Saturday, June 27, 2009

ముస్లిం రజ్జబ్ నెలరోజునే భాగ్యనగర బోనాలు ప్రారంభం

ఆషాడం వచ్చిందంటే చాలు...... తెలంగాణా ప్రాంతంలో ప్రతి ఇంతా బోనాల హడావిడి కనిపిస్తుంది. తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రతి ఆషాడంలోను అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ బోనాల పండుగ ఉత్సవాలు ఈనాటివి కావు. ఆషాఢమాసం మొదటి గురువారం గోల్కొండ కోటలో ప్రారంభమయ్యే ఈ బోనాల పండుగ ఉత్సవాలు .......చివరి ఆదివారం వరకు.... నిత్యం ప్రత్యేకమైన పూజలతో జరుగుతాయి.
ప్రతి గురు, ఆదివారాలలో భారీ సంఖ్యలో భోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీ. మూడో ఆదివారం జూలై 12 న సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయం లో అమ్మవారికి లష్కర్ బోనాలు సమర్పిస్తారు. తరువాత వచ్చే.. చివరి ఆదివారం నాడు పాతనగరం లోని లాల్ దర్వాజా మాతా సింహవాహిని ఆలయంలో సంబరాలు నిర్వహిస్తారు..... ఇదే రోజున జంట నగరాలలోని 116 ఆలయాలలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తారు.

బోనాలు అంటే ఏమిటి?

భక్తులంతా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ప్రీతిపాత్రమైన బోనాలను సామూహికంగా సమర్పించే ఈ అపురూపమైన దృశ్యాలు చూడ చక్కగా వుంటాయి. పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ, ఆరే మైసమ్మ, కట్టమైసమ్మ, నల్లపోచమ్మ, మారెమ్మ, ఎల్లమ్మ తదితర పేర్లతో కొలువైవున్న ఈ ఎనిమిది మంది గ్రామ దేవతలకు వారి సోదరుడైన పోతురాజు తోడుగా రాగా లక్షలాది భక్తులు ప్రతి ఆషాఢ మాసం లోనూ ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకొని చల్లగా చూడమని మొక్కుతారు. ఈ ఎనిమిది మంది గ్రామ దేవతలకు సమర్పించే మొక్కుబడి లేదా నియమ నిష్ఠలతో తయారు చేసే నైవేద్యమే బోనాలు. ఆడపడుచులంతా కలసి దీనిని ఘటాలలో వుంచి ఊరేగింపుగా వెళ్లి గుడిలో అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పాత్రలను ఘటాలు అంటారు.

ఇక అసలు ముఖ్యమైనది భవిష్యవాణి...

బోనాల పండుగలోని ముఖ్యమైన సంప్రదాయం రంగం చెప్పటం. రంగం చెప్పటమంటే భవిష్యవాణిని వినిపించటమే. రాబోయే కాలంలో వర్షాలు ఎలా కురుస్తాయి? పంటలు ఎలా పండుతాయి? నగరంలో ప్రజల స్థితిగతులు ఎలా వుండబోతున్నాయి ... మొదలైన వివరాలను చెప్పడమన్నమాట. ఇలా చెప్పేది ఒక మహిళ. ఒక కుటుంబానికి చెందినా అవివాహిత మాత్రమే.... తరతరాలుగా ఇలా రంగం చెప్పటం సంప్రదాయంగా వస్తోంది.. సికింద్రాబాద్ లోని చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కిక్కిరిసిన భక్తజన సందోహం నడుమ అంగరంగ వైభోగంగా జరిగే ఈ కార్యక్రమాన్ని చూడడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. గర్భగుడి లోని అమ్మవారి వైపు తదేకంగా చూస్తూ అమ్మ అంశను... తనలో ఇముడ్చుకుందా అన్నట్లుగా...... పచ్చి కుండపై పాదం మోపి భక్తి పారవశ్యంతో ఊగిపోతూ.... భవిష్యత్తును..... వివరిస్తుందా మహిళ.

సికింద్రాబాద్ మహంకాళి జాతరకు 11 వ రోజునే సంపూర్ణ సూర్యగ్రహణం జరగనుంది. ఈ గ్రహణానికి 3 రోజుల ముందుగా వచ్చే ఆదివారం అనగా 19 జూలై తో బోనాల పండుగ ముగియనుంది.... శ్రీ విరోధి నామ సంవత్సరంలో బోనాల పండుగ జూన్ 25 గురువారం పుష్యమి నక్షత్రం ( శని స్వనక్షత్రం ) రోజున ప్రారంభమయ్యాయి. అదే రోజున ముస్లిం సోదరుల రజ్జబ్ నెల కూడా ప్రారంభమైంది. ఇదే పుష్యమిలో ( శని స్వనక్షత్రం ) జూలై 11 న సంపూర్ణ సూర్యగ్రహణం రానున్నది. సికింద్రాబాద్ మహంకాళి జాతర జూలై 12 ఆదివారం శతభిషా నక్షత్రంలో ( రాహువు స్వనక్షత్రం ) జరుగును. రాహుశనుల షష్టాష్టకం లో వచ్చే మకర మాలికా యోగ ప్రభావం భాగ్యనగరం మీద ప్రభావం చూపుతుందా?.....సికింద్రాబాద్ మహంకాళి జాతర రోజున భవిష్యవాణి వినిపించే మహిళ ఏమి చెబుతుందో?...మూడు గ్రహణాలు ముప్పు అంటూ... మొదలుపెడుతుండా?... లేక..... రాజశేఖరుని కొలువుని కీర్తిస్తుందా?

