Sunday, June 6, 2010

శ్రీ కాళహస్తి మహారిష్టానికి మహా శాంతి

శ్రీకాళహస్తి కి వందల ఏళ్ళ పాటు చిహ్నంగా అలరారిన గాలి గోపురం 2010 26 మే రాత్రి 7గంటల 50నిమిషాలకు శిధిల రాశిగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా భక్తులను కలచి వేస్తోంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం లేదంటూ దేవదయ ధర్మదయ శాఖా మంత్రి గాదె వెంకట రెడ్డి తన అసమర్ధత చాటుకొన్నారు.
గాలి గోపురం క్రింద దాదాపు 270కోతులు, మరో ఇద్దరు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఓ చిన్న కోతి పిల్ల మాత్రం బతికి బయట పడగలిగింది. గాలి గోపురం కూలడం ఒక అరిష్టానికి ఓ అంచనా. దాని క్రింద కోతులు మృతి చెందటం మరో అరిష్టం. కోతుల మృత కళేబరాలు, మానవ మృతదేహాలు శిధిలాల క్రింద వుండగా, గర్భాలయంలో స్వామి వారికి పూజలు చేయటం మహా అరిష్టం. దీనిపై ప్రభుత్వం గానీ, ఆలయ పాలక మండలి గానీ పెదవి విప్పకపోవడం శోచనీయం.
2009 సంవత్సరం జూన్ 22న ముక్కంటి ఈశ్వరుడు ముందే జాగ్రత్త పడుతున్నాడా ? అనే పోస్టింగ్ లో శ్రీ కాలహస్తీశ్వరునికి అర్ధాష్టమ శని ప్రారంభమైనదని, 2009 జూలై 20న గ్రహణం రోజున దైవ దర్శనమా ? అనే ఆశక్తికరమైన విషయాలు గ్రహభూమి బ్లాగులో వుంచటం జరిగింది.
వాయులింగేశ్వరుడిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ కాళహస్తి రాజగోపురం క్రింద వాయు పుత్ర అంశకు చెందిన వానరాలు మృతి చెందడం మహా తప్పిదం. ఈశ్వరుని వీర్యాన్ని వాయుదేవుడు అంజనీదేవి గర్భంలో ఉంచినందున, జననమే వాయుపుత్రుడైన ఆంజనేయ స్వామి. పరోక్షంగా ఈశ్వర పుత్రుడే ఆంజనేయ స్వామి. వాయులింగేశ్వరుడికి ఈ క్షేత్రంలో మహా అరిష్టం ఏర్పడినందుకు, దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ మహా శాంతి జరపవలసి వుంది. శ్రీ కాళహస్తికి వెళ్ళిన భక్తులందరికీ అక్కడ స్వామిని ఈశ్వరుడిగా భావించరు. రాహు కేతువులుగా దర్శించుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం గత 2దశాభ్దాలుగా దేవస్థాన ఆదాయం కోసం రాహు కేతువుల పూజలు చేయటం, ఇవి కూడా తప్పుల తడికగా చేస్తున్నందున స్వామి వారికి ఈ పూజలు మహా అరిష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.
2010 జూన్ 7 సోమవారం హనుమజ్జయంతి పర్వదినం. అలాగే జూన్ 13వ తేది ఆదివారం ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఆరుద్ర శివుని జన్మనక్షత్రం అందుకే 7వ తేది సోమవారం హనుమజ్జయంతి నుంచి 13వ తేది ఆరుద్ర నక్షత్రం ఆదివారం వరకు ప్రతిరోజు రాహు కాల సమయంలో భక్తులందరూ భక్తి ప్రపత్తులతో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ప్రపంచ వ్యాప్తంగా రాహుకాల సమయాలు మారుతూ వుంటాయి.
ఇంతకీ ఏ సమయంలో రాహుకాలం పాటించాలి అంటే..... సూర్యుడు 6గంటలకు ఉదయించి సాయంత్రం 6గంటలకు అస్తమిస్తే, దినప్రమానం 12గంటలు వుంటుంది. దీనిని 8 సమభాగాలు చేయగా, ఒక్కో భాగమునకు ఒకటిన్నర గంట వచ్చును. ఈ 8 సమభాగాలలో మొదటి గంటన్నర భాగాన్ని ఏ వారమునకు కేటాయించలేదు. రెండవ భాగాన్ని సోమవారానికి, మూడవదాన్ని శనివారానికి, నాల్గవదాన్ని శుక్రవారానికి, అయిదవ భాగాన్ని బుధవారానికి, ఆరవదాన్ని గురువారానికి, ఏడవభాగాన్ని మంగళవారానికి, ఎనిమిదవ భాగాన్ని ఆదివారానికి కేటాయించటమైనది. ఇది సూర్యోదయ, సూర్యాస్తమయములు ఉదయం 6గంటలు సాయంత్రం 6గంటలు అయినచో రాహుకాలం ఏ విధంగా వుంటుంది అనే చెప్పే ఓ ఉదాహరణ మాత్రమే.
పై ఉదాహరణ ప్రకారం 7వ తేది సోమవారం నుంచి 13వ తేది ఆదివారం వరకు ప్రతిరోజూ రాహుకాల సమయాలను గణించుకొని.... భక్తులు వ్యక్తిగతంగా గాని సామూహికంగా గాని హనుమాన్ చాలీసా పారాయణ చేసి, శ్రీ కాళహస్తి మహా పుణ్య క్షేత్రానికి ఆపాదింపబడిన మహా అరిష్టానికి తగ్గ మహా శాంతి పారాయణ క్రతువులో పరోక్షంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని విశ్వసిస్తున్నాను..... శ్రీనివాస గార్గేయ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.