Wednesday, October 28, 2015

26వ తేది వస్తే భూకంపాలు వస్తాయా ?

ప్రపంచ చరిత్ర పేజీలలో కన్నీటి సిరాతో విషాదాక్షరాలను కొన్ని కొన్ని రోజులు లిఖిస్తుంటాయి. ఇప్పటి వరకు సంభవించిన కొన్ని భయానిక ప్రకృతి ఉత్పాతాలు పరిశీలిస్తుంటే కొంతమంది... క్యాలెండర్ తేదిలలో 26 వరల్డ్ వరస్ట్ డే గా గుర్తించాలి అంటుంటారు. ఇక వివరాలలోకి వస్తే 26 జూన్ 1926న ఆసియన్ టర్కీగా పిలుచుకొనే ఆంటోలియాలోని రోడ్స్ నగరంలో భూకంపం విలయ తాండవం చేసింది. 26 డిసెంబర్ 1939 టర్కీలో పెను భూకంపం సంభవించింది. 26 జూలై 1963లో యుగోస్లేవియా భూకంపం వచ్చి ఆరువేల మంది మరణిస్తే, 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 26 జూలై 1976న చైనాలో అత్యంత దారుణ భూకంపం సంభవించి రెండున్నర లక్షల మంది మరణించారు. 26 డిసెంబర్ 1996లో హిందూ మహా సముద్రంలో పుట్టిన సునామి దెబ్బకు నాల్గుదేశాలలో రెండులక్షల మంది మరణించారు. 26 జనవరి 2001న గణతంత్ర దినోత్సవాన గుజరాత్ భూకంపంతో పాతికవేల మందికి పైగా మరణించారు. 26 డిసెంబర్ 2003 ఇరాన్ భూకంపంలో ముప్పై వేలమంది పైన చనిపోయి బూమ్  నగరాన్నే భూకంపం భూమిలో కలిపేసింది. 26 డిసెంబర్ 2004 ఇండోనేషియాలోని సుమత్రా దేవీలలో సునామి ఎగిసిపడి దాదాపు మూడులక్షల మందిని పొట్టన పెట్టుకుంది. 26 జూలై 2005న ప్రకృతి వైపరీత్యాలతో ముంబైలో భారీ వరదలు సంభవించాయి. 26 ఫిబ్రవరి 2010 లో కూడా జపాన్లో భూకంపం సంభవించి ఆస్తి నష్టం జరిగింది. 26 జూలై 2010 తైవాన్ భూకంపంతో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. 26 ఏప్రిల్ 2015 నేపాల్ భూకంపం షుమారు పదివేలమందిని చంపింది. నిన్న కాక మొన్న 26 అక్టోబర్ 2015న  హిందూ కుష్ పర్వత ప్రాంతాలలో సంభవించిన భూకంపం దెబ్బకు ఆఫ్ఘన్, పాకిస్తాన్లు వణికిపోయాయి.

పైన చెప్పిన భూకంపాలన్నీ 26వ తేదీనే వచ్చినటువంటివి. ఇవి కాక ఇతర తేదిలలో కూడా పెను భూకంపాలు వచ్చినట్లుగా చరిత్ర చెబుతుంది. కేవలం 26వ తేది మాత్రమే భయపెట్టే సంఖ్యగా భావించేవారు ఎందరెందరో ఉంటారు. యాదృచ్చికంగా ఈ తేది సంభవించింది. గ్రహచార స్థితిగతులు, ఇతర అరిష్ట యోగాలు ఉన్నప్పుడే ప్రకృతి సంబంధిత ఉత్పాతాలు వస్తుంటాయి. కనుక 26వ తేది దోషమని, ఈ అంకె కలిపితే 8 సంఖ్య వస్తుందని, 8 అంటే శని గ్రహ సంకేతమని, 8 సంబంధిత తేదీలు,సమస్యలు వస్తాయని భయపడే వారు చాలా మంది ఉంటుంటారు. కనుక భవిష్య కాలంలో వచ్చే 26వ  తేదిను గురించి భయం చెందవద్దు. - శ్రీనివాస గార్గేయ

