7 ఆగష్టు 2017 శ్రావణపూర్ణిమ సోమవారం నాడు పాక్షిక చంద్రగ్రహణ సందర్భంగా నూతన యజ్ఞోపవీత ధారణ మాత్రం ఉండదు. కానీ యధావిధిగా రక్షా బంధన కార్యక్రమములు నిరభ్యంతరంగా ఆచరించవచ్చును. శాస్త్రీయంగా పంచాంగగణిత రీత్యా రక్షాబంధనమునకు శుభసమయము మధ్యాహ్నము 11గంటల 4నిముషాల నుంచి సాయంత్రం 4గంటల 1నిముషం వరకు ఉన్నది. అయితే ఉదయకాలంలో రక్షాబంధనాలు చేయువారలకు అది నిషిద్ధ సమయమేమి కాదు. శాస్త్రీయతను కోరుకునేవారు పై సమయాన్ని స్వీకరించండి. - శ్రీనివాస గార్గేయ

Monday, June 15, 2009

నేటినుంచే మకర మాలికా యోగం

ఏమిటా యోగం అనుకుంటున్నారా ! అవును మరి... మకర రాశి నుంచి ఎనిమిది రాశులలో వరుసగా తొమ్మిది గ్రహాల సంచారం ఉండటంతో మకరం నుంచి గ్రహ మాలికా యోగం ప్రారంభం అవుతున్నది. మకరరాశిలో రాహువు, సింహరాశిలో శని షష్టాష్టకములుగా వుంటున్న సమయంలో, మిగిలిన కుంభ, మీన, మేష, వృషభ, మిధున, కర్కాటక రాశులలో వరుసగా ఏడు గ్రహాల గ్రహసంచారం వుండి, 40 రోజులలోపలే ఈ యోగ అష్టమాధిపతికి సంపూర్ణంగా గ్రహణం వాటిల్లటం దాదాపు నాలుగు వందల సంవత్సరాలకు పైబడి మాత్రమే వస్తున్న గ్రహస్థితి. ఇలాంటి మకర మాలికా యోగం 2009 జూన్ 15 అర్దరాత్రి దాటిన పిదప 01.57 నిమిషాలకు ప్రారంభమై, 18 వ తేదీ ఉదయం 09.15 నిమిషములకు మకర మాలికా యోగం ముగుస్తుంది.

గ్రహమాలికా యోగాలు తరచుగా వస్తుంటాయి. కానీ మకర సింహ రాశుల మధ్యను, రాహుశనుల మధ్యను రావటము అనేది చాలా అరుదు. అష్టమాధిపతికి గ్రహణం రావాలంటే, ఆ యోగం ధనుస్సురాశి నుంచి కానీ లేక మకరరాశి నుంచి కానీ వుండాలి. ఈ మాలికా యోగం కన్యారాశి నుంచి ప్రారంభమైనది అనుకుంటే, ఆది సోమ వారాల అధిపతులైన సూర్య చంద్రుల సింహ కర్కాటక రాశుల ఆచ్చాదన ఉండదు. మాలికా యోగం తులారాశి నుంచి ప్రారంభమైతే సూర్య, చంద్ర, బుధుల రాశులలో యోగ సంబంధిత గ్రహ ఆచ్చాదన ఉండదు. అలాగే యోగం మేషం నుంచి ప్రారంభమైతే గురు శని రాశులలో గ్రహ ఆచ్చాదన వుండదు. కానీ ఈ మకర మాలికా యోగములో ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని వారాల అధిపతుల రాశులలో గ్రహ ఆచ్చాదన ఉండటమే విశేషం. మకర రాశికి అధిపతి శని అష్టమరాశైన సింహంలో ఉండటము, సింహ రాశ్యాధిపతి రవికి 38రోజులలోనే సంపూర్ణ గ్రహణం ఏర్పడటం, ఆ గ్రహణానికి పదిహేను రోజుల ముందుగా ఒక ప్రచ్ఛాయ చంద్ర గ్రహణం, పదిహేను రోజుల తరువాత ఒక ప్రచ్ఛాయ చంద్ర గ్రహణం సంభవిస్తున్నాయి. ఇలాంటి గ్రహ స్థితులు 400సంవత్సరాల తదుపరి ఇప్పుడు వస్తున్నాయి.

ఈ మాలికా యోగం యాబై అయిదు గంటల పద్దెనిమిది నిమిషాలు ఉన్నప్పటికీ, దాని ప్రభావం మాత్రం రాహు శనుల షష్టాష్టకం ముగిసే వరకు వుంటుంది. అంటే 09.09.2009 వరకు ఈ మకర మాలికా యోగ అరిష్ట ప్రభావం వుంటుంది. దీనివల్లన కలిగే దుష్ఫలితాలు పన్నెండు రాశులపై లేకుండా వుండాలంటే మనం ఏం చేయాలి?

పరిహార పద్ధతులకై తదుపరి పోస్టింగ్ లో తెలుసుకుందాం.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.