Tuesday, September 2, 2014

అంతర్లీన దోషాలు - 3

కొన్ని కొన్ని ప్రత్యేక అంతర్లీన గ్రహస్థితులు అనేక రకాలుగా జాతకాలలో అంతర్లీనంగా దాగి ఉంటాయి. ఇట్టి గ్రహస్థితులను జ్యోతిష పండితులు ప్రత్యక్షంగా గ్రహించలేరు. జాతకంలోని పన్నెండు భావాలలో, సమస్యలు ఎక్కడా లేనే లేవని, పండితులు బల్ల గుద్ది చెప్పినప్పటికీ, ఈ జాతకులు మాత్రం సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. పితరులు చేసిన పుణ్య కార్యాల ఫలిత ప్రభావం ఉన్ననూ, అది జాతకులలో  అదృష్ట , ఆకర్షిత గ్రహస్థితిగా ఉంటే మంచిదే. కాని ఇట్టి అదృష్ట , ఆకర్షిత గ్రహస్థితి ప్రతివారి జాతకాలలో ఉండదు. కొంత మందికి మాత్రమే పరిమితము. అలా కాక తమ పితరులు చేసిన పాప కార్యాల ఫలితాల ప్రభావాన్ని వారి సంతానం అందుకొనే గ్రహస్థితి ఉంటే దానిని దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితిగా భావించాలి. ఇట్టి దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితి కూడా అందరికీ ఉండదు. కొంత మందికి మాత్రమే పరిమితము.

పితరులు చేసిన కార్యాల ప్రభావం అదృష్ట, దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితులుగా జాతకాలలో ఉంటుంటాయి. ఇవి అందరి జాతకాలలో ఉంటాయనుకోవటం పొరపాటు. నూటికి 85 శాతం వరకు మాత్రం ఆకర్షిత గ్రహస్థితులు ఉంటున్నట్లుగా మా పరిశోధనలో వెల్లడైనది.

ప్రతి వ్యక్తి జీవితంలో వైఫల్యాలు, మానసిక వ్యధలు అప్పుడప్పుడూ ఎదురవుతుంటాయి. ఈ జీవితమే ఓ పెద్ద చలన చిత్రముగా భావించాలి. ఈ జీవితమనే సినిమా ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ప్రతి మనిషి ఇందులో ఒక పాత్ర పోషిస్తూ ఉంటాడు. గడిచిన కాలము, జరిగే కాలము, రేపటి కాలము.... అంతయూ ఈ సినిమా రీల్ లో ముందుగానే బంధించబడి ఉంటుంది. ఈ మూడు కాలాలలోనూ ఒక పనిని ఫలాని సమయంలో చేయాలని ముందే నిర్దేశింపబడి ఉంటుంది. ప్రస్తుతం ఈ అంతర్లీన దోషాలను పఠించాలని కూడా మీ జీవిత సినిమాలో నిర్దేశింపబడింది కనుకనే.... మీరు చదువుతున్నారు.

కాలం గడుస్తున్న కొద్దీ భవిష్యత్ వల్ల కలిగే సుఖ దుఖాలను అనుభవిస్తుంటాం. మన పూర్వ జన్మ కర్మానుసారంగానే ఈ జన్మలో ఆ కర్మకు ఆధారభూతమైన కధగా మన జీవితం రూపుదిద్దుకుంటుంది. కాబట్టి మన జీవన స్థితిని మార్చజాలము.

కర్మ సిద్ధాంతం ప్రకారం అవకాశం రావటం లేదా అనుకోనిది సంభవించటం కేవలం మిథ్య. మనం ఊహించే అవకాశాలు గాని ఊహించని సంఘటనలు గాని మనం ముందుకు తెలుసుకోలేకపోయినప్పటికీ... అవి కొన్ని విస్పష్టమైన కారణాల వలన జనించినవే. యాదృశ్చికంగా కావచ్చు, లేదా దైవ సంకల్పం వలన జరిగిందేమో అని సాధారణ వ్యక్తులు భావించినప్పటికీ సశాస్త్రీయ దృష్టితో ఆలోచించే జ్యోతిష్కుడు మాత్రం ముందుగా పసిగట్టగలడు, అంతేకాక వాటిని సహజమైనవిగా, జరుగవలసిఉన్నవిగా, కర్మకు అనుసరణీయములని ముందుగా చెప్పగలడు.   

మరికొంత విశ్లేషిస్తే విత్తనం నుంచి ఓ చెట్టు మొలకెత్తి, పెరిగి పెద్దదై తాను కాసేటటువంటి పండ్ల నుంచి తిరిగి విత్తనాలను అందించే ఓ వృక్షం వంటిదే మన కర్మ, జన్మ, జీవితం. విత్తనం కర్మ, పెరిగే వృక్షం జీవితం. విత్తనం ఎలాంటిదో... దాని నుంచి మొలకెత్తి పైకి వచ్చే మొక్క కూడా అలాంటిదే మరి. మిరప చెట్టుకు వంకాయ కాయదు, నారింజ చెట్టుకు ఆపిల్స్ లభించవు.

