Thursday, May 15, 2014

హ్రీంకార యజ్ఞము - సర్వార్థసాధక చక్ర అవసర సారంశము 8

5.  సర్వార్థ సాధకచక్రము  

పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో ఐదవచక్రమే సర్వార్థ సాధక చక్రము. శ్రీచక్ర మేరులో పీఠంపై  చతుర్దశారం పైన పది కోణాలతో ఉండే చక్రము, దీనిని బహిర్దశారము అంటారు.    

దీనికి 10 కోణాలు ఉంటాయి.  ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలలో ఐదవదిగా  ఉన్నవిశుద్ధి చక్రమే. ఇది శరీరంలో కంఠస్థానం దగ్గర ఉండును. ఈ సర్వార్థ సాధక చక్రములో పది మంది కులోత్తీర్ణ యోగినీ దేవతలు ఉంటారు.

వాక్కునకు నాలుగు రూపాలు ఉంటాయి. పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అనే నాలుగు రూపాలు. ఇవి లలితా సహస్రంలోని  366, 368, 370, 371 నామాలలో స్పష్టమవుతుంది. 366 సంఖ్యలో ఉన్న పరాయై అనగా మానవుడు ఏది చేయాలన్నా లేదా పలకాలన్నా అంటే తన ఆలోచన లేక మాట లేక నిర్ణయం మెదడు స్థానంలో ఉన్న సహస్రారమున కల్గును. సహస్రారమందలి పరా దశలో ఉన్న వాక్కే పరా వాక్కు. 

368 సంఖ్యలో ఉన్న పశ్యంత్యై అనగా ఈ వాక్కు లేక శబ్దం లేక నాదం జనించుటకు వాయువు అవసరం. ఎప్పుడైతే సహస్రారంలో ఓ మాట పలకాలి లేక ఓ శబ్దం చేయాలి అనే ఆలోచన రాగానే, పరా నాడి వలన ప్రేరణ పొంది, వాయువు మూలాధార చక్రంలో ఏర్పడును. కనుక ఇట్టి మూలాధార చక్రంలో ఉండే వాక్కు యొక్క దశనే పశ్యంతి దశ అంటారు. 

370 సంఖ్యలో ఉన్న మధ్యమాయై అనే నామానికి అర్థం ఏమిటంటే పై విధంగా మూలాధారంలో జనించిన వాయువు స్వాధిష్టాన, మణిపూరక చక్రములను సుషుమ్న నాడి ద్వారా దాటి అనాహత చక్రమునకు చేరిన దశనే మధ్యమా అంటారు. 

371 సంఖ్యలో ఉన్న వైఖరీరూపాయై అనే నామానికి అర్థం ఏమిటంటే అనాహత చక్రంలో మధ్యమా రూపంలో ఉన్న వాక్కు... విశుద్ధి చక్రాన్ని చేరి, అక్కడ ఆ శబ్దము ఒక స్పష్టమైన అక్షర రూపమును పొంది ఉచ్చరింపబడును. ఇదే వాక్కు యొక్క వైఖరీ రూపము. 

పై నాలుగు నామాలలోని నాల్గు దశలలో వాక్కు అనేది అస్పష్టంగా (వాయురూపంలో) ఉంటుంది. నాల్గవ నామంలో చెప్పిన వైఖరీ రూపంలోనే మాటగా స్పష్టమై ఇతరులకి వినపడుతుంది. అందుకే ఈ నాల్గు రూపాలతో ఉన్న వాక్కుకు సర్వార్థసాధకము అని పేరు.  సమస్త  విద్యలన్నీ కంఠస్థానములో ఉన్న విశుద్ధి చక్రము నుండే వైఖరీ రూపంలో వస్తుంటాయి. 

సర్వార్థసాధక చక్రానికి అధిష్టాన దేవతే త్రిపురాశ్రీ. మూలాధారంలో త్రిపురా అని చెప్పబడ్డ దేవత... ఇక్కడ త్రిపురాశ్రీ అని పిలవబడుచున్నది. శ్రీ అనగా శ్రీవిద్య. శ్రీవిద్య ఒక్కటే మోక్షప్రదము. మిగిలిన విద్యలన్నీ డబ్బు సంపాదించుకొని ఉదర పోషణతో బ్రతకటానికే. 

శ్రీ లలితా రహస్య సహస్ర నామాలలో మొత్తం 12 సార్లు ( 1, 2, 3, 56, 85, 127, 392, 585, 587, 996, 997, 998) మాత్రమే శ్రీ అనే అక్షరంతో నామాలు ఉన్నవి. పరోక్షంగా చెప్పాలంటే పంచదశీ మహామంత్రాన్ని ఈ లోకంలోకి తెచ్చినవారు పన్నెండు మంది. వారికి ప్రతీకగా ఈ నామాలలో పన్నెండు సార్లు శ్రీ ఉన్నది. ఈ పన్నెండు మందే మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, నందికేశ్వరుడు, సూర్యుడు, ఇంద్రుడు, విష్ణువు, శివుడు, దుర్వాసుడు.  ఈ పన్నెండు మందే ప్రఖ్యాతి గడించిన దేవి ఉపసాక మహానుభావులు. 

ఈ చక్రంలోని శ్రీ అనే పదానికి పరిపూర్ణమైన భావాలన్నీ హ్రీంకార మహాయజ్ఞ పుస్తకంలో ఉండును. 

ఈ చక్రానికి ప్రదర్శించవలసిన ముద్ర పేరే సర్వోన్మాదినీ.

కనుక సర్వార్థ సాధక చక్రములోని 10 కులోత్తీర్ణ యోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉంటుందో చివరలో ఉండే వీడియోలో ఐదవముద్రను గమనించండి.
   
1. ఓం హ్రీం సర్వసిద్దిప్రదాయై విద్మహే హ్రీం శ్వేతవర్ణాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

2. ఓం హ్రీం సర్వసంపత్ప్రదాయై విద్మహే హ్రీం మహాలక్ష్మ్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

3. ఓం హ్రీం సర్వప్రియంకర్యై విద్మహే హ్రీం కుందవర్ణాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

4. ఓం హ్రీం సర్వమంగళకారిణ్యై విద్మహే హ్రీం మంగళాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

5. ఓం హ్రీం సర్వకామప్రదాయై విద్మహే హ్రీం కల్పలతాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

6. ఓం హ్రీం సర్వదుఃఖవిమోచన్యై విద్మహే హ్రీం హర్షప్రదాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

7. ఓం హ్రీం సర్వమృత్యుప్రశమన్యై విద్మహే హ్రీం సర్వసంజీవిన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

8. ఓం హ్రీం సర్వవిఘ్ననివారిణ్యై విద్మహే హ్రీం సర్వకామాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

9. ఓం హ్రీం సర్వాంగసుందర్యై విద్మహే హ్రీం జగద్యోన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

10. ఓం హ్రీం సర్వసౌభాగ్యదాయిన్యై విద్మహే హ్రీం జగజ్జనన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

 

తదుపరి పోస్టింగ్ లో ఆరవదైన సర్వరక్షాకర చక్రం గురించి తెలుసుకుందాం.                                                                          - శ్రీనివాస గార్గేయ   

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.