ఏది ఏమైనా మూడు గ్రహణాలు ముప్పు మాత్రం లేదు... భాగ్యనగరంలో హిందూ ముస్లిం భాయ్..భాయ్.. దోస్తికి భంగం వాటిల్లకూడదని మనసారా కోరుకుందాం............... శ్రీనివాస గార్గేయ

Friday, June 26, 2009

పునర్జన్మలపై పరిశోధనలు ఏమంటున్నాయి?



ఇది ఈ రోజు సాక్షి దినపత్రికలోని వార్తా కధనం. హేతువాద సంఘాలు ఏమంటారో వేచి చూద్దాం.

Thursday, June 25, 2009

వరుణ యాగం ముహూర్తం సరైనదేనా ?

జూన్ మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించి ఊరించిన ఋతుపవనాలు చివరకు నిరాశ మిగిల్చాయి. ఈ యేడాది దేశం మొత్తం మీద నైరుతి ఋతుపవనాల ప్రభావము సాధారణము కంటే తక్కువే వుంటుందని కేంద్ర భూశాస్త్ర విభాగ మంత్రి పృధ్వీ రాజ్ ఢిల్లీలో చెప్పారు.


ఆంధ్రప్రదేశ్ లో జూన్ లో కనీస వర్షపాతమైనా నమోదు కావాలి. ప్రస్తుతం నేల తదిసేవరకు కూడా పడటం లేదు. పూర్తిగా రాష్ట్రం అంతా వర్షాభావం అలుముకుంది. భారత దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఇలానేవుంది. ఇప్పటికే మాంద్యంతో కృంగి పోయిన ఆర్ధికవ్యవస్థకు వర్షాభావ హెచ్చరిక శరాఘాతం కానుంది.

పుష్కలంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా వుండటానికి వరుణయాగాలు, ప్రార్ధనలు చేయాలని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సూచించారు. ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు జరపాలని ప్రభుత్వం వారు.... అన్ని మతాల పెద్దలకు విజ్ఞప్తి చేసారు. రాష్ట్రవ్యాప్తంగా 199 పెద్ద, 1819 చిన్న ఆలయాలలో కలిసి మొత్తం 1938 దేవాలయాల్లో వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని దేవదాయ, ధర్మదాయ ( దేవాదాయ, ధర్మాదాయ కాదు ) శాఖ మంత్రి గాదె వెంకట రెడ్డి తెలిపారు.

ఈ నేపధ్యం లో తిరుమలలో వరుణ జపాలు, ప్రత్యక పూజలు నిర్వహించనున్నట్లు టి.టి.డి. చైర్మన్ ఆదికేశవులు నాయుడు తెలిపారు. గత యేడాది దాదాపు 40 లక్షలు ఖర్చుపెట్టి వరుణ యాగం చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 108 హోమగుండాలతో జూలై 2 నుంచి 4 వరకు వరుణయాగం చేయనున్నారు టి.టి.డి. వారు.

అయితే మేము తెలియచేసే వివరాలు ఏమిటంటే గతంలోనూ, ఎన్నోసార్లు వరుణయాగాలు చేసి విజయం సాధించని దాఖలాలు వున్నవి. దీనివలన యాగాల కొరకు సొమ్మును వృధా చేస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నవి.వరుణయాగం చేయాలనుకున్నప్పుడు కేవలం సేవాభావంతో, భక్తి తత్పరతతో, విశ్వాసంతో సరైన నక్షత్ర బలంతో పునాది వేస్తే, ఆ భక్తిచే భగవంతునితో బంధం ఏర్పడుతుంది. గనుక ప్రాధమిక విషయాలు గుర్తించకుండా, విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టి.... ఫలితాలు రాకపోతే, ఇతరులచే నిందింపబడేదానికన్నా........ ముందుగా జ్యోతిష్య పండితులలో సిద్ధహస్తులైన వారితోనే ప్రభుత్వ అధికారులు చర్చలు జరపాలి........ఏమి చర్చలు ?..... దేని కోసం?

