శ్రీ హేమలంబ మాఘ పూర్ణిమ 31 జనవరి 2018 బుధవారం కర్కాటకరాశిలో పుష్యమి,ఆశ్లేష నక్షత్రాలలో రాహుగ్రస్తంగా రక్తవర్ణంలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును.ఇది నీలిరంగులో (బ్లూ మూన్ గా) ఉండదు. కేవలం రక్త వర్ణం మాత్రమే.ఈ చంద్ర గ్రహణం వలన ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Friday, June 19, 2009

కురుక్షేత్ర సంగ్రామం ఎప్పుడు జరిగింది ?

విశ్వ విశ్వాంతరాళాల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి.
ఈ సృష్టి ఏమిటి? ఈ సృష్టి రహస్యమేమిటి?
ఈ విషయాలపై చర్చలు సాగించి పరిశోధనలు చేయాలంటే,
వేయి జన్మలు ఎత్తినా తెలుసుకోనలేమని అనిపిస్తుంది.
ఖగోళమండలం గురించి వైజ్ఞానిక శాస్త్రం ఎన్నో కొత్త పుంతలు తొక్కినప్పటికీ,
గత విషయాలపై దృష్టి సారించి తెల్సుకోనాలనే తపన కొంతమందికి ఉండవచ్చు.
ఆసక్తితో తెల్సుకోనాలనే జిజ్ఞాస కొంతమందికి వుంటే..
మరికొంత మందికి తెలుసుకొని ఏమి చేస్తాము? ఎందుకు ఉపయోగపడతాయి?
ఎవరికీ ఉపయోగపడతాయి? ... అని తర్కించవచ్చు.
అలా అనుకుంటే పొరపాటే.
మరి పరాశరుడు, వరాహమిహురుడు, ఆర్యభట్ట అలా అనుకొనివుంటే...
చరిత్ర ఇలా వుండేది కాదేమో!

పంచమ వేదంగా చెప్పుకోనేటువంటి మహాభారత గ్రంధంలో ఉదహరించబడిన కొన్ని విషయాలను ప్రామాణికములుగా తీసుకుంటే కురుక్షేత్ర సంగ్రామం ఎప్పుడు జరిగినది? ఏ తేదీన జరిగినది? అనే అతి క్లిష్టమైన వివరాలను శోధించవచ్చు. పుక్కిటి పురాణంగా కొందరు కొట్టివేయవచ్చు. కానీ గార్గేయ జ్యోతిష్య పరిశోధనా సంస్థ మాత్రం అనేక విషయాలపై దృష్టి సారించి పరిశోధనలు చేయాలని సంకల్పించింది .

ఇందులో భాగంగా వాస్తవ వైజ్ఞానిక పరిశోధనాత్మక శాస్త్రీయంగా వెలువడే మా "గ్రహభూమి" బ్లాగ్ లో కొన్ని వివరాలను మా అభిమాన పాఠకుల కొరకై ఇస్తున్నాము. ఇంకా ఇంకా శోధించి, సాధించి రాబోయే తరాల వారికైనా ఉపయోగపడాలనే చిన్న ప్రయత్నంతో ముందుకు వెడుతూ స్వల్ప వివరాలను మీ ముందుంచుతున్నాను.

మహాభారతంలో చెప్పబడిన అంశాలు ఏమిటంటే...

1.కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులు జరిగినది.
2.యుద్ధం ప్రారంభమైన తరువాత వచ్చిన అమావాస్య జ్యేష్ఠానక్షత్రం అయింది.
3. యుద్ధసేనలు యుద్ధభూమిలో అడుగిడిన నాడు పుష్యమి నక్షత్రం.
4.యుద్ధం చివరి ఉత్తరాయణ ప్రారంభపు రోజుకు మధ్య 50 రోజులు.
5.మాఘశుక్ల పంచమి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది.
6.యుద్ధం పదో రోజుకి, మాఘశుక్ల పంచమికిమధ్య యాభై ఎనిమిది రోజులు.
7.భీష్మనిర్యాణం మాఘ శుక్ల ఏకాదశి నాడు. ఈ రోజుకు యుద్ధం ముగిసిన రోజుకి యాభై ఆరు రోజులు. 8.రాయబారానికి కృష్ణుడు కార్తీక మాసం రేవతి నక్షత్రం నాడు హస్తినాపురానికి వెళ్లారు.
9.ఉత్తరాయణ ప్రారంభపు రోజు నుంచి వెనుకకు వస్తే 51 వ రోజు రాత్రితో 18 రోజుల సంగ్రామం ముగిసింది.
10. పాండవుల వనవాస ప్రారంభంలో ఓ సూర్యగ్రహణ మేర్పడినదని, ద్వారకలో కనబడినదని సభాపర్వంలో విదురుడు చెబుతాడు.
11.భీష్మపర్వంలో (3.29) ఓ సూర్యగ్రహణం పక్షం వ్యవధి లోపల మరో చంద్రగ్రహణం యేర్పడినదని, ఇది కురుక్షేత్రలో కనపడినదని చెప్పబడినది.
12.సభాపర్వంలోని మొదటి సూర్యగ్రహణానికి, భీష్మ పర్వంలోని రెండవ సూర్యగ్రహణానికి మధ్య వ్యవధి 15 సంవత్సరాలని చెప్పబడినది.
13.మౌసలపర్వం ( 2.19-2.20 ) లో మరో సూర్యగ్రహణం కురుక్షేత్రలో దర్శనమిచ్చినట్లు వున్నది. 14.భీష్మపర్వంలోని సూర్యగ్రహణానికి మౌసలపర్వంలోని సూర్యగ్రహణానికి మధ్య 35 సంవత్సరాల వ్యవధి వున్నట్లు చెప్పబడినది. మౌసల పర్వంలోని గ్రహణ సమయంలో గురుగ్రహము మీనరాశిలో స్వక్షేత్రంలో, స్వనక్షత్రమైన పూర్వాభాద్ర నుంచి ఉత్తరాభాద్రకు మారడం జరిగినది.
15.అనుకూలించనటు వంటి గ్రహస్థితులు కురుక్షేత్ర యుద్ధ ప్రారంభమైన కార్తీక పూర్ణిమకు, దానికి ముందున్న సూర్యగ్రహణానికి మధ్యన జరిగినట్లుగా భీష్మపర్వం ( 3.14-3.19 )లో చెప్పబడినది.
16.యుద్ధ ప్రారంభమైన 8 వ రోజున శని గ్రహం రోహిణి నక్షత్రంలో వుండి, కుజ గ్రహం అనూరాధ నుంచి జ్యేష్ఠా నక్షత్రంలోకి ప్రవేశించినట్లు వుంది.
17.యుద్ధం ముగిసిన 4రోజులకు లేదా కార్తీక పూర్ణిమ నుంచి 22 రోజులకు శనిగ్రహం రోహిణి నక్షత్రంలోనే వున్నది. 18. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు 13 రోజుల వ్యవధిలో సూర్య చంద్ర గ్రహణాలు జరిగినట్లు భీష్మ పర్వం చెపుతుంది.

