Saturday, May 19, 2012

ఆదివారం అమావాస్య కంకణ గ్రహణంతో షడ్గ్రహ కూటమి ప్రారంభం

శ్రీ నందన వైశాఖ అమావాస్య 20  మే 2012 ఆదివారం వృషభ రాశిలో, కృత్తిక నక్షత్రంలో కేతు గ్రస్తంగా కంకణసూర్య గ్రహణం సంభవించును. ఈ గ్రహణాన్ని చూడామణి గ్రహణమని పిలుస్తారు. ఇది భారతదేశంలో కనపడదు. ఆసియా, పసిఫిక్, ఉత్తర అమెరికాలలో పాక్షిక గ్రహణంగా, జపాన్ పశ్చిమ అమెరికాలలో కంకణగ్రహణంగా కనిపించును. ఖగోళంలో స్థిరమైన కంకణ గ్రహణ బింబము 5 నిముషాల 46 సెకన్లు ఉండును. కంకణ గ్రహణమంటే సూర్యబిమ్బం కంటే చంద్రబింబం సైజు తక్కువగా ఉన్నందున సూర్యబిమ్బంలో చంద్రబింబం వరకు వర్ణము మారి మిగిలిన భాగము దేదీప్యమాన వెలుగుతో ఉండి, కంకణము వలె కనపడును. ప్రపంచ మొత్తంలో టోక్యో, హాంగ్ కాంగ్ ప్రాంతాలలో కంకణ సూర్యగ్రహణంగాను, మిగిలిన ప్రాంతాలలో పాక్షిక సూర్యగ్రహణంగాను సంభవించును.

న్యూయార్క్, వాషింగ్టన్ డి సి, బోస్టన్ , డెట్రాయిట్, రిచ్మండ్ ప్రాంతాలలో గ్రహణం కనపడదు. చికాగో, అట్లాంటా, ఆస్టిన్, లాస్ఏంజెల్స్ మొదలైన ప్రాంతాలలో సాయంత్ర సమయం నుంచి సూర్యాస్తమం వరకు సూర్య గ్రహణం కనపడును.

ఈ సూర్యగ్రహణం జరిగే సమయం నించే ఖగోళంలో వృషభరాశిలో బుధుడు, చంద్రుడు, శుక్రుడు, రవి, కేతువు, గురువు అను ఆరు గ్రహాలు కూటమిగా ఉండును. 23 వ తేది బుధవారం ఉదయం 5 గంటల 03 నిముషాల వరకు వృషభరాశిలో ఆరు గ్రహాల సంచారముండును. 23 ఉదయం 5 గంటల 03  నిముషాల నుంచి చంద్రుడు ప్రక్క రాశిలోనికి వెళ్లిపోవటంతో బుధ, గురు, శుక్ర, రవి, కేతువులు అనబడే పంచగ్రహ కూటమి మొదలగును. 2012 జూన్ 4 వ తేది సోమవారం సాయంత్రం 6 గంటల 30 నిముషాలవరకు వృషభరాశిలో పంచగ్రహ కూటమి కొనసాగును.