నాచే రచింపబడిన శ్రీ విరోధి సంవత్సర " గ్రహభుమి " పంచాంగం ( పేజీ నెంబర్ 31 ).... " కాలచక్రం " పంచాంగం ( పేజీ నెంబర్ 40 ) లలో ఆఢక మేఘ వాయి నిర్ణయాలు అనే శీర్షికలో జూన్ ఆఖరి నాటి పరిస్థితి తెలియజేస్తూ "త్రాగునీటికి తీవ్ర ఎద్దడి యేర్పడును. ఋతుపవనాలకై వేచి వుందురు." జూలై 4 వ తేది తరువాత వాతావరణము ఆంద్రప్రదేశ్ లో కొన్నిచోట్ల చల్లబడును. బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడినప్పటికీ ఫలితం తక్కువ" అని వ్రాసాను.

నా పంచాంగం లో జూలై 4 తరువాత వాతావరణం చల్లబడును అని వుంది గనుక, 4 వ తేదీతో వరుణయాగం ముగిస్తే.... విజయం పొందామని ఊహించవచ్చు.......... కాని ఫలితం తక్కువేనని నేనంటున్నాను. ఎందుకంటే.... వరుణయాగం చేసే సమయంలో ముఖ్యంగా చంద్రుడు జల సంబంధ రాశులలో వుంది తీరాలి అప్పుడే యాగం విజయవంతమవుతుంది. అనగా చంద్రుడు కర్కాటక, మీన , మకర, రాశులలో వుండి ఇతర గ్రహ సంచారం అనుకూలంగా వుండాలి. అలాంటప్పుడు జూలై 8,9,10 తేదీలలో వరుణయాగ సంబంధిత వేదమంత్రాలు, వరుణప్రియ, అమృతవర్షిణి రాగాలతో సంగీత ఝరి ఏర్పాటు చేస్తే తప్పక వరుణ దేవుడు కరుణించి కటాక్షిస్తాడు.

కాబట్టి టి.టి.డి వారు జూలై 2,3,4 తేదీలు కాకుండా జూలై 8,9,10 తేదీలలో వరుణయాగం ఏర్పాటు చేస్తే, చంద్రుడు మకర రాశిలో వున్నందున పూర్ణ ఫలితం లభిస్తుంది. చెప్పేటంతవరకే నా కృషి..... వినని వారిని భగవంతుడు కూడా ఏమీ చేయలేడు.................. శ్రీనివాస గార్గేయ

Wednesday, June 24, 2009

వరుసగా 3 గ్రహణాలు రావటం మహా ప్రళయానికి కారణమా?

2 చంద్ర గ్రహణముల మధ్య ఓ సూర్యగ్రహణము లేదా 2 సూర్య గ్రహణముల మధ్య ఓ చంద్ర గ్రహణము వరుసగా రావటం అరుదైన విషయం కాదు. తరచుగా వస్తుంటాయి ఈ విషయం చాలా మందికి తెలియకపోవటంచే........ నిన్న - ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు టి.వి. ఛానళ్ళు ఊకదంపుడుగా ప్రసారం చేయటానికి వెనుక వున్న విషయం ఏమిటంటే... ఓ అవగాహన లేని వ్యక్తి ప్రపంచ ప్రళయాన్ని గురించి పుస్తకం రాయటం.

2 చంద్ర గ్రహణముల మధ్య ఓ సూర్యగ్రహణము లేదా 2 సూర్య గ్రహణముల మధ్య ఓ చంద్ర గ్రహణము వరుసగా రావటం అరుదైన విషయం కాదు. తరచుగా వస్తుంటాయి ఈ విషయం చాలా మందికి తెలియకపోవటంచే........ నిన్న - ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు టి.వి. ఛానళ్ళు ఊకదంపుడుగా ప్రసారం చేయటానికి వెనుక వున్న విషయం ఏమిటంటే... ఓ అవగాహన లేని వ్యక్తి ప్రపంచ ప్రళయాన్ని గురించి పుస్తకం రాయటం.

అసలు ఈ ప్రళయం నిజమేనా?....అనే విషయంపై ఒక జ్యోతిష్య పండితుడిగా మీకు ఎన్నో విషయాలు చెప్పాల్సి వుంది. వరుసగా మూడు గ్రహణాలు రావటం అరుదు కానేకాదు. తరచుగా వస్తుంటాయి. రెండు సూర్య గ్రహణాల మధ్య ఓ చంద్ర గ్రహణము, రెండు చంద్ర గ్రహణాల మధ్య ఓ సూర్య గ్రహణము లాంటివి ఒక శతాబ్దానికి దాదాపు 28 వరకు వస్తుంటాయి. గత 60 సంవత్సరాల నుంచి చూసినచో ఇప్పటి వరకు 15 సార్లు వరుస గ్రహణాలు వచ్చాయి.