పై ప్రకారంగా ఖగోళ సంబంధిత పంచాంగ వివరాలు మహాభారతంలో పొందుపరచబడినవి. పై వివరాలను ఆధారంగా చేసుకొని నేటి ఆధునిక వైజ్ఞానిక విజ్ఞాన సంపదతో ఆలోచిస్తే 3300 బి.సి. - 700 బి.సి. వరకు ఒక మాసంలో జంటగా వచ్చిన గ్రహణాలు 672 వున్నవి. ఇందులో 2 గ్రహణాల మధ్య 13 రోజులు వచ్చినవి కేవలం 6 మాత్రమే వున్నవి. భీష్మపర్వంలో చెప్పిన విధంగా కురుక్షేత్ర సంగ్రామానికి ముందు 13 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు వచ్చినట్లు వుంది. కానీ ప్రస్పుటంగా ఇంత కాలం అని ఉదహరించలేదు.

పైన తెల్పిన వివరాలను బట్టి యుద్ధం కార్తీకమాస పూర్ణిమకు ప్రారంభమైనదంటే, రవి వృశ్చికరాశిలో వుంటాడు. 16 వ పాయింట్ ప్రకారం శని వృషభరాశిలోను, కుజుడు వృశ్చికరాశిలోను వుంటారు. మౌసలపర్వంలో చెప్పబడిన గ్రహణ సమయంలో గురుగ్రహము మీన రాశిలో వున్నాడు ఈ గ్రహణానికి 35 సంవత్సరాల ముందు ఏర్పడిన గ్రహణంలో కురుక్షేత్ర సంగ్రామం కీలకమైనది. ఆ సమయానికి గురుగ్రహం ఎక్కడ వున్నాడో వెనక్కి వెళ్ళాలి.

కార్తీక పూర్ణిమ నాడు యుద్ధ ప్రారంభమైనది. కనుక రవి వృశ్చికంలో వుంటే చంద్రుడు వృషభంలో వుంటాడు. 2 వ పాయింట్ ప్రకారం అమావాస్య నాటి నక్షత్రం జ్యేష్ఠ అని తెల్పబడినది. పంచాంగ గణిత రీత్యా ఆ రోజు కార్తీక అమావాస్య అవుతుంది. కనుక యుద్ధం కార్తీకపూర్ణిమ నాడు ప్రారంభమైనదని చెప్పాలి. మహాభారతంలో గ్రహణసమయంలో గురు శుక్ర రవి కుజ శనులు ఏఏ నక్షత్రాలలో సంచారం చేస్తున్నారో ఇవ్వటం జరిగినది. యుద్ధసేనలు యుద్ధభూమిలో మొహరించినది పుష్యమీనక్షత్రం ( 3 వ పాయింట్ ) అయితే అది ఆశ్వీయుజ బహుళ సప్తమి అయితేనే పుష్యమీ నక్షత్రం అవుతుంది.

అనగా యుద్ధానికి 24 రోజుల ముందుగా యుద్ధసేనలు మొహరించాయన్నమాట. కృష్ణుడు రాయబారానికి కార్తీకమాస రేవతి నక్షత్రంలో వెళ్ళాడంటే, ఆ రోజు యుద్ధ ప్రారంభమైన కార్తీక పూర్ణిమకు ముందు 4 రోజులే అవుతుంది. దీనిని బట్టి ఆనాడు ఏర్పడిన గ్రహస్థితిగతులను బేరీజు వేసుకొని మహాభారత యుద్ధం సరిగ్గా ఏనాడు ప్రారంభమైనదనే ఆసక్తికరమైన విశేషాలను ఇంకా ఇంకా పరిశోధించవలసిన వుందని తెలియజేస్తున్నాను ...... మీ శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.