Sunday, March 30, 2014

శ్రీ జయ విశేషాలు

భగవంతుడు కాలస్వరూపుడు. అన్నీ ఋతువులు, కాలాలు భగవంతుని ఆధీనంలో ఉంటాయి. సృష్టిలోని జీవనవ్యవస్థకు మూలం భగవంతుడే. 6 ఋతువులు, 12 మాసాలు, 365 రోజులు... ఇవన్నీ కాలస్వరూపుని విభాగాలే. ఈ 12 మాసాలలో తొలిమాసం చైత్రం. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మ సృష్టి ప్రారంభించాడని పురాణోక్తి. కలియుగ ప్రమాణము 4లక్షల 32వేల సంవత్సరములు. శ్వేతవరాహకల్పము నందలి 7వ దైనటువంటి వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగము నందలి కలియుగ ప్రధమ పాదములో 5115 వదియు, ప్రభవాది 60 సంవత్సరాలలో 28వ దైనటువంటి ఈ సంవత్సరమును చాంద్రమానంచే శ్రీ 'జయ' నామ సంవత్సరముగా పేర్కొందురు.
 
ప్రతి ఐదు సంవత్సరాలను ఒక యుగముగా లెక్కించినచో, ప్రభవాది అరవై సంవత్సరాలను పన్నెండు యుగాలుగా భావించాలి. ప్రతి యుగములోని ఐదు సంవత్సరాలను వరుసగా సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, ఇద్వత్సరములని పిలువబడును. ఈ పరంపరలో ఆరవ యుగములోని 'ఇదావత్సర' మను నామంతో ఉన్న మూడవ సంవత్సరమే శ్రీ జయ నామ సంవత్సరం.   
పూషణం జయ నామాణమ్ జయదం భక్త సన్తతే ।
శంఖ చంక్రాంకిత కరద్వందం హృదిసమాశ్రయే ॥ 
 
 
ద్వాదశాదిత్యులలో 11 వ ఆదిత్యుడైన అయిన పూషుడు మాఘ మాసానికి అదిదేవత. ఈ పూష దేవత ప్రజలందరికీ జయమును చేకూర్చుటకు, ఒక చేతిలో శంఖమును, ఒక చేతిలో చక్రమును కలిగి 'జయ' అనే నామధేయము కలిగిన శ్రీ సూర్య నారాయణుడైన... శ్రీమహా విష్ణువు అధిపతిగా ఉన్న సంవత్సరమే శ్రీ జయ. మాఘమాసానికి అధిపతిగా ఉన్న సూర్యునిపేరే పూష. ద్వాదశాదిత్యులలో 11వ దేవతా స్వరూపం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరంలో మాఘమాస ఆది అంత్యాలు శ్రవణా నక్షత్రంలోనే రావటం, ఈ శ్రవణం కలియుగ మహా విష్ణువైన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కావటం, శ్రవణా నక్షత్రానికి అధిపతైన చంద్రుడే శ్రీ జయ సంవత్సరానికి రాజు మంత్రి కావటం విశేషం. మాఘమాస శుక్ల ఏకాదశి '"జయ ఏకాదశి" చంద్రుని మరో నక్షత్రమైన రోహిణిలోనే రావటం మరో విశేషం.

355 రోజులు సాగే శ్రీ జయ సంవత్సరానికి రాజ్యాధిపతి, మంత్రిత్వం చంద్రుడికి, సేన అర్ఘ మేఘాదిపత్యములు రవికి, సస్య నీరసాదిపత్యములు బుధునికి, ధాన్యాధిపత్యము కుజునికి, రసాధిపత్యము శుక్రునికి లభించగా గురు, శనులకు ఏ ఒక్క ఆధిపత్యం లభించలేదు.   
 
రాజు, మంత్రి ఒకరే అయినందున నిర్ణయాలు తీసుకొనుటలోను, ఆచరణలోను సమస్యలు ఉండవు. మధ్య మధ్యలో ప్రజలకు వచ్చే కష్టాలు వినటానికి రాజైన చంద్రుడు ఒక్కోసారి అందుబాటులో ఉండకపోవటం శ్రీ జయలో జరుగుతుంది. అందుకే 2014 ఏప్రిల్ నుంచి 2015 మార్చి వరకు, ప్రతినెలా అమావాస్య మరియు దాని ముందు వెనుక రోజులలో ప్రజలు ఎదుటివ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తమ స్వ విషయాలను ఎదుటివారికి బహిర్గతం చేయవద్దు. గోప్యంగా ఉంచాలి.
రాజైన చంద్రునకు అక్టోబర్ 8న పాక్షిక చంద్రగ్రహణం జరిగినందున, రాజు మంత్రి చంద్రుడే అయినప్పటికీ, అప్పుడప్పుడు తప్పు నిర్ణయాలతో సలహాలిచ్చే వారు కూడా ఉంటుంటారు. అంచేత ప్రజలకు కొన్ని సందర్భాలలో తిప్పలు తప్పవు. కనుక వ్యావహారికంగా తెలుగునాట పాలించే నాయకులకు కూడా తప్పు నిర్ణయాలతో సలహాలిచ్చేవారు ఉంటుంటారు. కనుక విజ్ఞతతో ఆలోచిస్తూ పరిపాలన చేయాల్సిన అవసరం ఉందని పాలకులు గమనించాలి.
 