1951 ఆగష్టు 17 చంద్ర......... సెప్టెంబర్ 01 సూర్య........సెప్టెంబర్ 15 చంద్ర గ్రహణములు
1953 జూలై 11 సూర్య...........జూలై 26 చంద్ర...............ఆగష్టు 09 సూర్య గ్రహణములు
1958 ఏప్రిల్ 04 చంద్ర...........ఏప్రిల్ 19 సూర్య............ మే 03చంద్ర గ్రహణములు
1962జూలై 17 చంద్ర............ జూలై 31 సూర్య...............ఆగష్టు 15 చంద్ర గ్రహణములు
1964 జూన్ 10 సూర్య...........జూన్ 25 చంద్ర.................జూలై 09 సూర్య గ్రహణములు
1969 ఆగష్టు 27 చంద్ర..........సెప్టెంబర్ 11 సూర్య.........సెప్టెంబర్ 25 చంద్ర గ్రహణములు
1971జూలై 22 సూర్య........... ఆగష్టు 06 చంద్ర.............ఆగష్టు 21 సూర్య గ్రహణములు
1973 జూన్ 15 చంద్ర.............జూన్ 30 సూర్య..............జూలై 15 చంద్ర గ్రహణములు
1980జూలై 27 చంద్ర.............ఆగష్టు10సూర్య.............ఆగష్టు 26 చంద్ర గ్రహణములు

ఈ ప్రకారంగా వరుస గ్రహణాలు ఇంకా ఇంకా వచ్చాయి. పై వాటిలో సంపూర్ణ గ్రహణాలు, పాక్షిక గ్రహణాలు, ప్రచ్చాయ గ్రహణాలు కలిసి వున్నాయి. 36 సంవత్సరాల క్రితం 1973 లో జూన్ 30వ తేదీ సంపూర్ణ సూర్య గ్రహణం వచ్చి ముందు వెనకాలలో చంద్ర గ్రహణాలు వచ్చినట్టు ఈ 2009 లో కూడా జూలై 22 న సంపూర్ణ సూర్య గ్రహణము ముందు వెనకాలలో చంద్ర గ్రహణాలు రాబోతున్నాయి.

అవగాహనలేని పండితుడు చెప్పిన విధంగా వరుస గ్రహణాలు వస్తే ప్రపంచ యుద్ధం వస్తుంది కదా! మరి ఒక శతాబ్దానికి 28 సార్లు వరుస గ్రహణాలు వస్తే, అన్నిసార్లు ప్రపంచ యుద్ధాలు వచ్చాయా? ఏ మాత్రం అవగాహన లేని వారు ఏదో చెప్పినంత మాత్రాన....దానిని మీడియా వారు పెద్దది చేసి చూపిస్తే..... మనో దౌర్భల్యం కల వారు చూస్తే వారి గతి ఏమవుతుంది. విజ్ఞులు ఆలోచించాలి. అవగాహన లేని వారి వలన జ్యోతిశాశ్ర్తమే అవహేలనకు గురై, హేతువాదుల దృష్టి లో మాయని మచ్చతో బ్రష్టుపట్టి పోతున్నది శాస్త్రం.

ఇంతకీ అసలు విషయానికి వద్దాం...... సంపూర్ణ సూర్య గ్రహణం జరుగుతున్నదా? నిజమే జరుగుతుంది. వరుసగా మూడు గ్రహణాలు వస్తున్నాయా? వస్తున్నాయి. అయితే ఏమిటి? ఎవరికి సమస్య? అనే కోణం లోనే ఆలోచించాలి. వరుస మూడు గ్రహణాలు రావటం వలన ప్రమాదమేమి లేదు. ముప్పు అంతకంటే లేదు కేవలం మకర మాలికా యోగ దేశారిష్టం తో సంపూర్ణ సూర్య గ్రహణం కలసి రావటం 400 సంవత్సరాల తరువాత వస్తున్నది. దీని వలన ప్రపంచానికి ఎలాంటి ముప్పు లేదు........ ఇది కేవలం దేశారిష్టమే. దేశం నిత్యం అరిష్టాలతోనే సాగుతున్నది. ఒకవైపు ఉగ్రవాద మరోవైపు ఏర్పాటువాదం. వీరి దుష్కార్యాలు మరికొంత పెరగటానికి అవకాశం ప్రస్తుతం వుంటుంది. కొన్ని చోట్ల భూకంపాలు రాగల సూచన వుంది అంతేతప్ప మహా ప్రళయాలు కాదు . లుంబినీ పార్క్, గోకుల్ చాట్ లాంటి చోట్ల జరిగిన బాంబ్ దాడులలో అమాయకులు బలైపోతున్నారు. ఇలాంటి దుష్కార్యాలు అంతం కావాలి. దానికి ప్రభుత్వాలు నడుం కట్టాలి. వ్యక్తుల వలన తీరే పని కాదు.

