Wednesday, November 11, 2015

దీపావళి రోజున స్తోత్రాలు పఠిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందా ? - 2వ భాగం

 భారతీయుల పర్వదినాలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆచార వ్యవహారాల కలబోతగా ఉంటాయి. పండుగలలో భక్తి భావం వెళ్లి విరుస్తుంది. ఆనందోత్సవాలు ప్రతి ఇంటా తాండవిస్తాయి. ఘనమైన మన సంప్రదాయాలకు ప్రతీక దీపావళి వేడుక. పంచమ వేదమైన శ్రీ మహా భారతం అను శాసనిక పర్వంలో "దీపప్రదః స్వర్గలోకే దీపమాలేవ రాజతే" అనే శ్లోకాన్ని బట్టి మహా భారత కాలానికే దీపావళి విశేష ప్రాచుర్యం పొందినట్లుగా తెలుస్తున్నది. ధర్మ శాస్త్రాలలో పురాణ ఇతిహాసాలలో, ప్రాచీన గ్రంధాలలో దీపావళి పర్వదిన విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయి. 
 
అమావాస్య తిధి ఎప్పుడు వచ్చినా అది, పితృ సంబంధమైన తిధి. ఒక దీపావళి అమవాస్యకే వేదాంత పరిభాషలో ప్రేత అమావాస్య అంటారు. ఈ ప్రేత అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటల నుంచి పితృ దేవతలంతా ఆకాశ మార్గంలో వచ్చి నిలబడుతుంటారు. తమ సంతతి ఎలా ఉన్నారో చూడటానికే వారు వస్తారని పురాణాల కథనం. దీపావళి నాటి సాయంత్రం ప్రదోష వేళన అన్నీ పూజల కన్నా ముందుగా ఆచరించాల్సింది దివిటీలు కొట్టటం. దివిటీలు స్త్రీలు కొట్టరు. కుటుంబంలో ఉన్న మగవారిలో పెద్దవారు అనగా తండ్రి లేనటువంటి వారు గోవు కర్ర (ఎండిన గోంగూర చెట్టు కొమ్మలు) మీద వెలుగుతున్న కాగడాన్ని ఉంచి దక్షిణపు దిక్కుగా ఎత్తి చూపించాలి. ఇలా చూపిస్తూ ఆ వ్యక్తి ఏమని తలచాలంటే "నేను వేద ధర్మాన్ని తెలుసుకున్నాను. ఈ రోజు మధ్యాహ్నం భోజన సమయానికి ముందు పితృ దేవతలను స్మరించుకున్నాను. అవకాశమున్నవారు తిధి జరుపుకుంటారు లేదా ఓ ముద్ద కాకికి పెడతారు." ప్రస్తుతం చీకటిగా ఉంది. ఆకాశ మార్గం నుంచి మీరు బయల్దేరి కిందకి రండి. నేను వెలుతురు చూపిస్తున్నాను అని దివిటీ ఎత్తి చూపించాలి. దివిటీ ఎత్తి పితృ దేవతలకు చూపించే పర్వదినమే దీపావళి అమావాస్య. మనకు శరీరాన్నిచ్చి, తమ శరీరాలను విడిచిపెట్టిన పితృ దేవతలు ఆశ్వీజ మాస చిట్ట చివరి రోజున జ్యోతి స్వరూపులై అంతరిక్షంలో ప్రయాణం చేస్తుంటారు. వారిని గౌరవించాల్సిన అవసరం వారి వారి సంతతికి ఉంటుంది. ఇది చేయలేక పోయినా కనీసం తండ్రి లేని మగవారు ఇంటిలో దక్షిణపు దిక్కుగా రెండు వత్తులతో సాయంత్ర సమయంలో జ్యోతి ప్రజ్వలన చేయటం కనీస సంప్రదాయం. ఆ తర్వాతనే పితృ దేవతలకు దివిటీలతో స్వాగతాంజలి పలికిన తర్వాత దైవీ దేవతలకు పూజలు ఆచరిస్తాం.

ఈ పరంపరలోనే జ్ఞానానికి చిహ్నంగా, సమస్యలనే చీకట్లలో వెలుగు చూపించటానికి దేవతా మూర్తులకు ప్రార్ధనా పూర్వకంగా వెలిగించేవి దీపాలు. మనచుట్టూ ఉన్న చీకట్లను పారద్రోలినట్లుగానే అజ్ఞానాన్ని తరిమికొట్టే జ్ఞాన దీపాన్ని వెలిగించాలి. ఈ జ్ఞాన దీపమే అసలు సిసలైన లక్ష్మీ ఆరాధనగా పేర్కొనాలి. సాయంత్రం నుంచి ఎన్నో దీపాలను వెలిగించినప్పటికీ, జ్ఞాన దీపాన్ని మాత్రం అమావాస్య తిధి నాటి అర్ధరాత్రి (నిశీధి) సమయంలోనే వెలిగించాలి. ఈ 2015లో నిశీధిలో అమావాస్య తిధి లేదు . అందుకోసం భారత దేశంలో సాయంత్రం 5గం.49నిముషాల నుంచి 7గం.49 నిముషాల మధ్య కాలంలో నువ్వుల నూనెతోనే 8 వత్తులు లేక 5 వత్తులు లేక 2 వత్తులతో దీప ప్రజ్వలన చేయాలి.

