష శాస్త్ర రీత్యా చెప్తారు. అయితే ఆయుష్యును నిర్ధారించే స్థానము జ్యోతిష శాస్త్రంలో అష్టమ స్థానము. ఇక్కడ ఒక విషయాన్నీ బాగా గమనించాలి. ఒక వ్యక్తి యొక్క ఆయుర్దాయము కేవలం 8వ స్థానం గురించి మాత్రమే చెప్పటం అతి కష్టము. ఎందుకంటే వ్యక్తి యొక్క మానసిక, శారీరక స్థితి గతులను చెప్పే లగ్న స్థానము, ఆరోగ్యాన్ని విశ్లేషించే చతుర్థ స్థానము, ప్రమాదాలు, అనారోగ్యము తెల్పే ఆరవ స్థానముల గురించి పూర్తిగా పరిశీలించి ఆతర్వాతనే జాతకుని యొక్క ఆయుర్దాయం ఎన్ని సంవత్సరాలో చెప్పాలి. ఇది నా పరిశోధనలో తెలుసుకున్న నగ్న సత్యం.

ఆయుష్కారకుడు శనిగ్రహం. ప్రతి వారికి శని గ్రహం అనగానే విపరీతమైన భయాలు, ఆందోళనలు ఉంటుంటాయి. ఇది కేవలం వారి భ్రమ మాత్రమే. ఒక వ్యక్తి యొక్క ఆయుర్దాయం గాని లేక ఒక వస్తువు యొక్క జీవిత స్థితి గాని లేక ఓ వాహనం యొక్క జీవన కాల పరిమితి గాని నిర్ణయించాలంటే... మన మనస్సు మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అప్పులు చేసి, తీర్చలేక ఆత్మహత్యలు చేసుకొనే వారు చాలా మంది ఉంటారు. అంటే ఇక్కడ ఆయుర్దాయమనేది మనిషి ఆలోచన పైన ఆధారపడి ఉంది.

ఆయుర్దాయం రెండు భాగాలతో నడుస్తుంది. ఎలాగంటే ఆయుర్దాయంలోని మొదటి సగభాగంలో, మనిషి నేర్చుకొనే దురలవాట్లే మిగిలిన 50 శాతం ఆయుర్దాయాన్ని కబళిస్తాయి. మంచి అలవాట్లు ఉంటే ఆయుర్దాయం పెరుగుతుంది. దురలవాట్లు ఉంటే ఆయు క్షీణమవుతుంది. కాని మంచి అలవాట్లు ఉండి కూడా ప్రమాదాలలో మరణించే వారు ఎందరెందరో ఉంటారు. మరి ఈ ప్రమాదం ఎక్కడ నుంచి వచ్చింది... అదే ఆరవస్థానం నుంచి తెలుసుకోవాలి. ఈ ఆరవ స్థానమే ప్రమాదాలు, దురలవాట్లు, రుగ్మతలు, శత్రుత్వాలు, శతృత్వ పోకడలు మొదలైనవి.  మొదటి దశలో మంచి అలవాట్లు నేర్చుకుంటే ఆయుష్యు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

చాలా మంది వ్యసనాలకు లోబడి ఆయుష్యును కోల్పోతుంటారు. వ్యసనమన్నది మనిషిని గతం తాలూకూ ఊబిలోనే సమాధి చేసే ఓ మార్గం లాంటిది. చాలా మంది జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచుకోలేక, అతిగా తినటం వలన ఊబకాయం వచ్చి కదలలేని పరిస్థితిలో ఉంటుంటారు. దీనినే స్వయంకృతాపరాధం అంటారు. అంటే తమ నాలుకను అదుపులో ఉంచుకోలేని కారణంగానే ఊబకాయం వచ్చింది. జాతకంలో షష్ఠ స్థానంలో అనారోగ్య స్థితి ఉంటే కూడా అలవాట్లు లేకున్నా ఊబకాయం వస్తుంది. అంటే ఆయుర్దాయం అనేది షష్ఠ స్థాన ఫలితాల మీద కూడా ఉండి తీరుతుందన్నమాట. ఆల్కాహాల్, మాదక ద్రవ్యాలు, దుష్ప్రవర్తన,జూదం వంటి పలు స్వీయ విధ్వంసకర అలవాట్లకు చిక్కి, వాటి నుంచి బయట పడలేక పోతున్న అభాగ్యులు ఎందరెందరో.

