Saturday, May 31, 2014

హ్రీంకార మహాయజ్ఞ నిర్ణయ తేదిలో మార్పు

అనివార్య కారణములచే హ్రీంకార మహాయజ్ఞం కార్యక్రమం జూన్ 10 మంగళవారం కాకుండా మరొక రోజున జరుపబడును. తేది, వేదిక త్వరలో తెలియచేయబడును. విధి విధానాలను మాత్రం యధావిధిగా బ్లాగ్ లో ఇవ్వబడునని గమనించేది - శ్రీనివాస గార్గేయ

Saturday, May 24, 2014

హ్రీంకార యజ్ఞము - సర్వరక్షాకర చక్ర అవసర సారంశము 9

6. సర్వరక్షాకర చక్రము

పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో ఆరవచక్రమే సర్వరక్షాకర చక్రము. శ్రీచక్ర మేరులో పీఠంపై  బహిర్దశారం పైన పది కోణాలు కల్గిని ఆవరణ ఉంటుంది.  దీనిని అంతర్దశారం అంటారు.    
 
ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలలో ఆరవదిగా ఉన్నఆజ్ఞా చక్రమే. ఇది శరీరంలో రెండు కనుబొమ్మల మధ్య గా స్థానం.  ఈ సర్వరక్షాకర చక్రములో పది మంది నిగర్భయోగినీ దేవతలు ఉంటారు.

సంగీతంలోని సప్త స్వరాలలో ఇది "రిషభ" స్థానము. రిషభం అనగా "రి" స్వరము. వృషభం యొక్క గొంతుకతో "రి" స్వరాన్ని ఉచ్చరించాలి. వృషభం ధర్మానికి ప్రతీక. గురువు మనకు ఏది ధర్మమో, ఏది అధర్మమో ఉపదేశిస్తాడు. శిష్యులను ధర్మమార్గ ప్రవర్తకులను చేస్తాడు. సాధకుడు గురువును ఆశ్రయించిన తరువాత, తన సంగతి గురువే చూసుకుంటాడు. అందుకే దీనిని సర్వరక్షాకర చక్రమన్నారు. లలితా సహస్రనామావళిలో ఈ చక్ర అంశాలను గురించి  521, 522, 523, 524, 525, 526, 527 నామాలలో స్పష్టం చేయటమైనది. 

మనమీద ఎవరికైనా కోపం వస్తే దేవుడు లేక దేవత రక్షిస్తుంది. ఆ దేవుడు లేక దేవతకు మనమీదనే కోపం వచ్చినపుడు గురువు రక్షిస్తాడు. ఎవరిమీదనైనా గురువుకి కోపం వస్తే వారిని ప్రపంచంలోని ఏ శక్తి రక్షించలేదు. భారతీయ సాంప్రదాయంలో గురువుకు అంత విశిష్ట స్థానం ఇచ్చారు. అందుకే ఈ చక్రాన్ని సర్వరక్షాకరచక్రమన్నారు. 

శ్రీ లలితా సహస్రనామాలలో "రక్షాకరీ" అను 317వ నామం కలదు. అనేక రకాలుగా మనకు తెలియకుండానే మనకు రక్షణ కావలసివుంటుంది. ఆకలి నుంచి, వేదన నుంచి, అజ్ఞానం నుంచి కూడా రక్షించగల శక్తి అమ్మవారు. ఎన్నో విధాలుగా తను ఉపాసించిన భక్తులను కాపాడు తల్లి గనుక రక్షాకరీ అన్నారు. ఈ నామాన్ని విడదీస్తే రక్షా+ఆకరీ. ఆకరము అంటే స్థానము. రక్షాకరీ అనగా రక్షణకు స్థానమైనది. దీనికి గుర్తుగా రెండు కనుబొమ్మల మధ్యనుండే ఆజ్ఞా చక్ర స్థానాములో శ్రీమాత కుంకుమను బొట్టు రూపంలో సాధకులు ధరిస్తుంటారు. 
 
సర్వరక్షాకర చక్రానికి అధిష్టాన దేవతే త్రిపురమాలినీ . ఈ చక్రానికి ప్రదర్శించవలసిన ముద్ర పేరే సర్వమహాంకుశా. 

లలితా సహస్రనామావళిలో 875వ నామం త్రిపురమాలినీ. త్రిపురములను మాలగా ఉన్న తల్లి అని అర్ధము. ఈ జగత్తంతా మూడేసి వర్గములుగా, విధములుగా ఉన్నది. కనుక ఈ మూడు అన్నది జగద్వాక్యము. పూలన్నీ ఒక చోట కుప్పగా వేస్తె దానిని మాలా అని పిలవరు. ఒకదానితో ఒకటి కలిపి దారముతో కట్టినప్పుడే మాల అనబడును. మన శరీరము మూడు ముక్కలుగా లేదు. స్థూల, సూక్ష, కారణ శరీరములనబడే మూడు త్రిపురములుగా కలిపి ఉన్నది. స్థూల శరీరం క్రియా శక్తి, సూక్ష శరీరం జ్ఞాన శక్తి, కారణ శరీరం ఇచ్ఛా శక్తి. ఈ మూడు శక్తులనే మనం మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతిగా ప్రార్థిస్తాము.

కనుక
సర్వరక్షాకర చక్రములోని 10 నిగర్భయోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉంటుందో చివరలో ఉండే వీడియోలో ఆరవముద్రను గమనించండి. 
 
1. ఓం హ్రీం సర్వజ్ఞాయై విద్మహే హ్రీం మహామాయాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

2. ఓం హ్రీం సర్వశక్త్యై విద్మహే హ్రీం మహాశక్త్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

3. ఓం హ్రీం సర్వైశ్వర్యప్రదాయై విద్మహే హ్రీం ఐశ్వర్యాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

4. ఓం హ్రీం సర్వజ్ఞానమయ్యై విద్మహే హ్రీం జ్ఞానాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

5. ఓం హ్రీం సర్వవ్యాధివినాశిన్యై విద్మహే హ్రీం ఔషధాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

6. ఓం హ్రీం సర్వాధారస్వరూపిణ్యై విద్మహే హ్రీం ఆధారాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

7. ఓం హ్రీం సర్వపాపహరాయై విద్మహే హ్రీం సర్వతీర్థస్వరూపిణ్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

8. ఓం హ్రీం సర్వానందమయ్యై విద్మహే హ్రీం మహానందాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

9. ఓం హ్రీం సర్వరక్షాస్వరూపిణ్యై విద్మహే హ్రీం సర్వరక్షణాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

10. ఓం హ్రీం సర్వేప్సిత ఫలప్రదాయై విద్మహే హ్రీం ఫలాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
  
 

తదుపరి పోస్టింగ్ లో ఏడవదైన సర్వరోగహర చక్రం గురించి తెలుసుకుందాం.                                                         - శ్రీనివాస గార్గేయ 

Thursday, May 15, 2014

హ్రీంకార యజ్ఞము - సర్వార్థసాధక చక్ర అవసర సారంశము 8

5.  సర్వార్థ సాధకచక్రము  

పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో ఐదవచక్రమే సర్వార్థ సాధక చక్రము. శ్రీచక్ర మేరులో పీఠంపై  చతుర్దశారం పైన పది కోణాలతో ఉండే చక్రము, దీనిని బహిర్దశారము అంటారు.    

