Tuesday, November 10, 2015

దీపావళి రోజున స్తోత్రాలు పఠిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందా ?

మానవుని జోతిర్మయ జీవనానికి సంకేతం దీపావళి. జ్యోతిస్సాక్షాత్కారం కోసం ఇహ పర సౌఖ్యాలు పొందటానికి మానవుడు జరుపుకొనే పర్వదినమే దీపావళి. మరి నరకాసుర వధకు సంతోష ప్రయత్నంగా బాణసంచా కాల్చారని పురాణం కథనం. మహా విష్ణువు వామన రూపంలో బలి చక్రవర్తిని పాతాళానికి అణగద్రొక్కినందునే దీపాలను వెలిగించి ఉత్సవం జరుపుకున్నారని మరో పురాణం కథనం. శ్రీ రాముడు రావణ సంహారం చేసి, చతుర్దశి రోజున పట్టాభిషేకం జరుపుకున్నాడని, అందుకే దేవతలు, మునులు మానవులు దీపాలను వెలిగించి సంతోషంతో పండగ చేసుకున్నారని, అదే దీపావళి అని మరో పురాణ కథనం. కాళికా మాత దీపావళి నాడే రాక్షస సంహారం చేసి ప్రళయ భావావేశంలో జీవరాశులన్నిటినీ నాశనం చేయటానికి ఉపక్రమించగా.. పరమేశ్వరుడు ఆ శక్తి ఎదుట నిలబడి ఆమె కోపోద్రేకాన్ని తగ్గించి, ఆమెని శాంతపరిచెనని మరో పురాణ గాధ. ఈ గాధ శత్రు సంహార కాలమున భయంకరమైన వారిపై సంహారం చేయాలని విశ్వశాంతికి భంగం వాటిల్లకూడదని ఓ సందేశాన్ని బోధిస్తుంది.

పై పురాణ గాధలు ఎన్ని ఉన్నప్పటికీ మనలోని అజ్ఞామనే అంధకారాన్ని జ్ఞానకాంతులు పెంపొందేలా  దీపాలను వెలిగించాలని మనం చెప్పుకుంటున్నాం. ఇంతవరకు బావుంది. బాణసంచా కాలుస్తున్నాం. దీపాలను వెలిగిస్తున్నాం. మరి లక్ష్మీ పూజ ఎందుకు?

దీపావళి పండుగకి, లక్ష్మీ పూజకు అసలు సంబంధం ఏమిటి? అసలు దీపావళి రోజున దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చటానికి వైజ్ఞానిక పరంగా ఓ అంతరార్ధం ఉంది. అదేమంటే ఆశ్వీజ, కార్తిక మాసాలు శరదృతువులో వస్తాయి. దీనికి ముందు వచ్చే శ్రావణ, భాద్రపదాలు వర్షఋతువుకి  చెందినవి. భారీ వర్షాల వలన క్రిమి, కీటకాదులు, దోమలు అధికమవుతుంటాయి. శరదృతువులో సూర్యుడు తులా రాశిలోకి వచ్చి భూమికి దూరమవుతుంటాడు. ఈ కారణంగా అంటువ్యాధులు, ఇతర సంబంధిత రుగ్మతలు నిర్మూలించటానికై పూర్వపు రోజులలో బాణసంచా కాల్చినందు వలన వెలువడే విష వాయువులచే క్రిములు నశిస్తాయని, దీపావళి నుంచి కార్తీకం చివరివరకు నిత్యం దీపాలు వెలిగించినందున... ఆ దీప కాంతులకు కొన్ని కీటకాలు ఆకర్షింపబడి... అగ్ని ప్రభావంచే చనిపోతుంటాయి. ఇది పూర్వీకుల ఆలోచన.

