Friday, July 24, 2009

ఈ శతాబ్ది రెండవ శుక్రగ్రహణం 2012 లో.. 2012 వివరాలపై సీ..రియల్ పోస్టింగ్స్ - 1

2012 లో ఏమి జరగనుంది ? ..... ప్రతి ఒక్కరు ఏదో జరుగుతుంది అనే భయంతో వణికిపోతున్నారు. ప్రధాన కారణాలు ఏమిటి?.... మయాన్ కాలెండరు నిజమే చెబుతుందా?..... ప్రపంచం వినాశనమగుననే ప్రచారం నిజమేనా ? .... ఇంతటి ప్రచారానికి అడ్డుకట్ట వేయలేమా? ... ప్రసార మాధ్యమాలు, ఇంటర్నెట్ విశేషాలు ప్రపంచ ప్రజలకు నగ్న సత్యాలే తెలుపుతున్నాయా? లేక తప్పు సమాచారం అందిస్తున్నాయా?... ఈ విషయం లో వైజ్ఞానిక శాస్త్రం ఏముంటుంది?.... వేదాలు ఏమని ఘోషిస్తున్నాయి?.. జ్యోతిష్య శాస్త్రం తెలిపేది ఏమిటి? ... ఎన్నో.. ఎన్నెన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి... ప్రపంచ ప్రజలు మాత్రం 2012 ప్రపంచ అంతం అనే మాటతో అట్టుడికిపోతున్నారు..... దీనిలో భాగంగా 2012 లో గ్రహ స్థితులు ఎలా వున్నాయి?... గ్రహణాలు ఎలా వున్నాయి?.. ప్రభావాలు ఎలా వుంటాయి? ... చివరికి ఫలిత సారాంశం ఏమిటి? అని ఆసక్తికర నగ్నసత్యాలతో 2012 సీరియల్ పోస్టింగ్స్ నేటినుంచే సీరియల్ గా మీ ముందుకు రాబోతున్నాయి. ఈ నేపధ్యంలో మొదటి పోస్టింగ్ గా ఈ 21 వ శతాబ్దపు రెండవ శుక్ర గ్రహణ వివరాలను మీ ముందువుంచుతున్నాను.

శుక్ర గ్రహణ మేమిటని .... అనుకుంటున్నారా?... అవును. నిజమే గ్రహణాలు సూర్య చంద్రులకే కాదు. మిగిలిన గ్రహాలకు కూడా అరుదుగా వస్తుంటాయి. రాహువు లేక కేతువుతో కలిసిన ఓ సరళరేఖపైకి భూమి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు సాధారణంగా సూర్య గ్రహణం జరుగుతుంది. అలాగాకా సూర్యునికి భూమికి మధ్య చంద్రుడి బదులు శుక్రుడు వచ్చినచో.... శుక్ర గ్రహణం ఏర్పడి...శుక్ర గ్రహం ఒక గుండుసూది ఆకృతిలో సూర్యుని బింబముపై నల్లని చుక్కలా గోచరమవుతుంది.

ఈ శతాబ్దిలో తారణ నామ సంవత్సరంలో జైష్ట బహుళ షష్టి మంగళవారం ది 8 జూన్ 2004 దిన శుక్ర గ్రహణం ఏర్పడి శతాబ్ది తొలి శుక్ర గ్రహణం సూర్యబింబంపై కనువిందు చేసినది. ఈ వైనము మా తారణ సంవత్సర 6 వ పేజీలో పేర్కొన్నాము. ఇలాగే రాబోవు నందన నామ సంవత్సర జ్యేష్ట బహుళ విదియ బుధవారము పూర్వాషాడ నక్షత్ర దినము ది 6 జూన్ 2012 దిన, వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో కేతు గ్రస్తంగా శతాబ్ది రెండవ శుక్ర గ్రహణం సంభవించనుంది. గత తారణ సంవత్సరంలో ( 2004 - 05 ) వచ్చిన శుక్ర గ్రహణం ప్రారంభం నుంచి అంత్యం వరకు భారతదేశంలో గోచరమైనది.