దీనికి 10 కోణాలు ఉంటాయి.  ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలలో ఐదవదిగా  ఉన్నవిశుద్ధి చక్రమే. ఇది శరీరంలో కంఠస్థానం దగ్గర ఉండును. ఈ సర్వార్థ సాధక చక్రములో పది మంది కులోత్తీర్ణ యోగినీ దేవతలు ఉంటారు.

వాక్కునకు నాలుగు రూపాలు ఉంటాయి. పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అనే నాలుగు రూపాలు. ఇవి లలితా సహస్రంలోని  366, 368, 370, 371 నామాలలో స్పష్టమవుతుంది. 366 సంఖ్యలో ఉన్న పరాయై అనగా మానవుడు ఏది చేయాలన్నా లేదా పలకాలన్నా అంటే తన ఆలోచన లేక మాట లేక నిర్ణయం మెదడు స్థానంలో ఉన్న సహస్రారమున కల్గును. సహస్రారమందలి పరా దశలో ఉన్న వాక్కే పరా వాక్కు. 

368 సంఖ్యలో ఉన్న పశ్యంత్యై అనగా ఈ వాక్కు లేక శబ్దం లేక నాదం జనించుటకు వాయువు అవసరం. ఎప్పుడైతే సహస్రారంలో ఓ మాట పలకాలి లేక ఓ శబ్దం చేయాలి అనే ఆలోచన రాగానే, పరా నాడి వలన ప్రేరణ పొంది, వాయువు మూలాధార చక్రంలో ఏర్పడును. కనుక ఇట్టి మూలాధార చక్రంలో ఉండే వాక్కు యొక్క దశనే పశ్యంతి దశ అంటారు. 

370 సంఖ్యలో ఉన్న మధ్యమాయై అనే నామానికి అర్థం ఏమిటంటే పై విధంగా మూలాధారంలో జనించిన వాయువు స్వాధిష్టాన, మణిపూరక చక్రములను సుషుమ్న నాడి ద్వారా దాటి అనాహత చక్రమునకు చేరిన దశనే మధ్యమా అంటారు. 

371 సంఖ్యలో ఉన్న వైఖరీరూపాయై అనే నామానికి అర్థం ఏమిటంటే అనాహత చక్రంలో మధ్యమా రూపంలో ఉన్న వాక్కు... విశుద్ధి చక్రాన్ని చేరి, అక్కడ ఆ శబ్దము ఒక స్పష్టమైన అక్షర రూపమును పొంది ఉచ్చరింపబడును. ఇదే వాక్కు యొక్క వైఖరీ రూపము. 

పై నాలుగు నామాలలోని నాల్గు దశలలో వాక్కు అనేది అస్పష్టంగా (వాయురూపంలో) ఉంటుంది. నాల్గవ నామంలో చెప్పిన వైఖరీ రూపంలోనే మాటగా స్పష్టమై ఇతరులకి వినపడుతుంది. అందుకే ఈ నాల్గు రూపాలతో ఉన్న వాక్కుకు సర్వార్థసాధకము అని పేరు.  సమస్త  విద్యలన్నీ కంఠస్థానములో ఉన్న విశుద్ధి చక్రము నుండే వైఖరీ రూపంలో వస్తుంటాయి. 

సర్వార్థసాధక చక్రానికి అధిష్టాన దేవతే త్రిపురాశ్రీ. మూలాధారంలో త్రిపురా అని చెప్పబడ్డ దేవత... ఇక్కడ త్రిపురాశ్రీ అని పిలవబడుచున్నది. శ్రీ అనగా శ్రీవిద్య. శ్రీవిద్య ఒక్కటే మోక్షప్రదము. మిగిలిన విద్యలన్నీ డబ్బు సంపాదించుకొని ఉదర పోషణతో బ్రతకటానికే. 

శ్రీ లలితా రహస్య సహస్ర నామాలలో మొత్తం 12 సార్లు ( 1, 2, 3, 56, 85, 127, 392, 585, 587, 996, 997, 998) మాత్రమే శ్రీ అనే అక్షరంతో నామాలు ఉన్నవి. పరోక్షంగా చెప్పాలంటే పంచదశీ మహామంత్రాన్ని ఈ లోకంలోకి తెచ్చినవారు పన్నెండు మంది. వారికి ప్రతీకగా ఈ నామాలలో పన్నెండు సార్లు శ్రీ ఉన్నది. ఈ పన్నెండు మందే మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, నందికేశ్వరుడు, సూర్యుడు, ఇంద్రుడు, విష్ణువు, శివుడు, దుర్వాసుడు.  ఈ పన్నెండు మందే ప్రఖ్యాతి గడించిన దేవి ఉపసాక మహానుభావులు. 

ఈ చక్రంలోని శ్రీ అనే పదానికి పరిపూర్ణమైన భావాలన్నీ హ్రీంకార మహాయజ్ఞ పుస్తకంలో ఉండును. 

ఈ చక్రానికి ప్రదర్శించవలసిన ముద్ర పేరే సర్వోన్మాదినీ.

కనుక సర్వార్థ సాధక చక్రములోని 10 కులోత్తీర్ణ యోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉంటుందో చివరలో ఉండే వీడియోలో ఐదవముద్రను గమనించండి.
   
1. ఓం హ్రీం సర్వసిద్దిప్రదాయై విద్మహే హ్రీం శ్వేతవర్ణాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

2. ఓం హ్రీం సర్వసంపత్ప్రదాయై విద్మహే హ్రీం మహాలక్ష్మ్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

3. ఓం హ్రీం సర్వప్రియంకర్యై విద్మహే హ్రీం కుందవర్ణాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

4. ఓం హ్రీం సర్వమంగళకారిణ్యై విద్మహే హ్రీం మంగళాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

5. ఓం హ్రీం సర్వకామప్రదాయై విద్మహే హ్రీం కల్పలతాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

6. ఓం హ్రీం సర్వదుఃఖవిమోచన్యై విద్మహే హ్రీం హర్షప్రదాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

7. ఓం హ్రీం సర్వమృత్యుప్రశమన్యై విద్మహే హ్రీం సర్వసంజీవిన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

8. ఓం హ్రీం సర్వవిఘ్ననివారిణ్యై విద్మహే హ్రీం సర్వకామాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

9. ఓం హ్రీం సర్వాంగసుందర్యై విద్మహే హ్రీం జగద్యోన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

10. ఓం హ్రీం సర్వసౌభాగ్యదాయిన్యై విద్మహే హ్రీం జగజ్జనన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

 

తదుపరి పోస్టింగ్ లో ఆరవదైన సర్వరక్షాకర చక్రం గురించి తెలుసుకుందాం.                                                                          - శ్రీనివాస గార్గేయ   

Monday, May 12, 2014

హ్రీంకార యజ్ఞము - సర్వసౌభాగ్యప్రద చక్ర అవసర సారంశము 7

4.  సర్వసౌభాగ్యప్రద చక్రము 

పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో నాల్గవచక్రమే సర్వసౌభాగ్యప్రద చక్రము. శ్రీచక్ర మేరులో పీఠంపై  అష్టదళం పైన పధ్నాలుగు కోణాలు గల, చతుర్దశార ఆవరణంగా ఉండినదే సర్వసౌభాగ్యప్రద  చక్రము అంటారు.  

దీనికి 14 కోణాలు ఉంటాయి.  ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలలో నాల్గవదిగా ఉన్నఅనాహత చక్రమే. ఇది శరీరంలో హృదయ స్థానం దగ్గర ఉండును. ఈ సర్వసౌభాగ్యప్రద చక్రములో పధ్నాలుగు మంది సంప్రదాయ యోగినీ దేవతలు ఉంటారు.

