Saturday, April 21, 2012

2012 జూన్ 6 న అరుదైన శతాబ్ది రెండవ శుక్రగ్రహణం

శుక్ర గ్రహణం ఏమిటనుకుంటున్నారా ?... నిజమే. సూర్య చంద్రులకే కాదు. మిగిలిన గ్రహాలకు అత్యంత అరుదుగా గ్రహణాలు వస్తుంటాయి. అయితే చాలా మంది వీటిని గ్రహణాలుగా భావించరు. కొంతమంది సంక్రమణంగా భావిస్తుంటారు. సంక్రమణం అనగా... ఒక గ్రహం మరొక రాశిలోనికి ప్రవేశించడమును సంక్రమణం అంటారు. ప్రతి నెలలో సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశి లోనికి ప్రవేసిస్తుంటాడు. దీనినే సంక్రమణం అంటాము. అలాగే అందరికి తెలిసింది... జనవరి నెలలో వచ్చే మకర సంక్రమణం. అనగా మకరరాశి లోకి సూర్యుడు ప్రవేశించడన్నమాట.

అయితే శుక్ర గ్రహ విషయంలో 2012 జూన్ 6 వ తేదీన భారతదేశంలో శుక్ర గ్రహణం సంభవించనుంది. దేదీప్యమాన వెలుగుతో వుండే సూర్యుడు తేజోహీనుడైతే, దానిని సూర్యగ్రహణం గాను, రాత్రి సమయంలో వెన్నెలను అందించే కాంతి గల చంద్రుడు కాంతి విహీనమైపోతే చంద్ర గ్రహణంగా భావిస్తున్నాం. మరి మహా కాంతితో నక్షత్రం వలె రాత్రి సమయంలో కనపడే శుక్ర గ్రహం కూడా కాంతివిహీనమై నల్లని మచ్చలా కనపడటాన్ని జ్యోతిష పరిభాషలో గ్రహణంగా పేర్కొంటారు.


ఈ శుక్ర గ్రహణం శతాబ్దికి రెండు సార్లు మాత్రమే వస్తుంది. మొదటి సారి వచ్చి, తదుపరి 8 సంవత్సరాలకు రెండవసారి వస్తుంది. ఆపై 105 సంవత్సరాలకు 3 వ సారి కనపడుతుంది. ఆ తర్వాత తిరిగి 8 సంవత్సరాలకు, ఆపై 105 సంవత్సరాలకు... ఈ విధంగా 8 మరియు 105 సంవత్సరాల అంతరంతో ఈ శుక్ర గ్రహణాలు వస్తుంటాయి. ఈ పరంపరలో ఈ శతాబ్దిలో 105 సంవత్సరాల అంతరం తదుపరి  8 జూన్ 2004 తారణ నామ సంవత్సర జ్యేష్ట బహుళ షష్టి మంగళవారం నాడు సంభవించింది. తిరిగి 8 సంవత్సరాల అంతరంతో ఈ 2012 జూన్ 6 నందన నామ సంవత్సర జ్యేష్ట బహుళ విదియ బుధవారం నాడు శుక్ర గ్రహణం సంభవించనుంది.


సూర్యుడికి భూమికి మధ్య చంద్రుని బదులు శుక్రుడు అడ్డు వస్తే ఓ మినపగింజ ఆకృతిలో సూర్యబింబం పై శుక్రుడు నల్లని చుక్కలా గోచరమగును. దీనినే శుక్ర గ్రహణం అంటారు. భారతదేశంలో 2012 జూన్ 6 వ తేదీనా, ఇతర దేశాలలో జూన్ 5 వ తేదీనా శుక్రగ్రహణం సంభవించును. భారత కాలమాన ప్రకారం 2012 జూన్ 6 సూర్యోదయానికి పూర్వము అనగా మంగళవారం రాత్రి మూలా నక్షత్ర ధనూరాశిలో  ఉత్తరార్ధగోళంలో ఈశాన్య భాగంలో శుక్ర గ్రహణ స్పర్శ ప్రారంభమగును. భారత్ లో, అది రాత్రి సమయమైనందున శుక్ర గ్రహణ స్పర్శను వీక్షించలేము. ఆరవ తేది సూర్యోదయం తర్వాత భారతదేశం లోని అన్ని ప్రాంతాలలో శుక్ర గ్రహణాన్ని వీక్షించవచ్చు.