కాలం మారింది, ఋతు ధర్మాలే మారిపోతున్నాయి. ప్రతి ఇంతా దోమలు రాకుండానే కట్టుదిట్టంగా దోమతెరలతో పాటు రాత్రి సమయాలలో దోమలను సంహరించే మస్కిటో లిక్విడ్స్ విపరీతంగా వాడుతున్నారు. కేవలం నరకాసుర వధ జరిగిందనే ఆనందోత్సవాలతో బాణసంచా కాల్చాలనే ఓ ఆచారం ప్రస్తుతం వెర్రితలలు వేయటం విచారకరం. 70 అడుగుల నరకాసుర బొమ్మలను తయారుచేసి లక్షల రూపాయల ఖరీదుతో ఉన్న బాణసంచా కాల్చటం చేత వాటినుంచి వెలువడే విష వాయువులు ప్రజలకు, చిన్నారులకు, వృద్ధులకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయో  ఎవరూ ఊహించటం లేదు. అసలే పొల్యుషన్ పిశాచి నగరాలలో స్వైర విహారం చేస్తుంటే దీనికి తోడు మూకుమ్మడిగా చేసే నరకాసుర వధ అనే కోలాహలంతో వెలువడే విష వాయువులు, ఇంటింటా వేలాదిగా డబ్బు ఖర్చుపెడుతూ రణగన ధ్వనులు వచ్చే బాణసంచాలను కాల్చటం ఎంత వరకు సమంజసం.

విజ్ఞాన శాస్త్రాన్ని మానవ కల్యాణానికి దోహదపడేలా చూసుకోవాలె తప్ప మానవ వినాశనానికి నాంది కాకూడదు. భారీ నగరాలలో ఈ పర్వదినాన కాల్చిన బాణసంచా వ్యర్ధాలను వేలాది లారీలలో తరలించి, తిరిగి వాటిని ప్రభుత్వాల వారు కాలుస్తారు. వాటినుంచి వచ్చే పొగ, విషవాయువులు ఎంతటి ప్రమాదకరమైనవో ఎవరూ ఊహించరు.

అసలు ఎవడీ నరకాసురుడు ? ఈరోజుకి, లక్ష్మీ పూజకు సంబంధం ఏమిటి అనే అంశాలను కొంత తెలియచేయటానికి ప్రయత్నిస్తాను. సూర్యుడు, చంద్రుడు ఎదురెదురుగా అంటే 180 డిగ్రీల కోణంలో ఉంటే పూర్ణిమ తిధి వస్తుంది. అలా కాక ఈరెండూ గ్రహాలూ కలిసిపోతే అమావాస్య వస్తుంది. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. అమావాస్య తిధిన సూర్యుడు నుంచి వచ్చే కాంతి కిరణాల స్థితి మరియు అమావాస్య నాటి రాత్రి అంధకార స్థితిని సమన్వయము చేసుకుంటూ వెలిగించే జ్యోతులను పంచేద్రియాలలో ఒకటైన మన కనుల ద్వారా తదేక దృష్టితో వీక్షించటమే నిజమైన లక్ష్మీ పూజ.

అలాకాకుండా లక్ష్మీ దేవికి చెందిన అష్టోత్తరాలు, సహస్రనామాలు, శ్రీసూక్తము ఇత్యాదులు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిని పఠించిన వారికే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందా ? ఎలాంటి పాండిత్యం లేని విద్యాబుద్ధులు లేని పూజ ఎలా చేయాలో తెలియని వారికి లక్ష్మీ దేవి అనుగ్రహం లభించదా? అసలు ఈ పర్వదినాన లక్ష్మీ అంటే అర్థం ఏమిటి ? కేవలం డబ్బే ప్రధానంగా భావించి చేసే పూజనా ? కాదు.. కాదు.. కాదు... కానే కాదు. మరి ఏమిటి ?

ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వి అనే పంచ భూతాలతో ఏర్పడినదే ప్రపంచం. ఈ పంచభూత ప్రకృతే సూక్ష్మాంశంగా మారి 25 తత్వాలతో స్థూలదేహం ఏర్పాటు కాబడింది. పంచ భూతాలలోని ఆకాశం వల్ల కలిగిన జ్ఞానం, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే 5 తత్వాలను అంతఃకరణాలు అంటారు. వీటికి భిన్నమైన కార్యాచరణ ఉంది. ఇవి గుణ ప్రకృతులు. వాయువు, అగ్ని, జలం, పృథ్వి అనే నాలుగు భూతాలలోని సూక్ష్మాంశాలను జడ ప్రకృతులు అంటారు.