 
2014 ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు రక్షణశాఖ అధిపతులు అత్యుత్సాహం చూపకూడదు. జూన్ జూలై ఆగష్టు నెలలలో రక్షణశాఖ అప్రమత్తంగా ఉండాలి.  ప్రక్క రాష్ట్రాల నేతలతో సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగిననూ ఫలితాలు అసంపూర్ణం. ఉగ్రవాద దుశ్చర్యలను చేపట్టేవారు అధికము. అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ విజయపంథాలో దూసుకువెల్లును. ఎలక్ట్రానిక్ వస్తువులు సరసమైన ధరలలో అందుబాటులోకి వచ్చును. టెలి కమ్యునికేషన్ రంగాలు బలపడును. క్రీడా రంగంలో కుంభకోణాలు బయటపడును. పర్యాటకరంగం అభివృద్ధి చెందును.
 
నిరుద్యోగులకు తీపివార్తలు. సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులుండును. చేతి వృత్తులు, చిన్న పరిశ్రమలకు సహాయ సహకారాలుండును. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో ప్రాధమికంగా ప్రయోజనలుండును. గృహనిర్మాణ రంగం అభివృద్ధి. స్త్రీ, శిశు సంక్షేమ, కార్మిక, కర్షక రంగాలలో అభివృద్ధి గతం కంటే మెరుగగును. సరిహద్దు సమస్యలచే తరచూ ఇబ్బందులు. గ్యాస్, విద్యుత్ సరఫరాలలో సంక్షోభం. విదేశీ మారకం విలువ పెరుగును.

జూలై 13 నుంచి సెప్టెంబరు 4 వరకు శని కుజులు తులారాశిలో కలయికచే వాతావరణం అనుకూలం కాదు. సెప్టెంబరు 25 నుంచి నవంబరు 12 వరకు సినీరంగానికి, కంప్యూటర్, సాఫ్ట్ వేర్ రంగములకు గడ్డురోజులు.  సంగీత, సాహిత్య, కళారంగాలలో పరిస్థితులు వ్యతిరేకంగా ఉండును.

నవమేఘ నిర్ణయానుసారం వాయు నామ మేఘం వాయువ్య భాగంలో ఏర్పడును. ఇందుచే అధిక గాలులచే భారీ వర్షములు, జల ప్రమాదములు ఉత్పన్నమగును.  7 భాగాలు సముద్రమునందు, 9 భాగాలు పర్వతములయందు, 4 భాగాలు భూమియందు వర్షములు పడును. నైరుతి ఈశాన్య ఋతుపవనాలతో పాటు ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, వాయుగుండాలు అధికంగా ఉన్నందున భారీ వర్షములు అధికము. మేఘాధిపతి రవి కావటంచే అక్టోబర్, నవంబర్ లలో భారీ వర్షాలు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు ఎంతో అవసరం. సెప్టెంబరు 17 కన్యాసంక్రాంతి వచ్చిన 7వ రోజే మహాలయ అమావాస్య రావటం, అక్టోబరు 17  తులాసంక్రాంతి వచ్చిన 7వ రోజే దీపావళి అమావాస్య రావటంచే జల సంబంధ ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ వచ్చుటకు అవకాశములున్నాయి.
 
ధాన్యాధిపతి కుజుడైనందున ఎరుపు ధాన్యాలు, ఎరుపు నెలలు పుష్కలంగా పండుతాయి. కాని 2014 జూలై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలు ఎరుపు పంటలకు అనుకూలం కానందున రైతాంగం జాగ్రత్తలు తీసుకోవాలి. అర్ఘాధిపతి రవి అయిన కారణంగా వాణిజ్యం తరచూ మార్పులుంటూ, షేర్ విలువలు మోసపూరితంగా ఉండు సూచన కలదు. అక్టోబర్, నవంబరు మాసాలలో వాణిజ్య రంగానికి అనేక ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. అప్రమత్తతతో వ్యవహరించాలి.  
 