సూర్యునికి ఈశాన్య భాగంలో శుక్ర గ్రహణ స్పర్శ కాలం మంగళవారం రాత్రి 3 గం. 21 నిముషాలు.
శుక్ర గ్రహణ మధ్య కాలము ఉదయం 6 గం. 59 నిముషాలు.
వాయువ్య భాగంలో శుక్ర గ్రహణ మోక్షకాలము ఉదయం 10 గం. ఒక్క నిముషము.
సూర్య గ్రహానికి వెలంచుల మధ్య శుక్ర గ్రహణ ప్రయాణము 400 నిముషాలు.
సూర్య గ్రహ లో అంచుల మధ్య శుక్ర గ్రహ ఆద్యంత పుణ్యకాలము 364 నిముషాలు.

సూర్యునిపై నల్లని మచ్చగల శుక్ర గ్రహణం తోనే భారతదేశ వ్యాప్తంగా సూర్యోదయాలు ప్రారంభమగును. అందుచేత భారతదేశ వ్యాప్తంగా సూర్యోదయాలనుంచి.... ఉదయం 10.01 వరకు ప్రత్యక్షంగా నేత్రాలతో చూడకుండా, మసి పూసిన అద్దంతో గాని, ఫిల్మ్ తో గాని ఇతర అందుబాటులో వుండే సోలార్ ఫిల్టర్ ద్వారా గాని శుక్ర గ్రహణాన్ని వీక్షించవచ్చును. ఉత్తర వాయువ్య అమెరికా, ఉత్తర ఆసియా, జపాన్, కొరియా, తూర్పు చైనా, పశ్చిమ ఫసిఫిక్, తూర్పు మధ్య యూరప్, తూర్పు ఆఫ్రికా ప్రాంతాలలో శుక్ర గ్రహణం కనిపించును.


శుక్ర గ్రహణం వృషభ రాశిలో, రోహిణి నక్షత్రంలో జరుగుతున్నది. ఆనాటి దిన నక్షత్రం మూల నక్షత్రం. ఇది కేతు స్వనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున గ్రహణం సంభవిస్తున్నది. 2012 మే 5 శనివారం వైశాఖ పూర్ణిమ స్వాతి నక్షత్రంలో పెద్ద జాబిలీ కనపడటము 1 వ విశేషమైతే,  2012 మే 20 వైశాఖ అమావాస్య ఆదివారం రోజున కంకణ సూర్య గ్రహణం జరగటం 2 వ విశేషమైతే 2012 జూన్ 4 సోమవారం జ్యేష్ట పూర్ణిమ రోజున పాక్షిక చంద్ర గ్రహణం జరగటం 3 వ విశేషమైతే, 2012 జూన్ 6 బుధవారం సూర్యునిపై శుక్ర గ్రహణం జరగటం మరో విశేషం . ఈ నాల్గు విశేషాలు కేవలం 33 రోజులలోనే సంభవిస్తున్నాయి. ఈ 33 రోజులలో జరిగే ఈ విశేషాల కారణంగా
భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. గర్భిణులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోనల్సిన అవసరం లేదు. గర్భినులతో పాటు అందరూ ఈ గ్రహణాన్ని పరికరాల ద్వారా చూడవచ్చును. నేరుగా సూర్యుని చూడవద్దు.