ఈ 2012 లో వచ్చే శుక్ర గ్రహణం ప్రారంభ సమయం భారతదేశంలో రాత్రి భాగమైనందున గ్రహణ స్పర్శను భారతదేశంలో చూడలేకపోతున్నాము. గ్రహణ మధ్య కాలమునకు ఒక గంట ముందు నుంచి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో సూర్యోదయాలు అయినందున..... మనమందరమూ అతి స్పష్టంగా మసి పూసిన అద్దముతో కానీ, ఫిలింతో కానీ, సోలార్ ఫిల్టరు తో కానీ.... సూర్యబింబంపై కదిలి వెళ్ళే గుండుసూది మొన ఆకృతి గల శుక్ర గ్రహాన్ని నల్లని చాయలో దర్శించుకొనవచ్చును. సూర్య బింబము ఒకవైపు వెలుపలి అంచు నుంచి.... రెండవ వైపు వెలుపలి అంచు వరకు శుక్రుడు 400 నిమిషాల సేపు ప్రయాణం చేస్తాడు..... అంటే .... 6 గంటల 40 నిమిషాలు అన్నమాట. సూర్య బింబం ఓ వైపు లోపలి అంచు నుంచి... మరో వైపు లోపలి అంచు వరకు శుక్ర గ్రహణం కనపడే సమయము 364 నిమిషాలు.... అంటే.... 6 గంటల 4 నిమిషాలు అన్నమాట.

ఉత్తరార్ధ గోళములో ఈశాన్య స్పర్శతో ప్రారంభమైన గ్రహణ శుక్రుడు... వాయివ్య భాగంలో మోక్షమునొందును. ఆద్యంతం పుణ్యకాలము 6గంటల 4 నిమిషాలు అన్నమాట. భారత కాలమానం ప్రకారం 2012 జూన్ 6 సూర్యోదయానికి పూర్వము 3 గంట 21 నిమిషములకు శుక్రుడికి గ్రహణం స్పర్శించును. ఈ స్పర్శను భారతంలో రాత్రి సమయమందున వీక్షించలేము. శుక్ర గ్రహణ మధ్య కాలము 6 ఉదయం 6 గంటల 59 నిమిషాలు. శుక్ర గ్రహణ అంత్య కాలము ఉదయము 10 గంటల 01 నిమిషములు. భారతదేశంలో సూర్యోదయాలు జరిగనప్పటి నుంచే, అన్ని ప్రాంతాలలో నల్లని గుండుసూదిమొన లాంటి మచ్చతో శుక్ర గ్రహణం దర్శనమగును.... అంటే మచ్చతోనే సూర్యబింబం దర్శనమిస్తుంది.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో శుక్ర గ్రహణాన్ని వీక్షించవచ్చును. ఉత్తర అమెరికాలో వాయువ్య భాగం, పచ్చిమ ఫసిఫిక్, ఉత్తర ఆశియా, జపాన్, కొరియా, తూర్పు చైనా, తూర్పు మధ్య యూరప్, తూర్పు ఆఫ్రికా ప్రాతాలలో శుక్ర గ్రహణం కనపడుతుంది. పోర్చుగల్, దక్షిణ స్పెయిన్, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాలలో గ్రహణం కనబడదు.

ఈ 2012 లో కనపడే శుక్ర గ్రహణ సమయంలో వివాహాది శుభకార్యాలు నిషిద్ధం. శుక్ర గ్రహణం రావాలంటే.... ఆ సమయంలో శుక్ర మూడమి ఏర్పడి వుండాలి. శుక్ర మూడమి ఏర్పడకుండా శుక్ర గ్రహణం రానేరాదు. అందుచేత జూన్ 2012 మొదటి పది రోజులలో శుక్ర మూడమి వుంటుంది. 2012 లో సీ.... రియల్ పోస్టింగ్స్ లో ఈ వ్యాసాన్ని మొదటిగా భావించండి.. ఈ గ్రహణ ఫలితాలు ఎలా వుంటాయి అనే ఆసక్తికర అంశాలకై 2012 వరుస పోస్టింగ్స్ ని క్రమం తప్పకుండా చదవండి... విశేషాలకై ఎదురు చూస్తూ వుండండి.. ..


శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.