Saturday, May 24, 2014

హ్రీంకార యజ్ఞము - సర్వరక్షాకర చక్ర అవసర సారంశము 9

6. సర్వరక్షాకర చక్రము

పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో ఆరవచక్రమే సర్వరక్షాకర చక్రము. శ్రీచక్ర మేరులో పీఠంపై  బహిర్దశారం పైన పది కోణాలు కల్గిని ఆవరణ ఉంటుంది.  దీనిని అంతర్దశారం అంటారు.    
 
ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలలో ఆరవదిగా ఉన్నఆజ్ఞా చక్రమే. ఇది శరీరంలో రెండు కనుబొమ్మల మధ్య గా స్థానం.  ఈ సర్వరక్షాకర చక్రములో పది మంది నిగర్భయోగినీ దేవతలు ఉంటారు.

సంగీతంలోని సప్త స్వరాలలో ఇది "రిషభ" స్థానము. రిషభం అనగా "రి" స్వరము. వృషభం యొక్క గొంతుకతో "రి" స్వరాన్ని ఉచ్చరించాలి. వృషభం ధర్మానికి ప్రతీక. గురువు మనకు ఏది ధర్మమో, ఏది అధర్మమో ఉపదేశిస్తాడు. శిష్యులను ధర్మమార్గ ప్రవర్తకులను చేస్తాడు. సాధకుడు గురువును ఆశ్రయించిన తరువాత, తన సంగతి గురువే చూసుకుంటాడు. అందుకే దీనిని సర్వరక్షాకర చక్రమన్నారు. లలితా సహస్రనామావళిలో ఈ చక్ర అంశాలను గురించి  521, 522, 523, 524, 525, 526, 527 నామాలలో స్పష్టం చేయటమైనది. 

మనమీద ఎవరికైనా కోపం వస్తే దేవుడు లేక దేవత రక్షిస్తుంది. ఆ దేవుడు లేక దేవతకు మనమీదనే కోపం వచ్చినపుడు గురువు రక్షిస్తాడు. ఎవరిమీదనైనా గురువుకి కోపం వస్తే వారిని ప్రపంచంలోని ఏ శక్తి రక్షించలేదు. భారతీయ సాంప్రదాయంలో గురువుకు అంత విశిష్ట స్థానం ఇచ్చారు. అందుకే ఈ చక్రాన్ని సర్వరక్షాకరచక్రమన్నారు. 

శ్రీ లలితా సహస్రనామాలలో "రక్షాకరీ" అను 317వ నామం కలదు. అనేక రకాలుగా మనకు తెలియకుండానే మనకు రక్షణ కావలసివుంటుంది. ఆకలి నుంచి, వేదన నుంచి, అజ్ఞానం నుంచి కూడా రక్షించగల శక్తి అమ్మవారు. ఎన్నో విధాలుగా తను ఉపాసించిన భక్తులను కాపాడు తల్లి గనుక రక్షాకరీ అన్నారు. ఈ నామాన్ని విడదీస్తే రక్షా+ఆకరీ. ఆకరము అంటే స్థానము. రక్షాకరీ అనగా రక్షణకు స్థానమైనది. దీనికి గుర్తుగా రెండు కనుబొమ్మల మధ్యనుండే ఆజ్ఞా చక్ర స్థానాములో శ్రీమాత కుంకుమను బొట్టు రూపంలో సాధకులు ధరిస్తుంటారు. 
 
సర్వరక్షాకర చక్రానికి అధిష్టాన దేవతే త్రిపురమాలినీ . ఈ చక్రానికి ప్రదర్శించవలసిన ముద్ర పేరే సర్వమహాంకుశా. 

లలితా సహస్రనామావళిలో 875వ నామం త్రిపురమాలినీ. త్రిపురములను మాలగా ఉన్న తల్లి అని అర్ధము. ఈ జగత్తంతా మూడేసి వర్గములుగా, విధములుగా ఉన్నది. కనుక ఈ మూడు అన్నది జగద్వాక్యము. పూలన్నీ ఒక చోట కుప్పగా వేస్తె దానిని మాలా అని పిలవరు. ఒకదానితో ఒకటి కలిపి దారముతో కట్టినప్పుడే మాల అనబడును. మన శరీరము మూడు ముక్కలుగా లేదు. స్థూల, సూక్ష, కారణ శరీరములనబడే మూడు త్రిపురములుగా కలిపి ఉన్నది. స్థూల శరీరం క్రియా శక్తి, సూక్ష శరీరం జ్ఞాన శక్తి, కారణ శరీరం ఇచ్ఛా శక్తి. ఈ మూడు శక్తులనే మనం మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతిగా ప్రార్థిస్తాము.

కనుక
సర్వరక్షాకర చక్రములోని 10 నిగర్భయోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉంటుందో చివరలో ఉండే వీడియోలో ఆరవముద్రను గమనించండి. 
 
1. ఓం హ్రీం సర్వజ్ఞాయై విద్మహే హ్రీం మహామాయాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

2. ఓం హ్రీం సర్వశక్త్యై విద్మహే హ్రీం మహాశక్త్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

3. ఓం హ్రీం సర్వైశ్వర్యప్రదాయై విద్మహే హ్రీం ఐశ్వర్యాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

4. ఓం హ్రీం సర్వజ్ఞానమయ్యై విద్మహే హ్రీం జ్ఞానాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

5. ఓం హ్రీం సర్వవ్యాధివినాశిన్యై విద్మహే హ్రీం ఔషధాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

6. ఓం హ్రీం సర్వాధారస్వరూపిణ్యై విద్మహే హ్రీం ఆధారాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

7. ఓం హ్రీం సర్వపాపహరాయై విద్మహే హ్రీం సర్వతీర్థస్వరూపిణ్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

8. ఓం హ్రీం సర్వానందమయ్యై విద్మహే హ్రీం మహానందాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

9. ఓం హ్రీం సర్వరక్షాస్వరూపిణ్యై విద్మహే హ్రీం సర్వరక్షణాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

10. ఓం హ్రీం సర్వేప్సిత ఫలప్రదాయై విద్మహే హ్రీం ఫలాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
  
 

తదుపరి పోస్టింగ్ లో ఏడవదైన సర్వరోగహర చక్రం గురించి తెలుసుకుందాం.                                                         - శ్రీనివాస గార్గేయ 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.