14 కోణాలు 14 లోకాలకు ప్రతీక.  దీనిలో  అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళమనే 7 అధోలోకాలు... భూలోక, భువర్లోక, సువర్లోక,  మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలనే 7 ఊర్ధ్వ లోకాలకు ప్రతీకే ఈ చక్రము. 

తెలుగు నిఘంటువు ప్రకారం సౌభాగ్యమంటే భాగ్యవంతము,వైభవము, సౌభాగ్యము, అందము, శుభగత్వము అనే పలు అర్థాలున్నవి.

హిందూ వివాహ వ్యవస్థలో సంప్రదాయాలు చూడటం ఓ ఆనవాయితీ. ఎంత గొప్ప ధనవంతుడు, అధికారి అయినప్పటికీ సంప్రదాయం లేనిచో సంబంధాలు చూడరు. అలాగే సంప్రదాయ బద్ధంగా ఉంటేనే సౌభాగ్యం లభిస్తుందని ఈ నాల్గవ చక్రం ద్వారా ఓ రహస్య సంకేతం తెలుస్తుంది.

మూలాధారానికి  గణపతి, స్వాధిష్టానానికి  బ్రహ్మ, మణిపూరకానికి విష్ణువు అధిదేవతలుగా ఉన్నట్లుగానే అనాహత చక్రానికి రుద్రుడు అధిదేవత కాగా, సర్వ సౌభాగ్యప్రద చక్రానికి అధిష్టాన దేవత పేరే త్రిపుర వాసిని. ఈ చక్రానికి ప్రదర్శించవలసిన ముద్ర పేరే సర్వవశంకరీ. 

కనుక సర్వసౌభాగ్యప్రద చక్రములోని 14 సంప్రదాయ యోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉంటుందో చివరలో ఉండే వీడియోలో నాల్గవ ముద్రను గమనించండి.  

1. ఓం హ్రీం సర్వసంక్షోభిణ్యై విద్మహే హ్రీం బాణహస్తాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।

2. ఓం హ్రీం సర్వవిద్రావిణ్యై విద్మహే హ్రీం కార్ముకహస్తాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।

3. ఓం హ్రీం సర్వాకర్షిణ్యై విద్మహే హ్రీం శోణవర్ణాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్। 

4. ఓం హ్రీం సర్వాహ్లాదిన్యై విద్మహే హ్రీం జగద్వ్యాపిన్యై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్। 

5. ఓం హ్రీం సర్వసమ్మోహిన్యై విద్మహే హ్రీం జగన్మోహిన్యై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

6. ఓం హ్రీం సర్వస్తంభిన్యై విద్మహే హ్రీం జగత్స్తంభిన్యై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

7. ఓం హ్రీం సర్వజృంభిణ్యై విద్మహే హ్రీం జగత్ జృంభిణ్యై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

8. ఓం హ్రీం సర్వవశంకర్యై విద్మహే హ్రీం  జగత్వశంకర్యై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

9. ఓం హ్రీం సర్వరంజిన్యై విద్మహే హ్రీం జగద్రంజిన్యై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

10. ఓం హ్రీం సర్వోన్మాదిన్యై విద్మహే హ్రీం జగన్మాయాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

11. ఓం హ్రీం సర్వార్థసాధిన్యై విద్మహే హ్రీం పురుషార్థదాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

12. ఓం హ్రీం సర్వసంపత్ప్రపూరిణ్యై విద్మహే హ్రీం సంపదాత్మికాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

13. ఓం హ్రీం సర్వమంత్రమయ్యై విద్మహే హ్రీం మంత్రమాత్రే ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

14. ఓం హ్రీం సర్వద్వంద్వక్షయంకర్యై విద్మహే హ్రీం కళాత్మికాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

 

తదుపరి పోస్టింగ్ లో ఐదవదైన సర్వార్థ సాధకచక్రం గురించి తెలుసుకుందాం.                                                                          - శ్రీనివాస గార్గేయ   

Saturday, May 10, 2014

హ్రీంకార యజ్ఞము - సర్వసంక్షోభణ చక్ర అవసర సారంశము 6

3. సర్వసంక్షోభణ చక్రము 

పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో మూడవచక్రమే సర్వసంక్షోభణ చక్రము. దిగువ కనపడే శ్రీచక్ర మేరులో పీఠంపై  షోడశదళం పైన అష్టదళ పద్మంగా గుండ్రముగా ఉండినదే సర్వసంక్షోభణ చక్రము అంటారు.  



















దీనికి 8 దళాలు ఉంటాయి.  ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలలో మూడవదిగా ఉన్నమణిపూరక చక్రమే. ఇది శరీరంలో నాభి స్థానం దగ్గర ఉండును. ఈ సర్వసంక్షోభణ చక్రములో ఎనిమిది మంది గుప్తతర యోగినులనబడే దేవతలు ఉంటారు.

సర్వసంక్షోభణ చక్రానికి ప్రదర్శించవలసిన ముద్ర పేరే సర్వాకర్షిణీ
సర్వసంక్షోభణ చక్రానికి అధిష్టాన దేవత త్రిపుర సుందరీ 

వైదిక కర్మలయందు శ్రద్ధ తగ్గి అవైదిక కర్మలయందు ఆసక్తి పెరిగి, యజ్ఞ యాగాది క్రతువులలో ప్రజలు విముఖులైనప్పుడు సంక్షోభమేర్పడుతుంది. ఇట్టి సంక్షోభాన్ని పార్వతి పరమేశ్వరులు తొలగిస్తారు. అదే శ్రీచక్రంలో మూడవ ఆవరణకు ఉన్న విశిష్టత. అందుచేతనే దీనిని సర్వసంక్షోభణ చక్రమని పిలుస్తారు. (సంక్షోభణాన్ని ఎలా నివారించారో పురాణం గాధలున్నవి.)

తారకాసుర సంహారం తదుపరి ఇంద్రుడు పదవిని అధిష్టించటం, తదుపరి లోకాలలో వైదిక కర్మలు, యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహింపబడటం, దేవతలకు వారి వారి హవిర్భాగాలు అందటం ప్రారంభమై లోకాలలో ఏర్పడ్డ సంక్షోభం నివారింపబడింది. మన్మధుడు దహనమై తదుపరి అనంగుడైనాడు. దీనికి సంకేతంగానే సర్వ సంక్షోభణ చక్రంలోని గుప్తతర యోగినులను అనంగనామంతో చెప్పటం సంప్రదాయమైనది. 

లోకాలలో మరియు జీవితాలలో ఏర్పడే సంక్షోభాలను నివారించటానికే ప్రతి ఒక్కరూ హ్రీంకార మహా యజ్ఞాన్ని ఆచరిస్తూ తద్వారా సర్వసంక్షోభణ చక్రాధిదేవత అయిన త్రిపురసుందరిని ఉపాసిస్తే సమస్త సుఖాలను ప్రసాదిస్తుంది. అందుకే శ్రీ లలితా సహస్ర నామావళిలో మణిపూరబ్జనిలయా నుండి  లాకిన్యాంబా స్వరూపిణి వరకు గల పది నామాలలో సర్వసంక్షోభణ చక్రం స్తుతించబడుతున్నది. ఇందులో గల ఓ నామంలో సమస్త భక్తసుఖదా అని ఉండటంలో అంతరార్ధం స్పష్టంగా గోచరమవుతుంది. 

