Monday, January 4, 2010

ఆంధ్రప్రదేశ్ పై జన్మశని ప్రభావం

1 నవంబర్ 1956 దుర్ముఖి నామ సంవత్సరం ఆశ్వీయుజ బ. చతుర్దశి రోజున చిత్రా నక్షత్రంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినది. ఆంధ్రప్రదేశ్ జన్మ నక్షత్రం చిత్రానక్షత్రం కన్యా రాశి. 2007 జూలై నుంచి ఏలినాటి శని జరుగుచూ 2014 నవంబర్ తో ముగియనుంది. ఈ ఏలినాటి శని మూడు భాగాలు మొదటి భాగాన్ని ద్వాదశ శని లేక వ్యయ శని అంటారు. ఇది 2009 ఆగస్టు చివరితో ముగుసిపోయింది. 2009 సెప్టెంబర్ నుంచి 2012 ఆగస్టు వరకు జన్మ శని భాగం జరుగుతున్నది. మూడవ భాగ శని సెప్టెంబర్ 2012 నుంచి నవంబర్ 2014 వరకు జరుగును.

ప్రస్తుతం ఏలినాటి శని రెండవ భాగం జరుగుచున్న ఈ రోజులలో తెలంగాణా ఉద్యమం అధికమైంది. ప్రజలలో ప్రస్తుతం ఒక వినికిడి వుంది. అది ఏమంటే... రాజశేఖరరెడ్డి బ్రతికుంటే...... కే.సి.ఆర్ ఇలా విజృంభించే వాడు కాదని. కానీ జ్యోతిష్యపరంగా వారి ఆలోచన మాత్రం తప్పు. ఎందుచేతనంటే... కే.సి.ఆర్ ఆశ్లేష నక్షత్ర కర్కాటక రాశి జాతకుడు. వారికి 2002 జూన్ నుంచి 2009 ఆగస్టు వరకు ఏలినాటిశని భాగం జరిగింది. మూడు భాగాల శని పూర్తి చేసుకొని కే.సి.ఆర్ దేనికైనా సిద్ధంగా వున్నాడు.

కే.సి.ఆర్ కు ఏలినాటిశని పూర్తి అయిన ఘడియ నుంచే ఆంధ్రప్రదేశ్ జన్మశని భాగం మొదలైంది. అందుచేతనే ... సెప్టెంబర్ లో ముఖ్యమంత్రిని కోల్పోవటం, తరువాత జరిగిన వరుస పరిణామాలను చూస్తూనే ఉన్నాము.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. కే.సి.ఆర్ కు జన్మ రాశిలోనికి కుజుడు 5 అక్టోబర్ నుంచి ప్రవేశించి 2010 మే 26 వరకు 234 రోజులు స్తంభించటం జరిగినది. అందుచేత కే.సి.ఆర్ కు లగ్నంలో నీచ కుజ స్తంభన ఉండటంచే ప్రత్యేక తెలంగాణా కోసం, గతం కంటే ఇంకా హడావిడి చేయటం జరుగుచున్నది. మే 26 తదుపరి కుజుడు కే.సి.ఆర్ కు వాక్ స్థానంలోకి ప్రవేశించి జూలై 20 వరకు ఉంటాడు. గనుక 5 అక్టోబర్ 2009 నుంచి 20 జూలై 2010 వరకు కే.సి.ఆర్ విజృంభణతో రాష్ట్రంలో శాంతి భద్రతలు మరికొంత దెబ్బతినే అవకాశముంది.

ప్రస్తుతం ఒక విషయం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ జన్మ నక్షత్రం చిత్ర. చిత్రా నక్షత్రానికి అధిపతి కుజుడు. జరిగేది జన్మ శని. పైగా ఈ సంవత్సరం లో 20 జూలై నుంచి 31 ఆగస్టు వరకు ఆంధ్రప్రదేశ్ జన్మ రాశి కన్యలో కుజగ్రహం, శనిగ్రహం కలయికలు జరుగుచున్నవి. అందువలన శాంతిభద్రతలు ఇంకా విషమించే అవకాశం వున్నది.

దీనికితోడు చిదంబరం గారు డిశంబర్ 9 తేదీన మొదటి స్టేట్మెంట్ ఇచ్చారు. కుజ సంఖ్య అయిన తొమ్మిదవ తేదీన, తొమ్మిదవ తిది అయిన నవమిలో రాత్రి సమయములో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ సమయములో వున్న గ్రహస్థితి ఎవరికీ అనుకూలం కానేకాదు. ఇక రేపటి రోజున 5 జనవరి మంగళవారం రోజున డిల్లీలో ఎనిమిది రాజకీయ పార్టీలతో చర్చలకు ఆహ్వానించారు. రేపటి రోజు కుజవారం. 8 సంఖ్య శనికి సంబంధం. శని కుజులు పరస్పర శత్రువులు. రేపటి నక్షత్రం ఆంధ్రప్రదేశ్ జన్మ నక్షత్రమైన చిత్రకు నైధనతార ( ప్రమాద తార ) అవుతున్నది. దీనినిబట్టి రేపటి చర్చలు పూర్తిగా విఫలమై, శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిననున్నవి. దీనికి తోడు జనవరి 1 నుంచి జనవరి 15 వరకు గ్రహ సంచారరీత్యా రవాణా రాకపోకలకు పూర్తి అంతరాయాలుంటాయి. ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు కూడా మంచు కారణంచే ఆగిపోతున్నవి.

రాజశేఖరరెడ్డి గారు మరణించకుండా ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఇలానే కొనసాగుతుంటుంది. కే.సి.ఆర్ గారికి ప్రస్తుతం అష్టమ స్థానంలో గురువు సంచారం చేస్తూ, కుజునిచే అష్టమ వీక్షణ ఉన్నందున ఆరోగ్య విషయాలపై కే.సి.ఆర్ దృష్టి ఉంచాల్సిన అవసరం వుంది.

ఆంధ్రప్రదేశ్ కు జన్మషని ప్రభావం 2009 సెప్టంబర్ నుంచి 2012 ఆగస్టు వరకు కొనసాగుతుంది. గనుక పైసమయంలో ప్రజలందరూ సంయమనం పాటిస్తూ, భగవతారాధనకు అధిక సమయం కేటాయించాలి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.