Thursday, January 13, 2011

దశాబ్దాల తరువాత అరుదైన భోగి


ప్రతి సంవత్సరం ఆంగ్ల నెలల ప్రకారం జనవరి నెలలోనూ, తెలుగు నెలల ప్రకారం పుష్య మాసంలోనూ శ్రద్ధతో ఆచరించే పెద్దల పండుగగా పేరొందిన పెద్ద పండగే మకర సంక్రాంతి. దక్షిణాయనానికి ఆఖరి రోజు, ధనుర్మాసానికి ఆఖరిరోజు, మకర సంక్రాంతి కి ముందు రోజు భోగి పండుగ. నిఘంటువు ప్రకారం భోగి అంటే తొలిరోజు అని అర్ధం. పెద్ద పండుగగా పిలువబడే మూడు రోజుల సంబరాల సంక్రాంతికి తొలిరోజును భోగిగా పిలుస్తారు.

వ్యవసాయ పనుల రద్దీ తగ్గి అన్నదాతలు సుఖంగా కాలక్షేపం చేయటానికి, చేతికందిన పంటను అనుభవానికి తెచ్చుకొని భోగభాగ్యాలు అనుభవించటానికి వీలు కలిగించే పండుగ భోగి పండుగ అని పెద్దలు అంటారు. భోగి రోజున రైతులందరూ సంవత్సరం పొడవునా వ్యవసాయ పనులు చేయగా వచ్చిన చెత్త చెదారం అంతా ఈరోజు వేకువజామునే మంటలుగా వేసుకుంటారు.

గృహంలో వున్న పాత కర్ర సామాను, పనికిరాని వస్తువులు అన్నింటిని మంటలలో వేస్తారు. పరోక్షంగా ఈ మంటలనే వరుణయాగాలుగా పిలవాలసి వుంటుంది. ఎందుకంటే వరుణ దేవుని కరుణ కటాక్షాలతో అన్నదాతల ముంగిళ్ళలోకి దాన్యం రావటం, ఆనందంతో వుండటం, తరువాత సంవత్సరం కూడా ఎలాంటి సమస్యలు లేకుండా వ్యవసాయానికి వరుణుడు అనుగ్రహించాలనే దృక్పదంతో ఈ మంటలను వేయటం అంతర్గత రహస్యం. మేఘాలకు అధిపతైన వరుణ దేవుడిని గ్రామీణులు మంటల రూపంలో ప్రార్ధిస్తారు. ద్వాపర యుగంలో ఈ భోగి పండుగరోజు వేసే మంటలు మేఘాదిపతిని ప్రార్ధించటానికని పురాణాలు చెబుతున్నాయి.

ఈ 2011 సంవత్సరంలో అరుదైన భోగి రానున్నది. శుక్రవారం భోగి పండుగ రావటం విశేషమేమికాదు కానీ శుక్రగ్రహ నక్షత్రమైన భరణి నక్షత్రంతోనూ, శుక్ర గ్రహ వారమైన శుక్రవారంతోనూ భోగి రావటంమాత్రం అత్యంత అరుదైనది. పదమూడు దశాబ్దాల క్రితం అంటే 130 సంవత్సరాల క్రితం శుక్రవారం భరణి నక్షత్రంలో భోగి పండుగ వచ్చింది. తిరిగి ఇంత కాలానికి ఈ జనవరి 14 శుక్రవారం భరణి నక్షత్రంతో భోగి పండుగ రానున్నది. ఈ భరణి నక్షత్ర శుక్రవారంతో కూడిన భోగి రోజున మహాలక్ష్మి దేవిని మనసారా భక్తితో కొలిస్తే భోగభాగ్యాలతో తులతూగుతారని పెద్దలు చెబుతారు.

గృహాలలో శ్రీ చక్ర మేరు వున్నవారు ఈ భరణి నక్షత్ర భోగి రోజున ఈ క్రింది మంత్రంతో మహాలక్ష్మిని ఆరాధించండి.

ఓం శ్రీం హ్రీం ధ్ర్రాం క్లీం ధన్యే ధనవర్ధిని సుమేరు మధ్య శృంగస్తా శ్రీమన్నగరనాయికా నమః ( లలితా సహస్రనామ స్తోత్రంలో 22 వ సంఖ్యలో వున్న రెండు పంక్తులలో మొదటి పంక్తి ) అంటూ 108 పర్యాయములు జపించి తీపి పదార్ధ నివేదనతో శ్రీమహాలక్ష్మిని సేవించాలి.

భూ ప్రస్తార మేరు వున్నవారు ఈ భరణి నక్షత్ర భోగి రోజున ఈ క్రింది మంత్రంతో మహాలక్ష్మిని ఆరాధించండి.

ఓం శ్రీం హ్రీం ధ్ర్రాం క్లీం ధన్యే ధనవర్ధిని ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ నమః ( లలితా సహస్రనామ స్తోత్రంలో 176 వ సంఖ్యలో వున్న రెండు పంక్తులలో మొదటి పంక్తి ) అంటూ 108 పర్యాయములు జపించి తీపి పదార్ధ నివేదనతో శ్రీమహాలక్ష్మిని సేవించాలి.

శ్రీ చక్ర మేరు, భా ప్రస్తారములు లేనివారు మహాలక్ష్మి దేవి చిత్రపటాన్ని వుంచి ఓం శ్రీం హ్రీం ధ్ర్రాం క్లీం ధన్యే ధనవర్ధిని శ్రీమహాలక్ష్మి దేవతాభ్యో నమః అంటూ 108 పర్యాయములు జపించి తీపి పదార్ధ నివేదనతో శ్రీమహాలక్ష్మిని సేవించాలి.