మరొక ముఖ్యమైన రహస్యమేమిటంటే అసలు మణిపూరక చక్రంలో ఉండే దేవత పేరు వయోవస్థావివర్జితా. ఈ నామమే లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. అంటే కాలానికి అతీతురాలు పరమేశ్వరి. వయసుతోను, కాలంతోను వచ్చే మార్పులు ఆమెకి ఉండవు. 

బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలు ఏమి లేనటువంటిదని భావము. అంటే కాల వ్యవస్థ పరమేశ్వరి కల్పితము. పరమేశ్వరి కాల కల్పనకు పూర్వమే ఉండినందున, పరమేశ్వరి వయస్సును కాలము నిర్ణయింపజాలదు. 

అందుకే లలితా సహస్ర నామాలలో పరమేశ్వరిని పూర్వజా అని, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అని, మహాప్రళయసాక్షిని అని స్తుతించబడింది. ఈ నవ చక్రాలలో నాభిస్థానంలో ఉన్న సర్వసంక్షోభణ చక్ర విశిష్టత చెప్పనలవికానిది.

కనుక సర్వసంక్షోభణ చక్రములోని 8 గుప్తతర యోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉంటుందో చివరలో ఉండే వీడియోలో మూడవ ముద్రను గమనించండి. 

1. ఓం హ్రీం అనంగకుసుమాయై విద్మహే హ్రీం రక్తకంచుకాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

2. ఓం హ్రీం అనంగమేఖలాయై విద్మహే హ్రీం పాశహస్తాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

3. ఓం హ్రీం అనంగమదనాయై విద్మహే హ్రీం శరహస్తాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్। 

4. ఓం హ్రీం అనంగమదనాతురాయై విద్మహే హ్రీం ధనుర్హస్తాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।  

5. ఓం హ్రీం అనంగరేఖాయై విద్మహే హ్రీం దీర్ఘకేశిన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।  

6. ఓం హ్రీం అనంగవేగిన్యై విద్మహే హ్రీం సృణిహస్తాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।  

7. ఓం హ్రీం అనంగాంకుశాయై విద్మహే హ్రీం నిత్యక్లేదిన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।  

8. ఓం హ్రీం అనంగమాలిన్యై విద్మహే హ్రీం సుప్రసన్నాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।  



తదుపరి పోస్టింగ్ లో నాల్గవదైన సర్వసౌభాగ్యదాయక చక్రం గురించి తెలుసుకుందాం.  పాఠకులలో అసంఖ్యాకంగా అడిగిన ప్రశ్నలను బట్టి హ్రీంకార యజ్ఞం ఎందుకు చేయాలి ? హ్రీంకారమునకు మూలం ఏమిటి ? శ్రీవిద్యకు, శ్రీ యంత్రానికి ఉన్న సంబంధం ఏమిటి ? పంచదశి మంత్రానికి, శ్రీ యంత్రానికి సంబంధం ఏమిటి ? ఇంకా ఇంకా అనేకనేక ప్రశ్నలకు బ్లాగు ద్వారానే వివరాలను అందిస్తాను. సంపూర్ణ వివరాలన్నీ హ్రీంకార మహా యజ్ఞం అనే పుస్తకంలో పొందుపరుస్తూ... యజ్ఞ కార్యక్రమం నాటికే అందరికీ అందించాలనే తాపత్రయంతో ఉన్నానని తెలియచేస్తున్నాను. 
                                                                          - శ్రీనివాస గార్గేయ  

Friday, May 9, 2014

హ్రీంకార యజ్ఞము - సర్వాశాపరిపూరక చక్ర అవసర సారంశము 5

2. సర్వాశాపరిపూరక చక్రము 
పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో రెండవ చక్రమే సర్వాశాపరిపూరక చక్రము. దిగువ కనపడే శ్రీచక్ర మేరులో పీఠంపై దిగువన 16 ఆకులుగా గుండ్రముగా ఉండినదే సర్వేశాపరిపూరక చక్రము అంటారు. ఇది సర్వ ఆశలను పరిపూర్ణం చేసే చక్రమని భావించాలి. 

 








దీనికి 16 దళాలు ఉంటాయి. వ్యవహారికంగా పలకటంలో సర్వాశా అనకుండా సర్వేశాపరిపూరక చక్రముగా పలుకుతుంటాము. ఇది అలవాటులో పొరపాటుగా భావించి, సర్వాశాపరిపూరక చక్రము అని మాత్రమే పలకాలి.

శరీరంలో ఉన్న షట్చక్రాలలో రెండవదిగా ఉన్నస్వాధిష్టాన చక్రమే. ఇది మూలాధారానికి పై భాగాన ఉంటుంది. ఈ సర్వాశాపరిపూరక చక్రంలో పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, మనస్సు మొత్తం 16. ఈ పదహారింటికే పదహారు దేవతలు. ఈ చక్రం శ్రీచక్రార్చనలో భోగపాత్ర. 

సర్వాశాపరిపూరక చక్రానికి ప్రదర్శించవలసిన ముద్ర పేరే సర్వవిద్రావిణీ 
సర్వాశాపరిపూరక చక్రానికి అధిష్టాన దేవత త్రిపురేశ్వరి

కనుక సర్వాశాపరిపూరక చక్రంలోని 16 గుప్తయోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉంటుందో చివరలో ఉండే వీడియోలో రెండవ ముద్రను గమనించండి.   
1. ఓం హ్రీం కామాకర్షిణ్యై విద్మహే హ్రీం రక్తవస్త్రాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్। 

2. ఓం హ్రీం బుద్ధ్యాకర్షిణ్యై విద్మహే హ్రీం బుద్ధ్యాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్। 

3. ఓం హ్రీం అహంకారాకర్షిణ్యై విద్మహే హ్రీం తత్త్వాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్। 

4. ఓం హ్రీం శబ్దాకర్షిణ్యై విద్మహే హ్రీం సర్వశబ్దాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్। 

5. ఓం హ్రీం స్పర్శాకర్షిణ్యై విద్మహే హ్రీం స్పర్శాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

6. ఓం హ్రీం రూపాకర్షిణ్యై విద్మహే హ్రీం రూపాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

7. ఓం హ్రీం రసాకర్షిణ్యై విద్మహే హ్రీం రసాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

8. ఓం హ్రీం గంధాకర్షిణ్యై విద్మహే హ్రీం గంధాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

9. ఓం హ్రీం చిత్తాకర్షిణ్యై విద్మహే హ్రీం చిత్తాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

10. ఓం హ్రీం ధైర్యాకర్షిణ్యై విద్మహే హ్రీం ధైర్యాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

11. ఓం హ్రీం స్మృత్యాకర్షిణ్యై విద్మహే హ్రీం స్మృతిస్వరూపిణ్యై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

12. ఓం హ్రీం నామాకర్షిణ్యై విద్మహే హ్రీం నామాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

13. ఓం హ్రీం బీజాకర్షిణ్యై విద్మహే హ్రీం బీజాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

14. ఓం హ్రీం ఆత్మాకర్షిణ్యై విద్మహే హ్రీం ఆత్మస్వరూపిణ్యై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

15. ఓం హ్రీం అమృతాకర్షిణ్యై విద్మహే హ్రీం అమృతస్వరూపిణ్యై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

16. ఓం హ్రీం శరీరాకర్షిణ్యై విద్మహే హ్రీం శరీరాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।   

 
తదుపరి పోస్టింగ్ లో మూడవదైన సర్వసంక్షోభణ చక్రం గురించి తెలుసుకుందాం.  