పంచేంద్రియాలలో మొదటిదైన మన నేత్రాలతో జ్ఞాన దీప జ్యోతులను తదేకంగా కొద్దిసేపు చూస్తూ, మానసికంగా భక్తి భావంతో లక్ష్మి దేవిని స్మరించాలి. ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందీ ఆ జ్యోతి దర్శనాన్ని చేయాల్సిందే. నువ్వుల నూనెతో వెలిగే జ్యోతినుంచి వెలువడే కాంతి కిరణాలు, గుర్తించటానికి వీలులేని విధంగా వచ్చే వాయువు, మన నేత్రాలకు సోకటంతో... ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి బుద్ది సక్రమంగా పని చేయటంతో కొన్ని కొన్ని సౌశీల్య లక్షణాలు ఏర్పడుతుంటాయి. ఈ విధంగా సౌశీల్య లక్షణాలు (ద్రోహబుద్ది లేకుండటం, క్షమా గుణాన్ని కలిగి ఉండటం, దురభిమానాన్ని విడనాడటం మొదలైనవి) ఒక అమావాస్య తోనే పొందలేము. ప్రతి అమావాస్య రోజున ఇలా ఆచరిస్తూ దీపావళి అమావాస్యన విశేషంగా జ్ఞాన జ్యోతులను వీక్షిస్తుంటే అసలైన దైవీ సంపదను పొందవచ్చు. ఇట్టి దైవీ సంపదను ఎవరైతే పొంది ఉంటారో వారికి మాత్రమే మహాలక్ష్మి అనుగ్రహం, కటాక్షం లభిస్తుందని శాస్త్ర వచనం.

అంతేతప్ప సౌశీల్య లక్షణాలు లేకుండా లక్ష్మీ స్తోత్రాలన్నింటినీ పఠిస్తు ఇంటి నిండా దీపాలను వెలిగించి అనేకానేక నివేదనలు సమర్పించినప్పటికీ అనుగ్రహం ఉండనే ఉండదు. ఇది అక్షర సత్యము. అటు భగద్గీత, ఇటు మహా భారతం ఈ అంశాలను స్పష్టం చేస్తున్నాయి.

కనుకనే సౌశీల్య లక్షణాలను ఒక్క రోజులో పొందటం అసాధ్యమైన విషయం. అందుకోసం ప్రతి అమావాస్య తిధిని ఆధారంగా చేసుకుంటూ భక్తి విస్వాశాలతో పూజ మందిరంలో లక్ష్మీ దేవి చెంతన జ్ఞాన దీపాన్ని వెలిగించి... జ్యోతి పైననే దృష్టి ఉంచి, మనసును ప్రక్క దార్లకు మళ్ళించ కుండా చేతనైన రీతిలో లక్ష్మీ దేవిని ప్రార్ధించండి. (ఇలానే ప్రార్ధించాలి అనే నియమం ఏమి లేదు) మీకు నచ్చిన, మీకు మెచ్చిన ఓ తీపి పదార్ధాన్ని లక్ష్మి దేవి ముందున్న జ్ఞాన జ్యోతికి నివేదించండి. ఇంటిల్లపాది... ఒక్కొక్కరు కనీసం ఒక్కో నిముషమైనా తదేకంగా జ్ఞాన జ్యోతిని దర్శిస్తే, అనుగ్రహం  లభిస్తుంది. తెలుగు నిఘంటువులో లక్ష్మీ అనే పదానికి ఒక్కసారి అర్ధం ఏముందో గమనించారనుకోండి, బుద్ది అనేది గంధ ద్రవ్యము అని ఉంటుంది. అంటే మన బుద్ధిని సరియైన రీతిలో తీసుకొని వెళ్లి సౌశీల్య లక్షణాలను పొందుటకు తగు రీతిలో బుద్ధిని ప్రేరేపించే విధి విధానమే ఈ జ్ఞాన జ్యోతి వీక్షణ. అంతే తప్ప ఏదో పూజ మందిరంలో, ఓ పటం పెట్టి, పూలు పెట్టి నాలుగు స్తోత్రాలు చదివినంత మాత్రాన అనుగ్రహం కలగదని పాఠకులు తెలుసుకోవాలి.

చివరగా... అమావాస్య తిధికి, ఆ తర్వాత వచ్చే శుక్ల పాడ్యమి తిధులకు నిత్య తిధి దేవత పేరే కామేశ్వరి. మొత్తం 15 మంది నిత్య తిధి దేవతలు ఉంటారు. అట్టి దేవతలలో ఈ రెండు తిధుల దేవి కళగా కామేశ్వరి ఉంటుంది. కోటి సూర్యులు ఉదయించే సమయంలో ఎంత అరుణ కాంతి భాసిల్లునో అంత కాంతితో ఈ తల్లి వెలుగొందుతుంటుంది. దేవి ఖడ్గమాలలో ఈ నామాలు చెప్పబడతాయి. ఏతా వాతా పాఠకులకు తెలియచేసేది ఏమిటంటే కేవలం టపాసులు విపరీతంగా కాల్చి, వాటి ద్వారా వచ్చే విషవాయువులచే ఇతరులు ఎంతో మంది భాదపడతారేమో అనే విషయాన్ని గ్రహించి భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలకు సరియైన రీతిలోనే పర్వదినాన్ని ఆచరిస్తారని మనసార కోరుకుంటూ... ఓపికగా చదివి ఆకళింపు చేసుకున్న ప్రియ పాఠకులందరికి హృదయ పూర్వక దీపావళి పర్వదిన శుభాకాంక్షలతో.... మీ శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.