ఈ 25 తత్వాలతో పంచ భూతల సమిష్టితో స్థూలదేహం... సూక్ష్మ దేహంగా మారి దేహాన్ని, దేహిని నడిపిస్తుంటాయి. అందులో అంతర్గతంగా ఉన్న దివ్యమైన శక్తే ఆత్మ. అంతఃకరణాల కార్యాచరణ పరిశీలిస్తే జ్ఞానం సర్వాన్ని గుర్తిస్తుంది. మనసు దానిని సంగ్రహిస్తుంది. బుద్ధి అనేది అందులోని మంచి చెడులను నిర్ణయించి చిత్తానికి అప్పగిస్తుంది. చిత్తంలో ఏర్పడిన ధృడ భావం స్థిర సంకల్పంగా ఉండి... ఎన్నటికీ చెదిరిపోదు.

మనలో ఉన్న జ్ఞాన శక్తి ఒక విషయాన్ని గుర్తిస్తుందే తప్ప దానిలో ఉండే వాస్తవాన్ని గ్రహించలేదు. అందుకోసం ఆ విషయాన్నీ మనసుకు అందిస్తుంది. ఈ మనసు విషయానికి వస్తే ఇదో చంచలమైనది. దీనికో రెండు దోషాలున్నాయి. ఒక్కోసారి మంచివైపు, ఒక్కోసారి చెడువైపు లాగుతుంటుంది. నిర్ణయించే శక్తి మనసుకు లేనే లేదు. అలాంటప్పుడే బుద్ధికి పని తగులుతుంది. ఆ విషయాన్ని సక్రమంగా విశ్లేషణ చేసి మంచి ఏది ? చెడు ఏది ? సమ్మతమా ? అసమ్మతమా ? అంగీకరించాలా? త్రోసిపుచ్చాలా? ఈ విధంగా బుద్ది ఆలోచన చేసి ఓ చక్కని నిర్ణయాధికారంతో చిత్తానికి తేల్చి చెబుతుంది. చిత్తంలో ఏర్పడిన ధృడమైనటువంటి భావమే నేను అనేటువంటి వ్యక్తి నిర్వహించి కార్యరూపం చేస్తాడు. కనుక అంతఃకరణాల మధనంలో బుద్ది పాత్ర చాలా కీలకమైనది. బుద్ధిని సానబట్టి మెరుగులు దిద్దితేనే బుద్దిమంతుడవుతాడు.

మంచి చెడులకు బుద్దే కారణమని గీతాచార్యులు చెబుతారు. కర్ణుడు విశేషమైన శక్తి సంపన్నుడైనప్పటికీ చెడ్డ బుద్దులవారితో సహవాసం చేసి చెడిపోయాడు. కైకేయి మంధర చెప్పిన మాటలు విని తన స్వబుద్ధిని కోల్పోయి రామ పట్టాభిషేకాన్ని చెడగొట్టింది. రావణుడు దుర్భుద్ది  వల్లే నేలకొరిగాడు. కనుక బుద్ధిని నియంత్రించుకుంటూ సంస్కారమనే కొలమానికలను రాబట్టాలి.

ప్రతి మనిషి సంపాదించాల్సిన అసలైన సంస్కారమనే సంపద ఒకటి ఉంది. ఆ సంపదే లక్ష్మీ దేవి. ఇక్కడ లక్ష్మీ అంటే డబ్బు అని అర్ధం కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ సంపద పేరు శీలం. మనిషిని జ్ఞాన పథం వైపు నడిపిస్తూ జ్ఞాన కాంతులు నింపే  శీలం చేతనే శోభిస్తుంది. ఇటువంటి ఉత్తమ సంపదను పొందటానికి కొన్ని అర్హతలు ఉన్నాయని భగవద్గీతలోని 'దైవాసుర సంపద్విభాగ యోగమనే' 16వ అధ్యాయంలో కృష్ణ పరమాత్ముడు ఓ శ్లోకం చెప్పాడు... ఏమంటే... తేజస్సు, క్షమా, ధైర్యం, బాహ్య, ఆంతరంగిక శుద్ది, ద్రోహబుద్ది లేకుండా ఉండటం, దురభిమానాన్ని విడిచిపెట్టటం అనే గుణాలు దైవీ సంపదగా పేర్కొన్నాడు. ఉత్తమమైన శీలవంతుడు ఈ శ్లోకంలో చెప్పిన సంపదలన్నింటినీ (లక్ష్మీ) సంపాదించుకుంటే సమాజంలో అందరి చేత శభాష్ అనిపించుకోవటంలో సందేహం ఉండబోదు.