కనుక ఇలాంటి దేశారిష్ట యోగాల వలన మనకు మనం పరిహారాల ద్వారా రక్షించుకొనాలి. గనుక పాఠకులకు తెలియచేయినదేమనగా వరుసగా ముప్పై రోజులలో వచ్చే మూడు గ్రహణాల వలన ప్రపంచం తలక్రిందులు కాదు. యుద్ధాలు రానే రావు. ప్రళయాలు అంతకంటే రావు. మనో దౌర్భల్యం తో ఆలోచించి, ఆరోగ్యం పాడుచేసుకొని భాదపడేదాని కన్నా సత్యాన్ని గ్రహించి భగవంతుడిని ధ్యానిస్తే తప్పక శుభకర ఫలితాలు కలుగుతాయి. నేను చెప్పే ఈ నిజాన్ని నమ్మి మీ స్నేహితులకి తెలియచేప్పండి. అవగాహన లేని ఆకతాయిలు చెప్పే అసత్యాలను త్రిప్పి కొట్టండి............. శ్రీనివాస గార్గేయ

Tuesday, June 23, 2009

నేడే ఆషాఢం ప్రారంభం - పండుగలు ముఖ్యదినాలు

  • జూన్ 24 ఆషాఢమాస చంద్రోదయము, పూరి జగన్నాధుని రధయాత్ర
  • 25 పితృతిధి ( శ్రాద్ధతిధి ) ద్వయము తదియ, చవితి
  • 26 పితృతిధి పంచమి
  • 27 స్కంద పంచమి, కుమార షష్టి, పితృతిధి షష్టి
  • 28 వివస్వతసప్తమి
  • జూలై 1 దధివ్రతారంభం
  • 2 హరిశయనేకాదశి ( తొలి )
  • 3 పితృతిధి ద్వాదశి
  • 4 స్వామి వివేకానంద వర్ధంతి, పితృతిధి త్రయోదశి
  • 5 పితృతిధి చతుర్దశి
  • 6 పితృతిధి పూర్ణిమ
  • 7 మహాషాడి, వ్యాస పూర్ణిమ, కోకిలావ్రతం, శివశయనోత్సవం, ప్రచ్చాయలో చంద్రగ్రహణం ( చంద్రుడు కాంతి విహీనమవును, నల్లగా కాడు )
  • 11 సంకష్టహరచతుర్ది
  • 12 సికింద్రాబాద్ లో మహంకాళి జాతర
  • 16 కర్కాటక సంక్రమణం మ. 03.11 నిమిషాలు ( కర్కాటక సంక్రాంతి )
  • 18 కామికా ఏకాదశి
  • 20 మాస శివరాత్రి, పితృతిధి ద్వయం ఏకాదశి, ద్వాదశి
  • 21 పితృతిధి అమావాస్య
  • 22 సంపూర్ణ సూర్యగ్రహణం, సింహాయనం, ఆషాఢ అమావాస్య

Monday, June 22, 2009

ముక్కంటీశ్వరుడు ముందే జాగ్రత్త పడుతున్నాడా?


శివుడంతటివాడే పోయి చెట్టు తొర్రలో కూర్చున్నాడట....... మనం తరచుగా వింటూ వుంటాము ఈ వాక్యాన్ని. తిరుమల మూడునామాల వెంకన్న స్వామిది శ్రవణా నక్షత్రం...మకర రాశి. పాపం.... ఆ స్వామి అష్టమశని వేదనతో 2007 జూలై నుంచి బాధపడుతున్నాడు.అందుకే ఏదో ఒక కారణంతో నిత్యం తిరుమలేశుడు మీడియాలోకి ఎక్కుతున్నాడు. ఒకసారి గొలుసు తెగిందని.....వస్త్రం అంటుకున్నదని, జ్యోతులు కొండెక్కాయని, ఊరేగింపులో వాహనానికి తల లేదని, ఎన్నో....ఎన్నెన్నో అపచారాలతోను.....అర్చకుల కుమ్ములాటతోను....వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల అష్టకష్టాలతోనూ.... అబ్బబ్బ... స్వామిని అష్టమశని ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఈ స్వామి 2009 సెప్టెంబర్ 9 వ తేదీతో అష్టమశని బారి నుంచి విముక్తి కానున్నాడు. అంతవరకు వెంకన్న స్వామికి తిప్పలు తప్పవు.

కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఈ సంగతిని అర్ధం చేసుకోనరు. అక్కడ యాగాలు.... ఇక్కడ యాగాలు అంటుంటారు తప్ప. స్వామివారికి శని వేదన నుంచి రక్షించే యాగానికి సన్నద్ధం కారు. నా లాంటివాడు నా పంచాంగం "కాలచక్రం", "గ్రహభుమి" లో ముందుగా చెప్పినా, ఆలకించిన వారూ లేరు...

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..... ఆ ప్రక్కనే వున్న శ్రీకాళహస్తి ముక్కంటిస్వామీ మీడియా గోలలో ఎక్కడ ఇరుక్కుంటానని అనుకున్నాడేమో! ఎందుకో తెలుసా? వెంకన్న స్వామీ తరువాత తన వంతు అవుతుంది....... ఎందుకని ?........ తనది ఆర్ద్ర నక్షత్రం... మిధున రాశి... 9 సెప్టెంబర్ 2009 నుంచి తనకు అర్ధాష్టమ శని పట్టుకుంటాడు. ఇక నిత్యం మీడియాలో నానాలి. పైగా ఆంధ్రరాష్టంలో పాతికపైగా ఛానళ్ళు వున్నాయి. కెమెరాలు, గొట్టాలు పట్టుకొని గుడికి వస్తారు....నిమిషాల మీద లైవ్ ప్రోగ్రాములు ఏర్పాటు చేస్తారు.....అమ్మో..... ఇంత దారుణం నుంచి గాలిస్వామి బయట పడాలనుకున్నాడెమో!...... ఇక తనకు తిప్పలు తప్పవు...... ఈ తిప్పలు తప్పుకోవాలంటే ..... ఓ రక్షక కవచం తనకు కావాలనుకున్నాడు.