Saturday, October 24, 2015

ఏక బిందువుపై గురు, శుక్రుల శుభ దర్శనం

సింహరాశిలో గురు ప్రవేశంతో గోదావరి నదికి పుష్కరాలు ప్రారంభమై 79 రోజులపాటు దేవ గురువు బృహస్పతి నిందితుడైనందున శుభకార్య పరంపర ఆగిపోయింది. అత్యంత అరుదుగా సింహరాశిలో ఒకే బిందువుపై శుభగ్రహ దర్శనం కలుగుతున్నది. అట్టి గురు, శుక్రుల శుభ దర్శనాన్ని అక్టోబర్ 26 సోమవారం ఉదయం సూర్యోదయానికి ముందు 120 నిముషాల ముందు నుంచి వీక్షించవచ్చు. ఇట్టి ఏక బిందు స్థితిలో గురువుతో కలసిన శుక్ర జంట గ్రహ శుభదర్శనమ్ పలు దశాబ్దాల తదుపరి ఆసన్నమగును.

26 అక్టోబర్ సోమవారం ఉదయం తూర్పు దిశలో శుక్రుడు తేజోవంతమైన కాంతి నక్షత్రంతోను, ప్రక్కనే శుభగ్రహమైన గురువు మరో నక్షత్రంగా దర్శనం ఇవ్వనున్నారు. కనుక గురు గ్రహ కవచాన్ని భక్తి విశ్వాసాలతో 5 పర్యాయములకు తగ్గకుండా పఠించండి. గురు, శుక్రులు జంట గ్రహాలూ కనపడుతున్నందున... గత పోస్టింగ్లోని  శుక్ర కవచాన్ని ఐదు మార్లు, ఈ పోస్టింగ్ లోని గురు కవచాన్ని 5 మార్లు చక్కగా మనఃస్పూర్తితో పఠించండి.

గురు గ్రహ ధ్యానమ్
అభీష్టఫలదం వందే సర్వఙ్ఞం సురపూజితమ్ |
అక్షమాలాధరం శాంతం ప్రణమామి బృహస్పతిమ్ ||


గురు గ్రహ కవచమ్
బృహస్పతిః శిరః పాతు లలాటం పాతు మే గురుః |
కర్ణౌ సురగురుః పాతు నేత్రే మేభీష్టదాయకః || 1 ||

జిహ్వాం పాతు సురాచార్యః నాసం మే వేదపారగః |
ముఖం మే పాతు సర్వఙ్ఞః కంఠం మే దేవతాగురుః || 2 ||

భుజా వంగీరసః పాతు కరౌ పాతు శుభప్రదః |
స్తనౌ మే పాతు వాగీశః కుక్షిం మే శుభలక్షణః || 3 ||

నాభిం దేవగురుః పాతు మధ్యం పాతు సుఖప్రదః |
కటిం పాతు జగద్వంద్యః ఊరూ మే పాతు వాక్పతిః || 4 ||

జానుజంఘే సురాచార్యః పాదౌ విశ్వాత్మకః సదా |
అన్యాని యాని చాంగాని రక్షేన్మే సర్వతో గురుః || 5 ||


ఫలశృతిః
ఇత్యేతత్కవచం దివ్యం త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వాన్ కామానవాప్నోతి సర్వత్ర విజయీ భవేత్ ॥


పైన పేర్కొనబడిన ధ్యానమును మరియు కవచాన్ని పఠించలేనివారు ... దిగులు చెందవలసిన అవసరం లేదు. శరీర శుద్ధితో శుభ గ్రహాలను వీక్షిస్తూ, భక్తి, విశ్వాసాలతో.. తమపై చక్కని అనుగ్రహం చూపమని హృదయ పూర్వకంగా ప్రార్ధించండి. కవచ స్తోత్రాలను పఠిస్తు ప్రార్ధించిననూ లేక మీకు ఇష్టమైన రీతిలో ప్రార్ధించిననూ ఎటువంటి నివేదనలు అవసరం లేదు. మనఃశుద్ధితో చేసే ప్రార్దనే అన్నింటికంటే ముఖ్యమని భావించాలి.