అక్టోబరు 16 నుంచి నవంబరు 16 వరకు మధ్యగల కాలంలో రక్షణశాఖ పనితీరు సమర్ధవంతంగాను, సమయాస్పుర్తితోను ఉండాలి.  అక్టోబరు 17 నుంచి నవంబరు 27 వరకు కుజ, గురులు షష్టాష్టక  స్థితులలో ఉండటము, నవంబరు 28 నుంచి 2015 జనవరి 4 వరకు ఉచ్చస్థితిలో కుజుడు, ఉచ్చస్థితిలో గురువు పరస్పర వీక్షణలతో ఉండి, కుజునిపై శనివీక్షణ కూడా ఉన్నందున ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలలో దుష్టశక్తులు దుష్ట పన్నాగాలు చేయు సూచన.
 
జయ జ్యేష్ట బహుళ సప్తమి గురువారం 19 జూన్ 2014 ఉదయం 8.47 గం॥ గురువు కర్కాటకరాశి ప్రవేశించే సార్ధ త్రికోటి తీర్థ సహిత యమునా నదికి పుష్కరాలు ప్రారంభమై జూన్ 30తో ముగియును.  పుష్కర రాజైన గురువు ఉచ్చ ప్రవేశం రోజే గురువారం కావటం పైగా గురు నక్షత్రమైన పూర్వాభాద్ర సప్తమి తిదితో ఉండటం అరుదుగా వచ్చే విశేషం. ప్రయాగ, ఢిల్లీ, ఆగ్రా, మధుర, బృందావనం స్నానయోగ్య పుణ్య క్షేత్రాలు. ధృవ, కంసఘాతికా, విశ్రమ ఘట్టములు మధురలో నున్నవి. బృందావనంలో 32 పుణ్య తీర్ధ ఘట్టాలున్నాయి. ఈ తీర్థాలలో స్నానం పవిత్ర పుణ్యప్రదం. 

2015 జనవరి 15 మకర సంక్రాంతి పర్వదినాన మకర సంక్రాంతి పుణ్య పురుషుడు మందాకినీ నామంతో, గజ వాహనంపై స్వాతి నక్షత్రంలో గురువారం రోజున రావటం మహా విశేష శుభప్రదం.

ఈ సంవత్సర ఆదాయం 93 కాగా, సంవత్సర వ్యయం 84 భాగాలు. ఇక ద్వాదశ రాశులకు ఆదాయ, వ్యయ, రాజ్యపూజ్య, అవమానాలను లెక్కిస్తే .... 
మేషరాశి వారికి 14 ఆదాయం, 2 వ్యయం, 4 రాజ్యపూజ్యం, 5 అవమానం
వృషభరాశి వారికి 8 ఆదాయం, 11 వ్యయం, 7 రాజ్యపూజ్యం, 5 అవమానం  
మిధునరాశి వారికి 11 ఆదాయం, 8 వ్యయం, 3 రాజ్యపూజ్యం, 1 అవమానం  
కర్కాటకరాశి వారికి 5 ఆదాయం, 8 వ్యయం, 6 రాజ్యపూజ్యం, 1 అవమానం  
సింహరాశి వారికి 8 ఆదాయం, 2 వ్యయం, 2 రాజ్యపూజ్యం, 4 అవమానం  
కన్యారాశి వారికి 11 ఆదాయం, 8 వ్యయం, 5 రాజ్యపూజ్యం, 4 అవమానం  
తులారాశి వారికి 8 ఆదాయం, 11 వ్యయం, 1 రాజ్యపూజ్యం, 7 అవమానం  
వృశ్చిక రాశి వారికి 14 ఆదాయం, 2 వ్యయం, 4 రాజ్యపూజ్యం, 7 అవమానం  
ధనస్సురాశి వారికి 2 ఆదాయం, 11 వ్యయం, 7 రాజ్యపూజ్యం, 7 అవమానం  
మకరరాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం, 3 రాజ్యపూజ్యం, 3 అవమానం  
కుంభరాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం, 6 రాజ్యపూజ్యం, 3 అవమానం 
మీనరాశి వారికి 2 ఆదాయం, 11 వ్యయం, 2 రాజ్యపూజ్యం, 6 అవమానం

మొత్తం మీద 2014-2015 జయ నామ సంవత్సర ఫలితాలను విశ్లేషిస్తే 68 శాతం ప్రజలందరూ సుఖ శాంతులతో ఉంటారు. మిగిలిన 32 శాతం ప్రజలు సుఖ శాంతులు ఉండే సూచనలు ఉన్నప్పటికీ, అనుభవించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక శ్రీ జయ సంవత్సరానికి దేవతా స్వరూపం శ్రీ మహా విష్ణువు కనుక ప్రతి వారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేక నామాలను లేక భావాన్ని అర్ధవంతంగా తెలుసుకుంటే తప్పక శుభం కలుగుతుంది.