అసలే వాయులింగేశ్వరుడు...... ఇంకేముంది!.. గాలిలో ఎస్.ఎం.ఎస్ పంపాడు. ఎవరికీ? కర్ణాటకలోని గాలి కరుణాకర రెడ్డి కి ....కరుణాకర! నీ సోదరుడు మూడు నామాల స్వామికి కిరీటం చేయించాడు. మరి ఈ మూడు నేత్రాల స్వామికి తక్షణం నవగ్రహ కవచం చేయించు. జ్యోతిష్య పండితులు అర్ధాష్టమ శని వస్తుందని అంటున్నారు.....తక్షణమే సిద్ధం చేయ్ అని హుకుం జారి అయింది కరుణాకర్ కి .

పంచభూత లింగాల్లో వాయులింగేశ్వరుడుగా ప్రశిద్ధినొందిన శ్రీకాళహస్తీశ్వరుడు ఇకపై నవరత్నాలు, వజ్రాలు పొదిగిన బంగారు నవగ్రహ కవచంతో భక్తులకు దర్శన భాగ్యం ఇవ్వనున్నాడు. స్వర్ణ శోభితమైన నవరత్న మయమైన నవగ్రహ అలంకార కవచాన్ని 60 లక్షల రూపాయలతో వాయు లింగ ( గాలి ) స్వామికి బహుకరించారు కర్నాటక రాష్ట్ర రెవిన్యు మంత్రివర్యులు గాలి కరుణాకర రెడ్డి మరియు కుటుంబ సభ్యులు.

ఈ నవగ్రహ కవచంలో 27 నక్షత్రాలు, నవగ్రహాలు మలిచారు. ఒక్కో నక్షత్రానికి 27 వజ్రాల ప్రకారం 729 వజ్రాలను పొదిగారు. జ్యేష్టమాస సోమ అమావాస్య ముందు రోజు ఆదివారం 21 జూన్ 2009 న శ్రీకాళహస్తి లోని స్థానిక త్రినేత్ర అతిధి గృహం నుంచి వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో నవగ్రహ కవచాన్ని ఊరేగింపు చేసి ఆలయంలోకి తీసుకొని వచ్చారు గాలి కుటుంబ సభ్యులు.

ఈ గాలి స్వామికి గాలి సోదరుల వితరణ చేసిన నవగ్రహ కవచంతో.....
తాను అర్ధాష్టమ శని బారి నుంచి తట్టుకొని......
తన చెంతకు వచ్చే భక్తులను చల్లగా అనుగ్రహిస్తాడని ఆశిద్దాం................శ్రీనివాస గార్గేయ

మావోయిస్టులపై నిషేధం మకర మాలికా యోగ దేశారిష్ట ఫలితమేనా?

రక్త రహిత యుద్ధం రాజకీయాలు కాగా,

నెత్తురు తడిసిన రాజకీయాలే యుద్ధం.... అని మావో సూత్రీకరించారు.

హింస రచన, ధ్వంస రచనలే విప్లవ పంథాగా విరుచుకుపడుతున్న మావోయిస్టుల ఆటకట్టించటానికి నేడు భారతదేశ ప్రభుత్వం నిషేధం విధించటం, ఈ నిషేధం దేశంలోని అన్నీ రాష్ట్రాలకు వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.

భారత ఉపఖండాన్ని విముక్తం చేసి నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించాలనే రాజకీయ లక్ష్యానికి అనుగుణంగా ఏటికేడు దేశంలో మావోయిస్టులు విస్తరిస్తున్నారు. భద్రతా దళాలు నేరుగా తమపై కార్యాచరణకు దిగకుండా వ్యూహాత్మక యుద్ధ తంత్రాన్ని మావోయిస్టులు అనుసరిస్తున్నారు. భారత దేశంలో ఏడు రాష్ట్రాలలో మావోయిస్టుల హల్ చల్ నడుస్తున్నది. ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్లలో విధ్వంసాలకు పాల్పడుతున్నారు.