2012 జూన్ 4 సోమవారం జ్యేష్ట పూర్ణిమ రోజున పంచగ్రహ కూటమి మిగియబోయే తరుణంలో వృశ్చిక రాశిలో రాహు గ్రస్తంగా జ్యేష్ట నక్షత్రంలో పాక్షిక చంద్రగ్రహణం జరుగును.  మే 20 నాటి కంకణ సూర్య గ్రహణం, జూన్ 4 నాటి పాక్షిక చంద్రగ్రహణం రెండూను... భారతదేశంలో కనపడవు. భారతదేశంలో ప్రచ్చాయ అనగా చంద్రుడు కనపడతాడు, కాని తేజోహీన కాంతితో కనపడతాడు. 
దక్షిణ కోస్తా తీర ప్రాంతాలలో జూన్ 4 సాయంత్రం 5 . 36 గంటల నుంచి 6 .48 నిముషాల వరకు కాంతి విహీనమైన ప్రచ్చాయ చంద్ర గ్రహణం జరుగును.  విదేశాలలో మాత్రమే కంకణ సూర్య గ్రహణము, పాక్షిక చంద్ర గ్రహణము కనపడును. మే 20 వ తేది నుంచి వృషభరాశిలో కంకణ సూర్య గ్రహణంతో షడ్గ్రహ, పంచ గ్రహ కూటములు మొదలై... జూన్ 4 వ తేది పాక్షిక గ్రహణంతో పంచ గ్రహ కూటమి ముగిసి కేవలం చతుర్గ్రహ కూటమి మాత్రమే వృషభరాశిలో ఉండును. ఈ చాతుర్గ్రహ కూటమి ప్రారంభంలోనే శుక్రగ్రహణం జరుగుతున్నది. భారత కాలమాన ప్రకారం 6 వ తేది ఉదయం 3 గంటల 21 నిముషం నుంచి 10 గంటల 01 నిముషం వరకు శుక్ర గ్రహణం ఉండును. భారతదేశ వ్యాప్తంగా ప్రతీ ప్రాంతంలోను సూర్యోదయాలతోనే శుక్రగ్రహణం నల్లని మచ్చలా సూర్యబింబం పై కంటికి ప్రత్యక్షంగా గోచరించును. తిరిగి మరో 105 సంవత్సరాల తర్వాత 2117 డిసెంబర్ 10 వ తేదిన శుక్రగ్రహణం జరుగును. అనగా 105 సంవత్సరాల 6 మాసాల 6  రోజులకు శుక్ర గ్రహణం సంభావిస్తుందన్నమాట.

సూర్యునికి ఈశాన్య భాగంలో శుక్ర గ్రహణ స్పర్శ కాలం మంగళవారం రాత్రి 3 గం. 21 నిముషాలు.
శుక్ర గ్రహణ మధ్య కాలము ఉదయం 6 గం. 59 నిముషాలు.
వాయువ్య భాగంలో శుక్ర గ్రహణ మోక్షకాలము ఉదయం 10 గం. ఒక్క నిముషము.
సూర్య గ్రహానికి వెలంచుల మధ్య శుక్ర గ్రహణ ప్రయాణము 400 నిముషాలు.
సూర్య గ్రహ లో అంచుల మధ్య శుక్ర గ్రహ ఆద్యంత పుణ్యకాలము 364 నిముషాలు.

అందుచేత భారతదేశ వ్యాప్తంగా సూర్యోదయాలనుంచి.... ఉదయం 10.01 వరకు ప్రత్యక్షంగా నేత్రాలతో చూడకుండా, మసి పూసిన అద్దంతో గాని, ఫిల్మ్ తో గాని ఇతర అందుబాటులో వుండే సోలార్ ఫిల్టర్ ద్వారా గాని శుక్ర గ్రహణాన్ని వీక్షించవచ్చును. ఉత్తర వాయువ్య అమెరికా, ఉత్తర ఆసియా, జపాన్, కొరియా, తూర్పు చైనా, పశ్చిమ ఫసిఫిక్, తూర్పు మధ్య యూరప్, తూర్పు ఆఫ్రికా ప్రాంతాలలో శుక్ర గ్రహణం కనిపించును.


384 రోజులు నడిచే  ఈ నందన నామ సంవత్సరములో రాజు, మంత్రి, శుక్రుడు. ఈ శుక్రునికి యొక్క స్వక్షేత్రమే వృషభ రాశి. ఈ వృషభరాశిలోనే మే 20 కంకణ గ్రహణంతో గ్రహ కూటములు ప్రారంభమై శుక్ర గ్రహణం కూడా జరగటం అరుదుగా వచ్చే విశేషం.
ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న ఏ ఒక్కరు కూడా రాబోయే శుక్ర గ్రహణాన్ని వీక్షించాలేరేమో. అందుచేత అరుదైన గ్రహస్థితులు పాలకులకి, ప్రభువులకి సమస్యలు తెచ్చే విధంగా ఉంటున్నప్పటికీ, అరుదుగా వచ్చే ఈ శుక్ర గ్రహణాన్ని వీక్షించి, భవిష్యత్ కాలంలో అందరికి శుభాలు కలగాలని ప్రతి ఒక్కరు వారి వారి ఇష్ట దైవాలను ప్రార్దించేది. రాబోయే రోజుల నుంచి ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని కీర్తిముఖుడిని ప్రార్దించి సకల శుభాలతో ఉందురని ఆశిస్తాను.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.