వ్యక్తిగతమైన అలవాట్లన్నీ చెడ్డవి కానక్కర్లేదు. అలవాటును వదులుకోవటం అన్నది, చెడు నడవడికను మార్చాలన్నదానిపై దృష్టి ఉంచటం ద్వారా జరగదు. తగిన ప్రత్యామ్నాయ ప్రవర్తన గురించి స్పష్టమైన అవగాహన పెంచుకున్న ద్వారానే సాధ్యపడుతుంది.

పొగ త్రాగటం మానాలని నిర్ణయించుకొని, చుట్ట, బీడీ, సిగిరేట్లను కాలికింద నలపటం ద్వారా ప్రయోజనం ఉండదు. కాని స్వచ్చమైన గాలిని శ్వాసించటం ద్వారా మాత్రమే అది వీలవుతుంది. అనివార్యమైన అలవాట్లను ఆదిలోనే కనిపెట్టి నివారించకపోతే, అవి జీవితంలో పెను విధ్వంసాలకే దారి తీస్తాయి. అలవాట్లను మార్చుకోవటం మీదే దృష్టి అంతటిని కేంద్రీకరించే బదులుగా, ముఖ్య అవసరమైన క్రొత్త అలవాట్ల జాబితాను తయారు చేసుకొని త్వరిత గతిన నిర్ణయాలని తీసుకోవటమనే విధానాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే, నిశ్చయంగా వ్యక్తులు అదృష్టవంతులవుతారు.

దురలవాట్లను మానుకోవట మన్నది బాహ్యపరమైన సంస్కరణల కన్నా, అంతః పరమైన పరిణితి ద్వారానే మొదలవుతుంది. ప్రతి వ్యక్తి యొక్క శారీరక, భౌతిక, మానసిక, భావోద్వేగ స్థితిగతులు ఆరోగ్యానికి అద్దం పడతాయని పేర్కొంటారు. వ్యక్తి ఎన్నో ఆదర్శ లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ, ఒకే ఒక దురలవాటుకు లోబడితే అది వైరస్ లాగా మిగిలిన మంచి లక్షణాలను హరించి వేసి.. వ్యక్తి యొక్క శారీరక, మానసిక వ్యవస్థలపై దుష్ప్రభావాన్ని చూపి సమతుల్యంలేని జీవితానికి దారి తీస్తుంది.

కనుక ప్రేమ, ఔదర్యా లే ఆరోగ్యకర భౌతిక జీవనానికి విత్తనాలు. ఏ అంశాలు స్వచ్చమైనవో, ఏవి కావో, ఏవి ప్రేమానురాగమైనవో, ఏవి కావో.. ఏవి అనుకూలమో, ఏవి  ప్రతికూలమో మొదలైన అంశాలన్నింటిని క్షుణ్ణంగా చెప్పగలిగే శక్తి బుద్ధి కారకుడైన బుధ గ్రహానికి మాత్రమే ఉంటాయి. చంద్రుడు మనసుకు కారకుడు. బుధుడు బుద్ధికి కారకుడు. అనుకూలంగా లేక వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొనే శక్తి చంద్రుడికి మాత్రమే ఉంది. కాని ఖచ్చిత నిర్ణయాలని తీసుకోలేడు. అందుకోసమే బుద్ధిబలంతో మానసిక స్థితి గతులను అంచనా వేసుకుంటూ చక్కని నిర్ణయాలను తీసుకోవాలి. ప్రస్తుతం వృశ్చిక రాశిలో రవి గ్రహ, శని గ్రహ కలయిక సందర్భంగా ప్రతివారు బుద్ది బలంతో నిర్ణయాలు తీసుకుంటే, వ్యక్తే కాకుండా సమాజమే కాకుండా దేశం యావత్తూ శాంతి ఏర్పడటానికి అవకాశం తప్పక ఉంటుంది. కనుక మనస్సు చేసే వ్యతిరేక నిర్ణయాలను బుద్ధిబలంతో కట్టడి చేయటానికి ప్రయత్నం చేయండి.

రాబోయే 2016లో ఇంతకంటే అధికంగా వ్యతిరేక గ్రహసంచార స్థితిగతులు రానున్నవి. కనుక సంయమనం పాటిస్తూ నేను చెప్పే విశ్లేషణలకు పెద్ద పీట వేస్తూ ముందుకు వెళ్ళగలిగితే, ప్రతివారికి శుభత్వమ్ ఆపాదిస్తుంది. - పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.