Thursday, May 8, 2014

హ్రీంకార యజ్ఞ నవావరణ ముద్రలు - అవసర సారాంశం 4

హ్రీంకార మహాయజ్ఞం జరుగు సమయంలో పండితులు మంత్రోచ్చారణ ఒక వైపు చేస్తుండగా అదే సమయంలో యజ్ఞంలో పాల్గొనేవారు కూడా నవ చక్రాలకు సంబంధించిన రుద్ర గాయత్రిలను ముద్ర పూర్వకంగా పఠిస్తుంటారు.

ఉదాహరణకు గత పోస్టింగ్ లో చెప్పబడిన త్రైలోక్య మోహన చక్రములోని 28 రుద్ర గాయత్రీ మంత్రములను ముద్రా సహితంగా పలుకుతూ ఉంటారు. అనగా ఒకటవదైన త్రైలోక్య మోహన చక్రానికి ముద్ర సర్వ సంక్షోభినిని ప్రదర్శిస్తూ హ్రీం బీజాక్షర పూర్వకంగా 28 రుద్ర గాయత్రిలను భక్తితో పఠిస్తుండాలి. 

మొదటి చక్రం కాగానే రెండవ చక్రానికి ముద్రను ప్రదర్శిస్తూ ఆ చక్ర దేవత రుద్ర గాయత్రిలను పఠించాలి. కనుక ఒక్కో చక్రానికి ముద్రలు ఏ విధంగా ఉంటాయో ఇప్పటినుంచే సాధన చేయాలి. 

అయితే హ్రీంకార మహా యజ్ఞం కాకుండా మామూలు సమయాలలో మీ మీ గృహాలలో కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని ముద్రా సహితంగానే పఠిస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ ముద్రలలో 1 నుంచి 9 వరకు వరుసగా వెంటవెంటనే రెండూ చేతులను విడదీయకుండా చేయటం అభ్యాసంతో నేర్చుకోవాలి. 

గమనిక ఏమిటంటే యజ్ఞం జరిగే సమయంలో రుద్ర గాయత్రిలను 9 చక్రాలకి వరుసగా పఠించాలంటే సమయం పడుతుంది. కనుక ఒక చక్ర పఠనానికి, మరో చక్ర పఠనానికి మధ్యలో స్వల్ప పూజా హారతి వుంటుంది గనుక ముద్రలు వేయటంలో విరామం ఉంటుంది. 

అదే మీ మీ గృహాలలో ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించాలి అనుకున్నప్పుడు కొద్ది నిమిషాలలోనే పూర్తవుతుంది గనుక చేతులను విడదీయకుండానే ముద్రలను ప్రదర్శించుటకు వీలుగా ఉండుటకై దిగువ వీడియోలో ఇవ్వటం జరిగింది. కనుక వరుసగా ముద్రలను చేతులు విడదీయకుండా సాధన చేయండి. 

ఈ ముద్రలలో సాంప్రదాయ భేదములున్నవి. అందువలన 3 దశాబ్దాల అనుభవంతో దేవి అనుగ్రహంతో నా మనో దృష్టికి అందిన ముద్రలను తెలియచేస్తున్నాను. కనుక ఈ దిగువ రీతిలో చెప్పినట్లుగా ఒక్కో చక్రానికి ఒక్కో ముద్ర ఉండును. 

కనుక వాటిని పూర్తిని అవగాహన చేసుకొనగలరు. 9 ఆవరణలు పూర్తైన తర్వాత మరొక ముద్రను తెలియచేస్తాను. కనుక ఈ పోస్టింగ్ లో చెప్పినట్లుగా ఆచరించగలరని భావిస్తూ తదుపరి పోస్టింగ్ లో సర్వాశాపరిపూరక చక్ర అంశాలను పొందుపరుస్తాను. 

1. త్రైలోక్య మోహన చక్రము  
ముద్ర పేరు - సర్వసంక్షోభిణీ
 

2. సర్వాశాపరిపూరక చక్రము 
ముద్ర పేరు - సర్వవిద్రావిణీ
 

3. సర్వసంక్షోభణ చక్రము 
ముద్ర పేరు - సర్వాకర్షిణీ
 

4. సర్వసౌభాగ్యదాయక చక్రము 
ముద్ర పేరు - సర్వవశంకరీ
 

5. సర్వార్థసాధక చక్రము 
ముద్ర పేరు - సర్వోన్మాదినీ 
 
6. సర్వరక్షాకర చక్రము 

ముద్ర పేరు - సర్వమహాంకుశా
 

7. సర్వరోగహర చక్రము 
ముద్ర పేరు - సర్వఖేచరీ 
 

8. సర్వసిద్ధిప్రద చక్రము
ముద్ర పేరు - సర్వబీజ
 
9. సర్వానందమయ చక్రము 
ముద్ర పేరు - సర్వయోని 

గమనిక : ఖడ్గమాల స్తోత్రాన్ని గృహాలలో పఠించకూడదని, విపరీత నివేదనలను అందించాలని చెప్పేవారి మాటలను పూర్తిగా ఖండిస్తున్నాను. దయచేసి పాఠకులు అటువంటి మాటలపై దృష్టి ఉంచవద్దని మనవి.

Tuesday, May 6, 2014

హ్రీంకార యజ్ఞము - ముద్రలపై ఓ విశ్లేషణ - అవసర సారంశము 3

ఒక వ్యక్తి మాట్లాడకుండా ఎదుటివారికి కొన్ని కొన్ని సైగలతో కొంత విషయాన్ని తెలియచేయగలడు. అంటే మన చేతి వ్రేళ్ళ ద్వారా, కదలికల ద్వారా ముద్రలను ఏర్పరుస్తూ ఉన్నచో, మాట్లాడకుండానే ఎదుటివారికి ముద్రల ద్వారా భావాన్ని తెలియచేసే ఒక భాషగా  ముద్రలు ఉపయోగపడును. 

ఆత్మని పరమాత్మతో చేర్చే ప్రయత్నంలో మౌనంతో ఉన్న ఓ వ్యక్తికి ముద్రలనేవి సాధనాలుగా ఉంటాయి. యోగసాధన చేత పూర్ణ చైతన్యం లభిస్తుంది. ముద్రల ద్వారా ప్రాణాయామ తదితరములు సాధన చేసి విజయాన్ని సాధించవచ్చు. అచేతనావస్థ నుండి చేతనావాస్థకు, అస్థిరతం నుండి స్థిరత్వానికి, అగోచరం నుండి గోచర స్థితికి, అధర్మం నుండి ధర్మానికి, అనారోగ్యం నుండి ఆరోగ్యస్థితికి సునాయాసంగా చేర్చగలిగినదే యోగ విద్య. 

మనిషి అంతర్మధనం చెందుతుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుచేత మానసిక క్షోభ, శారీరక సమస్యలు తలెత్తుతాయి. ఏ పని పైన నిశ్చలత్వం ఉండక, కకావికలమైన మనస్సుతో జీవితాన్ని సాగిస్తూ... వత్తిడితో నలిగిపోతుంటాడు. కనుక మనిషికి ప్రశాంతత అవసరం. మనసు నిర్మలంగా, నిలకడగా ఉండాలంటే స్వాంతన ముఖ్యం. ఇట్టి పరిపూర్ణ ఉపశమనం పొందాలంటే యోగసాధన అవసరం. యోగసాధనకు మూలం మనము ఆచరించే ప్రత్యేక ముద్రలు.  కొన్ని సార్లు ముద్రలు సంజీవనిగా ఉపయోగపడతాయని పెద్దలు చెబుతారు. 