శుక్ర నక్షత్రంలో అరుదైన శుక్ర గ్రహ దర్శనం

గోదావరి పుష్కరాలు ప్రారంభం నుంచి మొదటి 79 రోజులలో శుభగ్రహమైన గురువు వర్జితుడని శాస్త్ర వచనం. మఖ నక్షత్ర 4 పాదాలు, పుబ్బ నక్షత్ర ఒక పాదము వెరసి మఘాది పంచ పాదాలు దాటి పుబ్బ నక్షత్ర రెండవ పాదంలో శుభ గ్రహ దర్శనాలు జరుగుతున్నాయి.

పుబ్బ నక్షత్రం అంటే శుభగ్రహమైన శుక్రుని యొక్క స్వనక్షత్రము. ఈ శుక్ర నక్షత్రంలో ఓ ప్రత్యేక బిందువు వద్ద శుక్రుడు తేజో కాంతితో విరాజిల్లుతున్నాడు. ఇట్టి స్థితి తిరిగి రావాలంటే (ఏక బిందువు దగ్గర గురువుతో కలసిన స్థితి) పలు దశాబ్దాల సమయం  పట్టును. 


25 అక్టోబర్ ఆదివారం ఉదయం తూర్పు దిశలో శుభగ్రహమైన శుక్రుడు తేజోవంతమైన కాంతి నక్షత్రంతో దర్శనం ఇవ్వనున్నాడు. కనుక  బ్రహ్మాండ పురాణంలో అందించిన శుక్ర గ్రహ కవచాన్ని... శుక్రున్ని వీక్షించి ఈ ధ్యానంతో శుక్ర కవచాన్ని భక్తి విశ్వాసాలతో 5 పర్యాయములకు తగ్గకుండా పఠించండి.

శుక్ర గ్రహ ధ్యానమ్
మృణాలకుందేందుపయోజసుప్రభం
పీతాంబరం ప్రసృతమక్షమాలినమ్ |
సమస్తశాస్త్రార్థవిధిం మహాంతం
ధ్యాయేత్కవిం వాఞ్ఛితమర్థసిద్ధయే || 1 ||


శుక్ర గ్రహ కవచమ్
శిరో మే భార్గవః పాతు భాలం పాతు గ్రహాధిపః |
నేత్రే దైత్యగురుః పాతు శ్రోత్రే మే చందనద్యుతిః || 2 ||


పాతు మే నాసికాం కావ్యో వదనం దైత్యవందితః |
వచనం చోశనాః పాతు కంఠం శ్రీకంఠభక్తిమాన్ || 3 ||


భుజౌ తేజోనిధిః పాతు కుక్షిం పాతు మనోవ్రజః |
నాభిం భృగుసుతః పాతు మధ్యం పాతు మహీప్రియః || 4 ||


కటిం మే పాతు విశ్వాత్మా ఉరూ మే సురపూజితః |
జానుం జాడ్యహరః పాతు జంఘే ఙ్ఞానవతాం వరః || 5 ||


గుల్ఫౌ గుణనిధిః పాతు పాతు పాదౌ వరాంబరః |
సర్వాణ్యంగాని మే పాతు స్వర్ణమాలాపరిష్కృతః || 6 ||


ఫలశ్రుతిః
య ఇదం కవచం దివ్యం పఠతి శ్రద్ధయాన్వితః |
న తస్య జాయతే పీడా భార్గవస్య ప్రసాదతః || 7 ॥


ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్పబడినది. 

పైన పేర్కొనబడిన శుక్ర గ్రహ ధ్యానమును మరియు కవచాన్ని పఠించుటకు సమస్యలున్నవారు... దిగులు చెందవలసిన అవసరం లేదు. శరీర శుద్ధితో శుభ గ్రహమైన శుక్రగ్రహాన్ని వీక్షిస్తూ, భక్తి, విశ్వాసాలతో.. తమపై చక్కని అనుగ్రహం చూపమని హృదయ పూర్వకంగా ప్రార్ధించండి. పై శ్లోకాలు పఠించి ప్రార్ధించిననూ లేక మీకు ఇష్టమైన రీతిలో ప్రార్ధించిననూ ఎటువంటి నివేదనలు అవసరం లేదు. మనఃశుద్ధితో చేసే ప్రార్దనే అన్నింటికంటే ముఖ్యమని భావించాలి. తదుపరి పోస్టింగ్ లో గురు గ్రహ ధ్యానం కూడా అందిస్తాను.