భారతదేశంలో శుక్ర గ్రహణాన్ని సగ బాగం నుంచి వీక్షించవచ్చు. హాంగ్ కాంగ్ లో 6 వ తేది ఉదయం 6 గం. 11 నిముషాల నుంచి మధ్యాహ్నం 12 గం. 48 వరకు , టోక్యో లో
6 వ తేది ఉదయం 7 గం. 10 నిముషాల నుంచి మధ్యాహ్నం 1 గం. 47 వరకు పూర్తి శుక్ర గ్రహణాన్ని వీక్షించవచ్చు. సింగపూర్, మలేసియాలలో 6 వ తేది ఉదయం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12.49 వరకు శుక్ర గ్రహణం ఉండును.  అలాగే 5 వ తేదిన చికాగో, పీటర్స్ బర్గ్ , ఆస్టిన్ లలో సా. 5. 04 నుంచి, న్యూయార్క్, అట్లాంటా, జాక్సన్ విల్లె, న్యూజెర్సీ, వాషింగ్టన్, ఫ్లోరిడా, బోస్టన్, మాంట్రియాల్ , ఫిలడెల్ఫియా ప్రాంతాలలో 5 వ తేది సాయంత్రం 6. 03 నుంచి సూర్యాస్తమయం వరకు శుక్ర గ్రహణం గోచరించును. కాలిఫోర్నియా,రోజ్ విల్లె ప్రాంతాలలో మధ్యాహ్నం 3 గం. 06 నిముషాల నుంచి సూర్యాస్తమం వరకు శుక్ర గ్రహణం దర్శించవచ్చు. భారతదేశంలో శుక్ర గ్రహణం ఒక సరళరేఖలా ప్రయాణం సాగించగా.... వివిధ దేశాలలో శుక్ర గ్రహణం వివిధ ఆకృతులలో గ్రహణ ప్రయాణం చేయటం విశేషం.

384 రోజులు నడిచే  ఈ నందన నామ సంవత్సరములో రాజు, మంత్రి, శుక్రుడు కావటం, ఈ శుక్రునికి గ్రహణం రావటం అరుదుగా వచ్చే విశేషం. అంతే కాక రాజు, మంత్రిగా ఉన్న శుక్రుడు, నిర్ణీత కాలం కంటే 48 రోజులు ముందుగా అనగా 2013 ఫిబ్రవరి 22 నుంచి శుక్ర మూఢమి వచ్చిన కారణంగా రాజు, మంత్రి పదవి నుంచి శుక్రుడు నిష్క్రమిస్తున్నాడు. మొత్తం మీద అరుదైన గ్రహ స్థితులతో, అరుదైన గ్రహణం తో, రాజు, మంత్రి పదవి ఒకే గ్రహానికి వచ్చి, నిర్ణీత కాలం కంటే ముందే వెళ్ళటం అరుదైన విశేషం. తిరిగి 2117  డిసెంబర్ 11 వ తేది అనగా స్వస్తిశ్రీ ఈశ్వర నామ సంవత్సర మార్గశిరమాసం బహుళ విదియ శనివారం రాహు నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రమున్నరోజున వృశ్చిక రాశిలో శుక్రునికి గ్రహణం సంభవించనుంది. అనగా 105 సంవత్సరాల 6 మాసాల 6  రోజులకు శుక్ర గ్రహణం సంభావిస్తుందన్నమాట. ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న ఏ ఒక్కరు కూడా రాబోయే శుక్ర గ్రహణాన్ని వీక్షించాలేరేమో. అందుచేత అరుదైన గ్రహస్థితులతో అరుదుగా వచ్చే ఈ శుక్ర గ్రహణాన్ని వీక్షించి, భవిష్యత్ కాలంలో అందరికి శుభాలు కలగాలని ప్రతి ఒక్కరు వారి వారి ఇష్ట దైవాలను ప్రార్దించేది.

ద్వాదశ రాశులవారు ఏయే విషయాలలో అధిక శ్రద్ధ అవగాహన తీసుకొనవలసి ఉంటుందో, రాబోయే రోజులలో సంవత్సరాలలో శుభాలు కాంక్షించటానికి ఇంకా సులువైన మార్గాలేమిటో నిదానంగా తెలుసుకుందాం.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.