రెండేళ్ళ క్రిందట గెరిల్లా యుద్ధ తంత్రాన్ని సంచార యుద్ధంగా మార్చుకున్న మావోయిస్టులు ప్రస్తుతం తదనంతర దశ అయిన పొజిషినల్ వార్ కు సిద్ధమయ్యారు. తమ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో ప్రభుత్వ బలగాలతో ప్రత్యక్ష యుద్ధానికి తెగపడుతున్నారు. స్థానికుల అండ దొరికిన చోటల్లా కాలుదువ్వి రక్షణ బలగాలకు సవాలు విసురుతూ, తమ ప్రాబల్యం పెరిగిందని రుజువు చేసుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితులలో వున్న మావోయిస్టులు, ఉగ్రవాద సంస్థలతోకూడా సంబంధాలు పెట్టుకొని ,అత్యంత అధునాతన ఆయుధాలు చేతబడుతున్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం.......... ఈ రెంటితో దేశ భద్రతకు తూట్లు పొడుస్తూ.......... తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాదికారమన్న ఆటవిక భావజాలంతో........... శాంతి భద్రతలకు చితి పేరుస్తూ ఇష్టారాజ్యంగా చెలరేగుతున్న సమయంలో........భారత ప్రభుత్వం ఆ ముప్పును తిప్పి కొట్టే ఏదైనా జాతీయ వ్యూహం రూపొందించాల్సిన అవసరం వుంది........

............ఓ జాతీయ వ్యూహం రూపొందించకుండా ఈరోజున అంటే 22 జూన్ 2009 జ్యేష్టమాసం సోమఅమావాస్య మృగశిర నక్షత్రంలో, కేంద్రం మావోయిస్టులపై నిషేధం విధించటం దుష్ట మకర మాలికా యోగ దేశారిష్ట ఫలితమేనని చెప్పక తప్పదు. ఎప్పటినుంచో నిషేధం విధించకుండా ఈ దేశారిష్ట సమయంలోనే విధించటం జ్యోతిశ్శాస్త్ర రీత్యా సబబు కానే కాదు.

ఫలితాలు ఎలావుంటాయి ?

మావోయిస్టులు ఏమి చేస్తారు ?

.... మొదలైన జ్యోతిష్య విశేషాలకై

తదుపరి పోస్టింగ్ లో తెలుసుకుందాం................. శ్రీనివాస గార్గేయ

Sunday, June 21, 2009

9 వ సం.. 9 వ నెల.. 9 వ తేదీ... 9 గంటల ... 9 నిముషాల.. 9 సెకన్లకు... ఏమవుతుంది ?

9 వ సం.. 9 వ నెల.. 9వ తేదీ... 9 గంటల ... 9 నిముషాల... 9 సెకన్లకు... ఏమవుతుంది ప్రపంచంలో. అనే ఆత్రుత అందరిలో ఉంటుంది. ఇప్పుడు చెప్పిన 6 తొమ్మిది అంకెలను కలపగా 54 మొత్తం వస్తుంది. ఈ రెండు అంకెలను కలిపితే మరల తొమ్మిది సంఖ్య వస్తుంది. తొమ్మిది సంఖ్య కుజగ్రహానికి ప్రతీక. ఇలా ప్రతి సంవత్సరం ఒక అంకె ప్రత్యేకంగా వస్తూనే ఉంటుంది. అలా ప్రత్యేకంగా వచ్చిన రోజును కొంతమంది అదృష్టంగా భావిస్తే, మరికొంత మంది అరిష్టంగా భావిస్తారు. గత 2008 లో ఆగష్టు 8 న బీజింగ్ లో ఒలంపిక్స్ ప్రారంభమయ్యాయి. మరి ఈ 2009 లో ప్రత్యేకత ఏమిటి? ఖగోళ ప్రత్యేకత ఏమిటి? శాస్త్ర ప్రత్యేకత ఏమిటి?...

ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి సంవత్సరం ఇలాగే ఒకే అంకె రావటం మామూలే. అయితే ఖగోళంలో శని గ్రహం ఈ రోజే సింహరాశి నుంచి కన్యారాశికి ప్రయాణమై వెళుతుంది. ఈ రోజుతోనే మకర మాలికా యోగ అరిష్టం వెడుతుంది. ఈనాటి నక్షత్రం భరణి. ఈ రోజును భరణీమహాలయం అని పిలుస్తారు. పితృదేవతల కాలమే మహాలయపక్షాలు. దీనినే పితృపక్షంగా చెప్తారు. భరణీ నక్షత్రానికి యముడు అధిపతి. ఖచ్చితంగా పైన తెల్పిన ఆరు తొమ్ముదులు తులా లగ్నంలో వుంటాయి. తుల లగ్నానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్ర నక్షత్రమే భరణీ. ఈ భరణీ నక్షత్రముండేది మేషరాశిలో. ఈ మేషరాశి అధిపతి కుజుడు. విచిత్రమేమంటే పై ఆరు తొమ్మిది సంఖ్యలు తులా లగ్నంలో వస్తుంటే, తొమ్మిది సంఖ్యకు అధిపతైన కుజుడు తులా లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలోనే వున్నాడు. తమాషాగా ఉంది కదూ!