Thursday, October 22, 2015

14 రోజుల పాటు శుభగ్రహ దర్శనాలు

అక్టోబర్ 25 ఆదివారం నుంచి నవంబర్ 7 శనివారం వరకు 14 రోజుల పాటు... ప్రతి నిత్యం తూర్పు దిశలో సూర్యోదయానికి 2గంటల ముందు నుంచి శుభ గ్రహాలను దర్శించి.... అనుగ్రహాన్ని పొందండి. ఇక వివరాలలోకి వస్తే సింహరాశిలోకి గురు ప్రవేశం జరిగిన తర్వాత 79రోజుల పాటు గురు గ్రహము పుష్కర సందర్భంగా సర్వత్రా వర్జితమయ్యే విధంగా ఉండిపోయింది. అంతేకాక ఈ 79 రోజులలోనే గురు గ్రహానికి మరియు శుక్ర గ్రహానికి కూడా మౌడ్యములు ఆపాదించినవి. 2015 సెప్టెంబర్ 30 సాయంత్రం 6.13 లకు గురువు మఘాది పంచ పాదాలు దాటటం పూర్తి చేసుకొని శుభకరమైన స్థితిలోనికి రావటం జరిగినది.

సింహరాశిలోనే శుభులైన గురు గ్రహము, శుక్ర గ్రహము ప్రస్తుతం సంచారం చేస్తున్నారు. వీరిరువురు సింహరాశిలోనే ఒక విశిష్ట బిందువు వద్దకు త్వరలో రాబోతున్నారు. 25 ఆదివారం నాడు శుక్ర గ్రహాన్ని, 26 సోమవారం నాడు గురు, శుక్ర గ్రహాలను, 28 బుధవారం నాడు శుభ గ్రహాలైన గురు, శుక్రులతో పాటు మంగళకర గ్రహమైన అరుణవర్ణ అంగారకుడిని(కుజుడు) తూర్పు దిశలోనే సూర్యోదయం కంటే ముందు రెండు గంటల నుంచి భక్తి విశ్వాసాలతో దర్శించుకోనండి. ఈ అపురూపమైన గ్రహ దర్శనం అదే సింహరాశిలో అదే బిందువు వద్ద కలవటమనేది మరికొన్ని దశాబ్దాల తర్వాతనే జరగనుంది.

ప్రస్తుతం తూర్పు దిశలో సూర్యోదయం కంటే ముందు నుంచే సహజంగానే శుక్రుడు కాంతివంతంగా ఉండే నక్షత్ర ఆకారంలోనూ, దానికి కొద్దిగా దిగువగా మరికొంత కాంతి తక్కువ నక్షత్రంగా గురుగ్రహము, దానికి దిగువగా స్వల్ప అరుణవర్ణంతో మిణుకు మిణుకులాడే కుజ గ్రహం కనపడుతుంటాయి. కాని విశిష్ట బిందువు వద్దకు చేరటం మాత్రం ఈ నెల 25 సోమవారం కానున్నది. కనుక పాఠకులు సూర్యోదయం ముందే లేచి శుచిగా శుభ గ్రహ దర్శనాన్ని చేసుకొనగలరు.

అంతేకాకుండా నవంబర్ 6 శుక్రవారం నాడు గురు గ్రహం చెంతకు ఆశ్వీజ బహుళ దశమి ( మహా వజ్రేశ్వరి దేవికళతో ఉన్న) చంద్రుడు వస్తాడు. నవంబర్ 7 శనివారం రమా ఏకాదశి పర్వదినాన శుభగ్రహమైన శుక్రుని చెంతకు ఏకాదశి చంద్రుడు (వహ్నివాసిని దేవికళ) ఉండటం చూడగలం. కనుక ఈ అద్భుత గ్రహదర్శనాలని సూర్యోదయం కంటే ముందే మనం వీక్షించే అవకాశం కల్గనుంది. కనుక ద్వాదశ రాశులవారు ఆయా రోజులలో దర్శనం తదుపరి ఆచరించాల్సిన విధి విధానాలను తదుపరి పోస్టింగ్లో చూడండి. - శ్రీనివాస గార్గేయ