Saturday, August 29, 2015

మూల నక్షత్రంలో వర వర్షిని 2

నవగ్రహాలలోని చంద్రుడు, కుజుడు, రవి, బుధుడు అనబడే నాలుగు గ్రహాలు ప్రతి వ్యక్తిని అనుకూల స్థితుల లోనికి లేదా ప్రతికూల అంశాల లోనికి తీసుకుని వెళ్ళుటకు ఉపయుక్తమవుతుంటాయి. మనః కారకుడు చంద్రుడు. బుద్ది కారకుడు బుధుడు. ఆత్మ కారకుడు రవి. శరీరంలోని రక్త మాంసాలకు ప్రాతినిధ్యం వహించే గ్రహం కుజుడు.

సరియైన అవగాహనతో ప్రతి విషయాన్ని ఆలోచించి ఆకళింపు చేసుకుని సద్భావనతో ముందుకు వెళ్తుంటే విజయం వెన్నంటే ఉంటుంది. అలా కాక పూర్తి వ్యతిరేక ధోరణితో దుర్మార్గంలో పయనిస్తే.... ప్రారంభంలో ఏదో విజయం సాధించామనే నమ్మకం కల్గిననూ, దీర్ఘ కాలంలో సమస్యలకు హేతువై అపజయంతో కృంగిపోయి కీర్తి ప్రతిష్టలు దెబ్బతినును. కనుక ప్రతి వ్యక్తికి అవగాహనతోటి ఆలోచనను అందించే చంద్రుని కట్టడి చేయాలంటే.... సామాన్యమైన పని కాదు. కనుక మనిషి జయాపజయాలకు ప్రధాన కారకుడు చంద్రుడే. ఈ చంద్రుడి స్వక్షేత్రమే కర్కాటక రాశి.

అలాగే బుద్ధి కారకత్వాన్ని ఇచ్చే గ్రహము బుధుడు. ఒక వ్యక్తి ఓ తప్పు చేస్తే బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను అంటాడు తప్ప మనసు గడ్డి తిని తప్పు చేశాను అనడు. ఇక్కడ బుద్ధికి మనసుకి వ్యత్యాసముంది. ఈ బుధుని యొక్క క్షేత్రాలే కన్య, మిథున రాశులు.

ఇక ఆత్మ కారకుడు రవి. మనసుకి ఆత్మకి కూడా చాలా వ్యత్యాసముంది. ఆత్మ మనసు బుద్ది కలయికలతో వ్యక్తి స్థితిగతులు మారుతుంటాయి. ఈ మారే ప్రభావాన్ని బట్టి వ్యక్తిలో రక్త ప్రసరణలో కూడా హెచ్చు తగ్గులు వస్తుంటాయి. ఈ రక్త ప్రసరణకు చేయూతనిచ్చే గ్రహం కుజుడు. గౌరవ ప్రదంగా మాట్లాడటానికి కుజుడు ఎంత దోహదపడతాడో... అహంకార పూరితంగా, ద్వేషంతో రగిలిపోవటానికి కూడా కుజుడు అంతే దోహదపడతాడు.

కనుక మనస్సు, బుద్ధి, చిత్తము, గౌరవ, అహంకారాలకు ప్రతీకలుగా ఉన్న చంద్రుడు, బుధుడు, రవి, కుజ గ్రహాల హెచ్చు తగ్గులను ఆహారపు అలవాట్లతో మార్చుకోవచ్చునని పురాతన శాస్త్రాలు ఉద్భోదిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ నాల్గు గ్రహాలను కట్టడి చేసే శక్తి యుక్తులు పొందగలరో .... ఆనాడే నిజ జీవితంలో విశేష విజయాలతో పాటు దీర్ఘాయువుని పొందుతూ ఆర్ధిక స్థితిని అందించే మూల నక్షత్ర వర వర్షిని శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహాన్ని కూడా పొందగలరు. మరి ఆహారపు నియమాలతోనే నాల్గు గ్రహాల కట్టడిని ఏ విధంగా పొందాలో తెలుసుకుంటే... ఆర్ధికంగా పరిపుష్టి నొందగలరు, సమాజంలో అభివృద్దిని సాధించగలరు. మూల నక్షత్ర వర వర్షిని రెండవ వీడియో ను కూడా కొద్ది సేపు వీక్షించటానికి ప్రయత్నించండి. - శ్రీనివాస గార్గేయ 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.