అందుకే మహాభారతంలోని శాంతి పర్వం మూడవ అధ్యాయంలో మనకి ఒక  కథ కనపడుతుంది. ధర్మరాజు సంపాదించిన సంపదలతో సమానమైన సంపద పొందాలంటే... మొట్ట మొదట సౌశీల్యాన్నీ సంపాదించాలని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడకు ఆ కథ వివరిస్తాడు. పూర్వం ప్రహ్లాదుడు సౌశీల్యంతోనే ఇంద్రుడి  రాజ్యాన్ని జయించాడు. పదవి పోయిన ఇంద్రుడు దేవ గురువు దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పి ఉపాయం చెప్పమంటాడు. తన దగ్గర ఉపాయం లేదని శుక్రాచార్యుల దగ్గరకు వెళ్ళమని దేవ గురువు సలహా ఇస్తాడు. శుక్రుడు కూడా తన వాళ్ళ కానే కాదని ప్రహ్లాదుడి దగ్గరకే పొమ్మని ఇంద్రునికి సూచిస్తాడు. ఈ సూచన మేరకు ఇంద్రుడు ఓ సాధారణ వేద పండితుడి రూపంలో ప్రహ్లాదుడి దగ్గరకు వెళ్ళాడు. ఆ సాధారణ పండితుని చూసి ప్రహ్లాదుడు భక్తితో నమస్కరించి ప్రస్తుతం తనకు తీరిక లేదని చెప్పాడు. అయినప్పటికీ పండితుని రూపంలో ఉన్న ఇంద్రుడు నిరీక్షిస్తూ ప్రహ్లాదుడి ముందే నిల్చున్నాడు. ఆ పండితుని సహనానికి మెచ్చుకొన్న ప్రహ్లాదుడు... వరం కోరుకోమన్నాడు. నీ శీలాన్ని నాకు అనుగ్రహించమని మారు వేషంలో ఉన్న ఇంద్రుడు అడిగాడు. ప్రహ్లాదుడు మొదట సందేహించినా, వేద పండితుని రూపంలో ఉన్న ఇంద్రుడి అసమాన తేజస్సును చూసి మాట తప్పితే మంచిది కాదని అనుకొని... వెంటనే తన శీలాన్ని ధారాదత్తం చేశాడు. మారువేషంలో ఉన్న ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ప్రహ్లాదుడు శీలాన్ని ఇంద్రుడు గ్రహించిన వెనువెంటనే... ప్రహ్లాదుడి శరీరం నుంచి ఓ ఛాయ రూపంలో ఓ ఆకారం వెలుపలికి వచ్చింది. దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న  ఆ ఆకృతిని (ఛాయా) చూసి  ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు. నేను నీ శీలాన్ని.. ఆ పండితునికి దానం చేశావు. కనుక అతని దగ్గరకు వెళ్తున్నాని చెప్పి వెళ్ళిపోయింది. మరుక్షణంలోనే లక్ష్మీ దేవి ప్రహ్లాదుడి ముందు ప్రత్యక్షమై.. ఓ రాజా ఇంతకాలం నీవు శీలం కలిగి ఉన్నందునే  నిన్ను ఆశ్రయించి ఉన్నాను. ప్రస్తుతం నీవు శీల రహితుడివి. నీ దగ్గర నేనిక నిలవలేను అంటూ లక్ష్మీ దేవి వెళ్ళిపోయింది.

కనుక ఈ ఆధునిక సమాజంలో ప్రతి వ్యక్తి  అజ్ఞానాన్ని వీడి  జ్ఞానకాంతులు నింపే శీలం అనే లక్ష్మీ సంపదను పొందినప్పుడే  కీర్తి ప్రతిష్టలతో తులతూగుతారు. మరి ఈ దీపావళి పర్వదినాన జ్ఞాన కాంతులు నింపే శీల సంపదను పొందటానికే లక్ష్మీ పూజను ఆచరించాలని పెద్దల మాట. ఇట్టి శీల సంపదను పొందటానికి లక్ష్మీ దేవి ఫోటో ముందు కూర్చొని స్తోత్రాలు చదివినంత మాత్రాన ఈ దైవీ సంపదను పొందగలమా? ఎలా పొందాలో తదుపరి పోస్టింగ్లో చూడండి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.