7 ఆగష్టు 2017 శ్రావణపూర్ణిమ సోమవారం నాడు పాక్షిక చంద్రగ్రహణ సందర్భంగా నూతన యజ్ఞోపవీత ధారణ మాత్రం ఉండదు. కానీ యధావిధిగా రక్షా బంధన కార్యక్రమములు నిరభ్యంతరంగా ఆచరించవచ్చును. శాస్త్రీయంగా పంచాంగగణిత రీత్యా రక్షాబంధనమునకు శుభసమయము మధ్యాహ్నము 11గంటల 4నిముషాల నుంచి సాయంత్రం 4గంటల 1నిముషం వరకు ఉన్నది. అయితే ఉదయకాలంలో రక్షాబంధనాలు చేయువారలకు అది నిషిద్ధ సమయమేమి కాదు. శాస్త్రీయతను కోరుకునేవారు పై సమయాన్ని స్వీకరించండి. - శ్రీనివాస గార్గేయ

Wednesday, November 4, 2015

నవంబర్ 7 మహా వజ్రేశ్వరి దేవి చెంతన గురుగ్రహం

దేవి ఖడ్గమాలలో కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నా, భేరుండా, వహ్నివాసిని, మహా వజ్రేశ్వరి, శివదూతి, త్వరితా, కులసుందరి, నిత్య, నీలపతాకా, విజయా, సర్వమంగళా, జ్వాలమాలిని, విచిత్రా అను 15 మంది నిత్య దేవతలు ఉంటారు. వీరు శుక్ల పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు ప్రతి రోజు కనపడే చంద్రుని యొక్క దేవి కళగా ఉందురు. బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న తిదులకు ఈ దేవతలే వెనుక నుంచి ముందుకు లెక్కించాలి. ఈ పరంపరలో 8వ తిధి దేవత త్వరితా. ఈమె శుక్ల పక్షంలోను, కృష్ణ పక్షంలోను ఒకరే. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అష్టమిచంద్రవిభ్రాజా అని ఉండును.
 

అయితే మహా వజ్రేశ్వరి అను దేవతా నామము  లలితా సహస్రనామ స్త్రోత్రంలో 468 గా ఉండును. ఈ దేవత శ్రీమన్నగరంలో 12వ ప్రాకారంపై జలంధర పీఠంపై పరివేష్టితురాలై ఉంటుంది. ఈ దేవత శుక్లపక్ష షష్టికి, బహుళ దశమికి దేవి కళగా విరాజిల్లుతుంటుంది. 

నవంబర్ 6 శుక్రవారం నాడు గురుగ్రహం చెంతకు ఆశ్వీజ బహుళ దశమి చంద్రుడు వస్తాడు. ఈ చంద్రుడిని మహా వజ్రేశ్వరి దేవికళ అని పిలుస్తారు. 6 శుక్రవారం ఉదయం సూర్యోదయాని కంటే ముందు తూర్పు దిశన గురుగ్రహం పక్కనే దశమి చంద్రుడు కనపడతాడు. చంద్రున్ని దర్శిస్తూ, చంద్రునిలో మహా వజ్రేస్వరీ దేవి రూపాన్ని దర్శించుకొనండి. ఈమె కెంపులతో పొదిగిన కిరీటాన్ని ధరించి రక్తవర్ణంగా ఉంటూ ఎర్రని వస్త్రాలను ధరించి 4 భుజాలతో ఉంటుంది. కుడివైపున ఒక చేతిలో దానిమ్మ పండు, ఎడమవైపు ఒక చేతిలో చెరకు గడలు ఉంటాయి. మిగిలిన చేతులలో పాశము, అంకుశాలు ఉండును. ప్రత్యేకంగా ఆనాడు  సూర్యోదయం కంటే ముందే మీరు కూడా అవకాశం ఉంటే భక్తితో దానిమ్మ పండును చేత పట్టుకొని గురుగ్రహం చెంతనున్న మహావజ్రేశ్వరి దేవిని వీక్షించండి. ఆ పండును కుటుంబ సభ్యులందరూ విశ్వాసంతో ప్రసాదంగా స్వీకరించండి. వాస్తవానికి గురు గ్రహం చెంతకు తరచుగా చంద్రుడు వస్తున్నప్పటికీ దశమి నాటి చంద్రుడు సూర్యోదయ శుభవేళలో ఆశ్వీజ మాసంలో కనపడటం అరుదైన సంఘటన. కనుక మహా వజ్రేశ్వరి దేవి అనుగ్రహానికి పాత్రులు కండి. కనపడేది చంద్రుడైనప్పటికీ ఆ చంద్రునిలో పైన చెప్పిన దేవి రూపకళను ఊహిస్తూ ధ్యానించండి, ప్రార్ధించండి, కీర్తించండి.

నవంబర్ 7 శనివారం రమా ఏకాదశి పర్వదినాన శుభగ్రహమైన శుక్రుని చెంతకు ఏకాదశి చంద్రుడు (వహ్నివాసిని దేవికళ) ఉండటం చూడగలం. కనుక ఈ అద్భుత గ్రహదర్శనాలని సూర్యోదయం కంటే ముందే మనం వీక్షించే అవకాశం కల్గనుంది.  - శ్రీనివాస గార్గేయ 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.