ప్రతి జీవి తన గమ్యాన్ని తానే సాధించుకుంటుంటాడు. కర్మ కొద్దీ కష్టాలు ప్రాప్తిస్తాయని తాను అర్థం చేసుకోవాలి. కర్మ సిద్ధాంతం మాత్రమే జీవితానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, దానిని ఏ విధంగా ఎదుర్కోవాలనే మానసిక సంసిద్ధతను వ్యక్తికి కల్గిస్తుంది. ఇటువంటి జ్ఞానం వ్యక్తి జీవితాన్ని గాని, తోటి వారిని గాని, దైవాన్ని గాని నిందించకుండా చేస్తుంది. వ్యక్తుల జీవితాలలో ఏ తప్పులు జరగనప్పటికీ, వారు ఎందుకు బాధలు పడతారో... ఓ భగవత్ సంబంధమైన కర్మ సిద్ధాంతం మాత్రమే వివరించగలదు, విశ్లేషించగలదు.

కనుక ప్రజలకు అనవసరమైన సమస్యలు, బాధలు రాకూడనివి అయినప్పటికీ, గ్రహ దోషాల వలన కలిగాయేమో అనుకుంటారు. గ్రహాలూ అదృష్టాన్ని గాని, దురదృష్టాన్ని గాని కలిగించవని చాలా మంది అనుకుంటుంటారు. మన జీవన గమనాలను, సంఘటనలను మాత్రమే గ్రహాలు సూచిస్తాయని, అసలు కారణం కర్మ అని ఇది  దైవ సంకల్పంగానే జరుగుతుందని పురాతన తాళపత్ర గ్రంధాలు తెలియచేస్తాయి.

మనం భగవంతుడిని వర్షపు నీరుగా కాసేపు పోల్చుకుందాం. ఈ వర్షపు నీరులో విత్తనాలను నానబెడితే.... కొన్ని మాత్రమే మొలకెత్తి పెరిగి పెద్దవవుతాయి. మరికొన్ని మొలకెత్తి స్వల్ప కాలంలోనే నశిస్తాయి. మరికొన్ని మొలకెత్తకుండానే నశిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతున్నది ? దానికి సమాధానం మీ అందరికీ తెలిసే ఉంటుంది.... ఏమిటంటే విత్తనపు సారాన్ని బట్టి ఇలా జరుగుతుంటుంది. అలాగే ఒక వ్యక్తి గత జన్మలో ఏ కర్మ చేసి ఉంటాడో, వాటి ఫలితాలను ఈ జన్మలో ఎప్పుడెప్పుడు ఎలా అనుభవిస్తాడో... వివరించేదే జ్యోతిష్యం. కాని గ్రహాల గమనాలను బట్టి తయారయ్యే జాతక చక్రంలో ఆకర్షిత అదృష్ట గ్రహస్థితి ఉందా లేక దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితి ఉందా తెలుసుకోవాలి. ఒకవేళ ఉంటే అది మనలను అనుకూలం వైపు ఆకర్షిస్తున్నదా లేక వికర్షిస్తున్నదా గమనించాలి. అలా కాక దురదృష్ట గ్రహస్థితి ఉంటే అది కూడా జాతకులను ఆకర్షిస్తుందా లేక వికర్షిస్తున్నదా గమనించాలి.    

ఈ గమనింపులో కొన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి. అవి ఏమిటంటే చనిపోయిన పితరులు, మన ప్రారబ్దం, మన మనోబలం, భగవంతునిపై అపారమైన నమ్మకం ఉంటూ జ్యోతిష విలువలు కూడా పెద్ద పీట వేయాలి. ఈ పరంపరలో చాలా మంది జ్యోతిష్యులను సంప్రదిస్తూ వివిధ రకములైన హోమాలను, జపతపాదుల వంటి శాంతి క్రియలను ఆచరిస్తుంటారు. మరి శాంతి క్రియలను ఆచరించినంత మాత్రాన వరుస విజయాలతో ఆనందమైన జీవితం లభిస్తుందా.... మరి పితరులు చేసిన పాప పుణ్యాల సంగతేమిటి... ఈ శాంతి క్రియల వలన పితరులు చేసిన పాపక్రియ కొట్టుకొని పోతుందా... ఒకవేళ పితరులు పాప కార్యాలు ఆచరించి ఉంటే శాంతి క్రియలచే అవి సరిక్రొత్త రీతిలో పుణ్య ప్రభావాలను జీవించి ఉన్నవారికి అందిస్తాయా... మొదలైన ఆసక్తికర అంశాలు అంతర్లీన దోషాలు - 4 లో చదువగలరు.                           - శ్రీనివాసగార్గేయ