భౌతిక సుఖాలు మానసిక ఆనందాన్ని కొంతవరకే కలిగిస్తాయి గాని మిగిలినదంతా అసంతృప్తే. మనం అంతరంగాన్ని మలినాలతో, మాలిన్యాలతో నింపుకుని జీవించినంతకాలం ఆనందానుభవం అసాధ్యం. అంతరంగ కాలుష్య ప్రభావంచే చర్మ వ్యాధులు, శ్వాసకోశ రుగ్మతలు మొదలైనవి ప్రబలుతుంటాయి. 

 అజీర్ణ రోగి  రుచులని ఆశ్వాదించలేడు. చంచల స్వభావి యోగి కాలేడు. నిర్మలమైన మనసులేని భోగి రోగి కాగలడు కాని యోగి కాలేడు. అందుకే ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. నిత్య సంతోషులుగా ఉన్నవారే ఆరోగ్యవంతులు.

భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలలో భక్తి సంబంధిత అంశాలలో ముద్రలనేవి ఓ భాగం. ముద్రలు వేయటం ద్వారా మనకు ధ్యానంలో ఏకాగ్రత కుదిరి శరీరాన్ని ఆత్మతో సమన్వయ పరచి ఆనందాన్ని పొందగలం. మన చేతులు విశిష్టమైన శక్తి గల్గినవి. వీటిలో విద్యుత్ తరంగాలవంటి శక్తి నిండి ఉంటుంది. పంచభూతములు చేతులలో అంతర్గతంగా నిండి ఉంటాయి. 

ఋషులు, మునులు, యోగులు నిరంతరం ముద్రల ద్వారా సాధన చేస్తూ తమ తపఃశక్తిని పెంచుకునేవారు. ముద్రలు మానసిక శక్తిని, వైఖరిని, గ్రహణ శక్తిని ,ఏకాగ్రతను పెంపొందించును. ముద్రలకు నాడి మండలానికి సంబంధం ఉంది. వివిధ భంగిమలలో ముద్రల కదలిక ద్వారా మనస్సు స్వాధీన పడుతుంది. మన భావనలు, మన ఆలోచనలు సరియైన రీతిలో నడుస్తాయి. ఓ శక్తి ప్రవాహం మనలో వ్యాపించింది అన్న భావానికి లోనవుతాం. మన ఊహలు, ఆలోచనలు, పరిస్థితులను బట్టి బాహ్య పరిస్థితులు రూపుదిద్దుకుంటాయి. సంకల్ప వికల్పాలలో పెను మార్పులుంటాయి.

భక్తి ముక్తి శక్తిదాయకములైన ఈ ముద్రలతో లలితా రహస్య సహస్ర నామావళిని ఆచరిస్తే విశేష శక్తి లభిస్తుందని పెద్దల అభిప్రాయం. ఈ పరంపరలో ప్రస్తుతం జరిగే హ్రీంకార మహా యజ్ఞంలో ముఖ్యమైన సందర్భాలలో ముద్రలను ప్రదర్శించాలి. అయితే ఈ ముద్రలు వేయటంలో అనేక సంప్రదాయ భేదములున్నవి. 

అందుచే చాలామంది ముద్రల జోలికి వెళ్ళకుండా సాధారణ రీతిలోనే లలితా సహస్ర నామాలను, త్రిశతిని, ఖడ్గమాలను వ్యక్తిగతంగాని లేక సామూహికంగా గాని పఠిస్తుంటారు. అందుచే మూడు దశాబ్దాల అనుభవంతో, ఆ దేవి అనుగ్రహంతో నా మనో దృష్టికి అందిన ముద్రలను ఈ హ్రీంకార యజ్ఞంలో పొందుపరుస్తున్నాను. అనుభవంలో ఇవి విశేషమైన ఫలితాలను ఇస్తాయనటంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. 

కనుక ఈ ముద్రలను ఏ విధంగా ప్రదర్శించాలో తదుపరి పోస్టింగ్లో తెలుసుకుందాం.           
                                                                            - శ్రీనివాస గార్గేయ

Monday, May 5, 2014

హ్రీంకార యజ్ఞము - త్రైలోక్యమోహన చక్ర అవసర సారంశము 2

పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఈ ఆవరణలలో వివిధ దేవతలు ఉంటారు. ఈ ఆవరణ చక్రముల వరుస పేర్లు...
త్రైలోక్య మోహన చక్రము 
సర్వాశాపరిపూరక చక్రము 
సర్వసంక్షోభణ చక్రము
సర్వసౌభాగ్యదాయక చక్రము
సర్వార్థసాధక చక్రము 
సర్వరక్షాకర చక్రము 
సర్వరోగహర చక్రము 
సర్వసిద్ధిప్రద చక్రము 
సర్వానందమయ చక్రము 

1. త్రైలోక్య మోహన చక్రము 
మానవదేహంలో షట్చక్రాలు ఉంటాయి. ఇందులో మొదటి చక్రము మూలాధార చక్రము.  మూలాధారంలో ఉండే దేవత గణపతి. గజముఖుడు, వేదస్వరూపుడు. తొండము ఓంకారానికి ప్రతీకగా చెప్తాము. మనం ఏ పూజ మొదలుపెట్టినా, ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రధమంగా పూజించి ప్రార్ధించేది గజముఖుడైన గణపతినే. శ్రీచక్ర మొదటి నవావరణముగా చెప్పబడే త్రైలోక్య మోహన చక్రంలో మూడు భూపురాలు (రేఖలు) ఉంటాయి. ఈ మూడింటిలో కలసి 28 మంది ప్రకట యోగినులనే దేవతలు ఉంటారు. ఈ 28 మంది ప్రకటయోగినిలు శ్రీ మహా గణపతి మంత్రానికి సంకేతాలు. (శ్రీ గణపతి మంత్రానికి అక్షరాలు కూడా 28). 

ఈ త్రైలోక్య మోహన చక్రమునకు అధిష్టాన దేవత త్రిపుర. 
త్రైలోక్య మోహన చక్రానికి గల ముద్ర పేరు సర్వసంక్షోభిణి ముద్ర. 
పరమేశ్వరి ఆరాధనలో ముద్రలు ప్రదర్శించాలి. 
ఇలా చేయటం పరమేశ్వరికి మహా ప్రీతి దాయకం. 
మన కుడిచేతి వ్రేళ్ళు శివతత్వము. 
ఎడమచేతి వ్రేళ్ళు శక్తి తత్వము. 
ఈ రెండూ కలపటము అంటే శివ శక్తుల సామరస్యము. 

చేతికి ఉన్న ఐదు వ్రేళ్ళలో బొటనవ్రేలు  (అంగుష్టము) అగ్నితత్వమునకు,
చూపుడువ్రేలు  (తర్జని) వాయుతత్వమునకు, 
నడిమి వ్రేలు (మధ్యమాంగుళి) ఆకాశతత్వానికి, 
ఉంగరపు వ్రేలు (అనామిక) పృథ్వి తత్వమునకు, 
చిటికెన వ్రేలు (కనిష్ఠ) జలతత్వమునకు ప్రతీకలు.
అందుచే ప్రతి ఆవరణలోని దేవతలకు రుద్ర గాయత్రీ మంత్రాలను పఠించునపుడు ప్రత్యేక ముద్రలను ప్రదర్శిస్తూ హ్రీంకార యజ్ఞంలో పాల్గొనాలి. 

