Monday, January 6, 2014

భోగి జనవరి 13, సంక్రాంతి 14, కనుమ 15 శాస్త్రీయం

జనవరి భోగి 13, సంక్రాంతి 14, కనుమ 15


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దృగ్గణిత పంచాంగ కర్తలందరూ జనవరి 13 భోగి పండుగను, 14 సంక్రాంతి పండుగగా నిర్ణయం గణితం ప్రకారం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన ఈ.ఒ గారికి కూడా తెలియచేసి ఇదే తేదిలలోనే పర్వదినాన్ని టి.టి.డి ఆచరించి భక్తులకు ఎటువంటి సందేహాలు లేకుండా చేయాలని దృగ్గణిత పంచాంగకర్తలు కోరబోతున్నారు.

Saturday, January 4, 2014

జనవరి 14 మంగళవారం నాడే మకరసంక్రాంతి పర్వదినం, 15న కాదు

ఈ 2014 జనవరిలో మకరసంక్రాంతి పర్వదినం 14వ తేదిన లేక 15వ తేదిన అనే సందేహాలు చాలామందికి రావటంచే నాకు ఉత్తరాలు వ్రాయటం జరిగింది. వారందరికీ పూర్తి వివరాలను తెలియచేస్తున్నాను. 
ఖగోళంలో సూర్యగ్రహం మకరరాశి ప్రవేశం జరిగినరోజే మకర సంక్రాంతి పర్వదినాన్ని ఆచరిస్తారు. 14వ తేది మధ్యాహ్నం 1గం.14 నిముషాలకి మకర సంక్రమణం జరుగుతుంది. అందుచే మకరసంక్రాంతి పర్వదినాన్ని 14వ తేది మంగళవారం నాడే ఆచరించాలి. ఇదే సమయాన్ని ఖగోళ నక్షత్రశాలలు మరియు అమెరికాలోని నాసా వారు కూడా ధృవీకరిస్తున్నారు.ఈ విధంగా ఖచ్చిత సమాచారంతో వైజ్ఞానిక శాస్త్ర నిర్ణయాలతో  ఏకీభవించే పంచాంగాలను దృగ్గణిత పంచాంగాలు అంటారు.

వైజ్ఞానిక శాస్త్ర సమాచారాన్ని విభేదిస్తూ చెప్పే పంచాగాలను పూర్వగణిత పంచాంగాలు అంటారు. ఈ పూర్వగణితంతో  చేసే పంచాంగాలలో కొన్ని మాత్రం 14వ తేది కాక 15వ తేదీగా ప్రకటించాయి. కాని వీరి గణితాలు వైజ్ఞానిక శాస్త్ర సమయలతో ఏకీభవించవు. కొంతమంది పూర్వగణిత పంచాంగ కర్తలు, తాము రచించే గణితం పూర్వగణితమైనప్పటికీ , పండుగ మాత్రం 14వ తేదీనే ప్రకటించారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కొంతమంది పంచాంగ కర్తలు 2 తేదీలను ఇవ్వటం జరిగింది. అదెలాగంటే వారిచే రచింపబడిన ఒక పంచాంగంలో 14వ తేదిగాను, అదే రచయితతో వచ్చే మరో కేలండర్లో మరియు ఇంకో పంచాంగంలో 15 వ తేది ప్రకటించారు. అనగా రచయిత ఒక్కరే. కానీ తేదీలు మాత్రం రెండు రకాలు. ఇలాంటి పరిస్థితులలో పాఠకులు తప్పక తికమక పడతారు. ఈవిధంగా వచ్చిన తికమక సమాచారమే టీవీలలో కూడా రావటంతో... ఈ ధర్మసందేహం ఇంకా వేగంగా ప్రజలలోకి వెళ్లి, నిజానిజాలు తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఖచ్చిత గణితం ప్రకారము మరియు వైజ్ఞానిక సమాచారం ప్రకారము 14వ తేది మధ్యాహ్నం 1గం.14 నిముషాలకి మకర సంక్రమణం జరుగుతుంది.

ఇక పంచాంగ పరిభాషలో చెప్పాలంటే విజయ సంవత్సర పుష్యమాసం శు. చతుర్దశి మంగళవారం 14 జనవరి 2014 ఆరుద్ర నక్షత్ర ఇంద్ర యోగ, గరజికరణ నవమ ముహూర్త మేషలగ్న సమయం మద్యాహ్నం 1గం. 13నిముషములకు ఉత్తరాషాడ నక్షత్ర 2వ పాదమైన మకరరాశి లోనికి సూర్య ప్రవేశంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమగును. కనుక జనవరి 14 మంగళవారం మకరసంక్రాంతి పర్వదినం.  మకరసంక్రాంతి పుణ్య పురుషుడి పేరు మహోదరుడు. ఈ పుణ్య పురుషుడి వాహనం ఏనుగు. కనుక పితృ పితామహాది వంశవృద్ధుల తృప్తి కొరకుగా సంక్రమణ పర్వదినాన తర్పణ కార్యక్రమాలను ఆచరించేది.