కనుక త్రైలోక్య మోహన చక్రంలోని 28 ప్రకటయోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉండునో రేపటి రోజున తెల్సుకుందాం.

1. ఓం హ్రీం అణిమాసిద్ధ్యై విద్మహే హ్రీం వరాభయహస్తాయై ధీమహి హ్రీం తన్నఃసిద్ధిః ప్రచోదయాత్। 

2. ఓం హ్రీం లఘిమాసిద్ధ్యై విద్మహే హ్రీం  నిధివాహనాయై ధీమహి హ్రీం తన్నో లఘిమా ప్రచోదయాత్ ।  

3. ఓం హ్రీం మహిమాసిద్ధ్యై విద్మహే హ్రీం  మహాసిద్ధ్యై ధీమహి హ్రీం తన్నో మహిమా ప్రచోదయాత్ ।   

4. ఓం హ్రీం ఈశిత్వసిద్ధ్యై విద్మహే హ్రీం  జగద్వ్యాపికాయై ధీమహి హ్రీం తన్నఃసిద్ధిః ప్రచోదయాత్ ।   

5. ఓం హ్రీం వశిత్వసిద్ధ్యై విద్మహే హ్రీం శోణవర్ణాయై ధీమహి హ్రీం తన్నఃసిద్ధిః ప్రచోదయాత్।  

6. ఓం హ్రీం ప్రాకామ్యసిద్ధ్యై విద్మహే హ్రీం నిధివాహనాయై ధీమహి హ్రీం తన్నఃసిద్ధిః ప్రచోదయాత్।  

7. ఓం హ్రీం భుక్తిసిద్ధ్యై విద్మహే హ్రీం మహాసిద్ధ్యై ధీమహి హ్రీం తన్నఃసిద్ధిః ప్రచోదయాత్।  

8. ఓం హ్రీం ఇచ్చాసిద్ధ్యై విద్మహే హ్రీం పద్మహస్తాయై ధీమహి హ్రీం తన్నఃసిద్ధిః ప్రచోదయాత్।  

9. ఓం హ్రీం ప్రాప్తిసిద్ధ్యై విద్మహే హ్రీం భక్తవత్సలాయై ధీమహి హ్రీం తన్నఃసిద్ధిః ప్రచోదయాత్।  

10. ఓం హ్రీం సర్వకామసిద్ధ్యై విద్మహే హ్రీం మహానిర్మలాయై ధీమహి హ్రీం తన్నఃసిద్ధిః ప్రచోదయాత్। 

11. ఓం హ్రీం బ్రాహ్మీశక్త్యై విద్మహే హ్రీం పీతవర్ణాయై ధీమహి హ్రీం తన్నో బ్రాహ్మీ ప్రచోదయాత్।   

12. ఓం హ్రీం శ్వేతవర్ణాయై విద్మహే హ్రీం శూలహస్తాయై ధీమహి హ్రీం తన్నో మాహేశ్వరీ ప్రచోదయాత్।  

13. ఓం హ్రీం శిఖివాహనాయై విద్మహే హ్రీం శక్తిహస్తాయై ధీమహి హ్రీం తన్నో కౌమారీ ప్రచోదయాత్। 

14. ఓం హ్రీం శ్యామవర్ణాయై విద్మహే హ్రీం చక్రహస్తాయై ధీమహి హ్రీం తన్నో వైష్ణవీ ప్రచోదయాత్। 

15. ఓం హ్రీం శ్యామలాయై విద్మహే హ్రీం హలహస్తాయై ధీమహి హ్రీం తన్నో వారాహీ ప్రచోదయాత్।  

16. ఓం హ్రీం శ్యామవర్ణాయై విద్మహే హ్రీం వజ్రహస్తాయై ధీమహి హ్రీం తన్నో మాహేంద్రీ ప్రచోదయాత్।  
  
17. ఓం హ్రీం కృష్ణవర్ణాయై విద్మహే హ్రీం శూలహస్తాయై ధీమహి హ్రీం తన్నో చాముండీ ప్రచోదయాత్।  

18. ఓం హ్రీం పీతవర్ణాయై విద్మహే హ్రీం పద్మహస్తాయై ధీమహి హ్రీం తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాత్।  

19. ఓం హ్రీం సర్వసంక్షోభిణ్యై విద్మహే హ్రీం వరహస్తాయై ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।  

20. ఓం హ్రీం సర్వవిద్రావిణ్యై విద్మహే హ్రీం మహాద్రావిణ్యై ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।   

21. ఓం హ్రీం సర్వాకర్షిణ్యై విద్మహే హ్రీం మహాముద్రాయై ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।  

22. ఓం హ్రీం సర్వవశంకర్యై విద్మహే హ్రీం మహావశ్యాయై ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।   

23. ఓం హ్రీం సర్వోన్మాదిన్యై విద్మహే హ్రీం మహామాయాయై  ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।  

24. ఓం హ్రీం సర్వమహాంకుశాయై విద్మహే హ్రీం శోణవర్ణాయై ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।

25. ఓం హ్రీం సర్వఖేచర్యై విద్మహే హ్రీం గగనవర్ణాయై ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।   

26. ఓం హ్రీం సర్వబీజరూపాయై విద్మహే హ్రీం మహాబీజాయై  ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।

27. ఓం హ్రీం సర్వయోన్యై విద్మహే హ్రీం విశ్వజనన్యై ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।

28. ఓం హ్రీం సర్వత్రిఖండాయై విద్మహే హ్రీం త్రికాలాత్మికాయై ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।   

పాఠకులకు ముఖ్య గమనిక : పైన తెల్పిన వివరాలను ముందుగా బాగా పఠించినచో, హ్రీంకార యజ్ఞ సమయంలో ముద్ర సహితంగా ఆచరించి పఠించుటకు సులువుగా ఉండును. రేపటి రోజున ఈ త్రైలోక్య మోహన చక్ర ముద్రా విశేషాలను తెలుసుకుందాం.  
                                                                      - శ్రీనివాస గార్గేయ

హ్రీంకార మహాయజ్ఞంలో పాల్గొనువారికి అవసర సారాంశం -1

శివశక్త్యాత్మకమైన 'హ్రీం' మంత్రాక్షరాలన్నింటికి తలమానికమైనది. పరమేశ్వరికి అత్యంత ప్రియమైన బీజమిది. జగత్ అంతయూ ఆమె హిరణ్య గర్భంలో ఇమిడినట్లే, తంత్ర మంత్రం సూక్ష్మాలన్నీ హ్రీం బీజంలోనే ఉన్నాయి. ఇది త్రిపుటలకు అధిష్టానం. అండ పిండ బ్రహ్మాండాలకి ఆశ్రయం 

లలితా త్రిశతి నామాలు, పంచదశి మంత్రాన్ని ఆశ్రయించి చెప్పబడినవి. ఈ పంచదశి మంత్రం పరాశక్తి యొక్క విశిష్ట రూపం. ఈ పంచదశి మంత్రం మూడు ఖండాలుగా ఉంది.  

మొదటిదైన వాగ్భవ ఖండములోని  5 బీజాలలో చివరి బీజం హ్రీం.  రెండవదైన కామరాజ ఖండములోని ఆరు బీజాలలో చివరి బీజం హ్రీం. మూడవదైన శక్తి ఖండములోని నాలుగు బీజాలలో చివరి బీజం హ్రీం. అక్షరానికి 20 నామాల చొప్పున పంచదశి మంత్రంలోని 15 అక్షరాలకు మొత్తం 300 నామాలు చెప్పబడినవి. అవే లలితా త్రిశతి.  

త్రిశతి నామాలకి పంచదశి మహా మంత్రానికి (శ్రీవిద్య) అవినాభావ సంబంధం ఉంది. హ్రీంకారం పంచదశి మంత్రానికి హృదయంగా భావించే బీజం. జీవన గమనం సమస్యలు లేకుండా నడుచుటకు అందరి హృదయాలలో ఆకాశ దీపశిఖవలె విరాజిల్లుటకు పరాశక్తి బ్రహ్మ స్వరూపిణి హ్రీం బీజం ఎంతో అవసరం.

మంత్ర శాస్త్రంలో స్త్రీ దేవతలను గురించే చెప్పే మంత్రాలను విద్య అంటారు. పరమేశ్వరిని గురించి చెప్పే విద్య కాబట్టి దీనిని శ్రీవిద్య అంటారు. పరదేవతను గురించి చెప్పే మంత్ర యంత్ర తంత్ర శాస్త్రాన్నే శ్రీవిద్య అంటారు. లలితా సహస్రం యంత్ర మంత్ర తంత్రాలే కాకుండా అనేక రహస్య విషయాలు కూడా నిక్షిప్తమై ఉన్నాయి.

శ్రీ లలితా సహస్రనామంలో కొన్ని కొన్ని నామాలను ఒక సమూహంగా చెప్పటం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకమైన విశేషత ఉంది. ఈ ప్రకారంగా వేయి నామాలలో అనేకానేక విశేషాలు పొందుపరచబడ్డాయి. ఉదాహరణకు మొదటి ఐదు నామాలలో పరమేశ్వరి ప్రాదుర్భావాన్ని వివరిస్తే.. ఆ తదుపరి ఆ తల్లి స్వరూపాన్ని.. మరో చోట జగన్మాత సూక్ష్మ రూపాన్ని వర్ణించారు. అదే పంచదశి మహా మంత్రం. ఇంకోచోట శ్రీ చక్రాన్ని వివరించారు. 

మరి కొన్ని నామాలలో ఆ పరదేవత యొక్క అర్చనా విధానాలను, ఆచారాలను, చతుషష్టిపూజా విశేషాలను, షట్చక్రాలను వివరించారు. అవస్థా పంచకము, చంద్ర విద్య, భానువిద్య, భువనేశ్వరి విద్య, కాత్యాయనీ విద్య, వాగ్వాదినీ విద్య, శివదూతి విద్య, గాయత్రీ మంత్రం, ఆత్మ విద్య... ఈ విధంగా అనేకానేక అంశాలను లలితా సహస్రంలో పొందుపరచబడినవి. ఒక్క లలితా సహస్రాన్ని పూర్తిగా పరిశీలిస్తే శ్రీ విద్య తెలుస్తుంది. అందుకే లలితా సహస్రము శ్రీ విద్యకు సారధి వంటిది.

1 నుండి 10 అక్షరములు గల మంత్రాలను బీజ మంత్రాలు అంటారు. 11 నుంచి 21 వరకు అక్షరాలు గల వాటిని మంత్రములుగా వ్యవహరిస్తారు. 21 మించి అక్షరములు గల వాటిని మాలా మంత్రాలు అంటారు. ఖడ్గములు అంటే స్తుతి వచనాలు అని అర్థం. 

అందుకే 21 మించిన అక్షరాలు ఉన్నందునే ఖడ్గమాలగా వ్యవహరిస్తాం. లలితా త్రిశతిలో మూడవ హ్రీం కారాన్ని గురించి చెప్పేటప్పుడు పరమేశ్వరి హ్రీంకారకోశాసిలతా అని స్తుతించబడింది. అసి అంటే ఖడ్గము. అసిలతా అంటే ఖడ్గధారి. హ్రీంకారమనే కోశానికి పరమేశ్వరి ఖడ్గధారి . హ్రీంకారమనే కోశంలోనే ఆమె ఖడ్గము (కత్తి). తన భక్తులకు కలిగే రాగ ద్వేషాలను, అరిషడ్వర్గ వైరులను, బాధలను, దుఃఖాలను పరమేశ్వరి తన ఖడ్గంతో చేదిస్తుంది, తొలగిస్తుంది. అందుకే ఆ తల్లిని శ్రీ దేవి ఖడ్గమాలతో స్తుతిస్తాము. 

ముఖ్యంగా హ్రీంకార యజ్ఞం చేసే సమయంలో శ్రీ చక్రంలోని తొమ్మిది ఆవరణలను, ఒక్కో ఆవరణ అధిష్టాన దేవతలను, ఒక్కో ఆవరణలో ఉండే దేవతలను, ఆవరణ ముద్రను, ఆవరణ దేవతల రుద్ర గాయత్రిని రేపటి నుంచి రోజుకో అంశంగా తెలియచేస్తాను. భక్తి పరులు ఆకళింపు చేసుకుని జూన్ 10 మంగళవారం హైదరాబాద్ లో జరిగే హ్రీంకార మహా యజ్ఞంలో పాల్గొనటానికి, రేపటి నుంచి తెలియచేసే వివరాలు ముద్రలు మార్గదర్శిగా ఉండగలవని ఆశిస్తున్నాను. 

హ్రీంకార యజ్ఞంలో పాల్గొనేవారికి ఎలాంటి ప్రవేశ రుసుము లేదు. షుమారు 4 గంటలు సమయం పట్టును. ఆనాడు ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమం జరుగును. వేదిక త్వరలో తెలియచేయబడును. మీ బంధు మిత్రాదులందరికీ కార్యక్రమ వివరాలను, హ్రీంకార యజ్ఞ విశేష వివరాలను తెలియచేయగలరని మనసారా ఆశిస్తున్నాను. తిరిగి రేపటి రోజున మొదటి ఆవరణంగా ఉండే త్రిలోక్య మోహన చక్ర వివరాలను తెలుసుకుందాం. 
                                                                                శ్రీనివాస గార్గేయ

Sunday, May 4, 2014

జూన్ 10 మంగళవారం హైదరాబాద్ లో హ్రీంకార మహా యజ్ఞం

2014 జూన్ 10 మంగళవారం స్వాతి నక్షత్రం - శ్రీ ఆది శంకరుల కైలాస గమనం - ఈ రోజున హైదరాబాద్ లో సశాస్త్రీయంగా హ్రీంకార మహా యజ్ఞ కార్యక్రమం శ్రీనివాస గార్గేయ గారి ఆధ్వర్యంలో జరుగును. ప్రవేశం ఉచితం. ఈ యజ్ఞంలో ఆచరించాల్సిన ముద్రా స్వరూపాలను, కార్యక్రమంలో పఠించాల్సిన అంశాలను, విధి విధానాలను రేపటి నుంచి నిత్యం గ్రహభూమి బ్లాగ్లో ఇవ్వబడును. ఆసక్తి ఉన్నవారు గమనించి, పాటించుటకై ప్రయత్నించేది. - ఓంకార మహాశక్తి పీఠం