ఇలా కబుర్లు చెప్తూపోతే కొండవీటి చేంతాడంత అవుతుంది. ఇదంతా మనకి అనవసరం. కాకతాళీయంగా ఈనాడు భరణీ మహాలయం వచ్చింది. శని కన్యా రాశికి వస్తున్నాడు. మకర మాలికా యోగ దుష్ఫలితాలు పోతున్నాయి. వృషభ, మకర, కర్కాటక రాశులవారు ఎంతో సంతోషంతో వుండాలి. ఎందుకో తెలుసా? శని వేదనల నుంచి విముక్తి. మరి మిధున, కుంభ, తులారాశులవారు శని వేదనలోకి వెడతారు. కనుక ఈ భరణీమహాలయం రోజున పితృదేవతలని స్మరించండి. శుభాలు జరగాలని కోరుకోండి. తెల్లవారితే తొమ్మిది పోతుంది. తమాషాగా బాగుంది కదూ! ....
...............................శ్రీనివాస గార్గేయ

Friday, June 19, 2009

కురుక్షేత్ర సంగ్రామం ఎప్పుడు జరిగింది ?

విశ్వ విశ్వాంతరాళాల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి.
ఈ సృష్టి ఏమిటి? ఈ సృష్టి రహస్యమేమిటి?
ఈ విషయాలపై చర్చలు సాగించి పరిశోధనలు చేయాలంటే,
వేయి జన్మలు ఎత్తినా తెలుసుకోనలేమని అనిపిస్తుంది.
ఖగోళమండలం గురించి వైజ్ఞానిక శాస్త్రం ఎన్నో కొత్త పుంతలు తొక్కినప్పటికీ,
గత విషయాలపై దృష్టి సారించి తెల్సుకోనాలనే తపన కొంతమందికి ఉండవచ్చు.
ఆసక్తితో తెల్సుకోనాలనే జిజ్ఞాస కొంతమందికి వుంటే..
మరికొంత మందికి తెలుసుకొని ఏమి చేస్తాము? ఎందుకు ఉపయోగపడతాయి?
ఎవరికీ ఉపయోగపడతాయి? ... అని తర్కించవచ్చు.
అలా అనుకుంటే పొరపాటే.
మరి పరాశరుడు, వరాహమిహురుడు, ఆర్యభట్ట అలా అనుకొనివుంటే...
చరిత్ర ఇలా వుండేది కాదేమో!

పంచమ వేదంగా చెప్పుకోనేటువంటి మహాభారత గ్రంధంలో ఉదహరించబడిన కొన్ని విషయాలను ప్రామాణికములుగా తీసుకుంటే కురుక్షేత్ర సంగ్రామం ఎప్పుడు జరిగినది? ఏ తేదీన జరిగినది? అనే అతి క్లిష్టమైన వివరాలను శోధించవచ్చు. పుక్కిటి పురాణంగా కొందరు కొట్టివేయవచ్చు. కానీ గార్గేయ జ్యోతిష్య పరిశోధనా సంస్థ మాత్రం అనేక విషయాలపై దృష్టి సారించి పరిశోధనలు చేయాలని సంకల్పించింది .

ఇందులో భాగంగా వాస్తవ వైజ్ఞానిక పరిశోధనాత్మక శాస్త్రీయంగా వెలువడే మా "గ్రహభూమి" బ్లాగ్ లో కొన్ని వివరాలను మా అభిమాన పాఠకుల కొరకై ఇస్తున్నాము. ఇంకా ఇంకా శోధించి, సాధించి రాబోయే తరాల వారికైనా ఉపయోగపడాలనే చిన్న ప్రయత్నంతో ముందుకు వెడుతూ స్వల్ప వివరాలను మీ ముందుంచుతున్నాను.

మహాభారతంలో చెప్పబడిన అంశాలు ఏమిటంటే...

1.కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులు జరిగినది.
2.యుద్ధం ప్రారంభమైన తరువాత వచ్చిన అమావాస్య జ్యేష్ఠానక్షత్రం అయింది.
3. యుద్ధసేనలు యుద్ధభూమిలో అడుగిడిన నాడు పుష్యమి నక్షత్రం.
4.యుద్ధం చివరి ఉత్తరాయణ ప్రారంభపు రోజుకు మధ్య 50 రోజులు.
5.మాఘశుక్ల పంచమి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది.
6.యుద్ధం పదో రోజుకి, మాఘశుక్ల పంచమికిమధ్య యాభై ఎనిమిది రోజులు.
7.భీష్మనిర్యాణం మాఘ శుక్ల ఏకాదశి నాడు. ఈ రోజుకు యుద్ధం ముగిసిన రోజుకి యాభై ఆరు రోజులు. 8.రాయబారానికి కృష్ణుడు కార్తీక మాసం రేవతి నక్షత్రం నాడు హస్తినాపురానికి వెళ్లారు.
9.ఉత్తరాయణ ప్రారంభపు రోజు నుంచి వెనుకకు వస్తే 51 వ రోజు రాత్రితో 18 రోజుల సంగ్రామం ముగిసింది.
10. పాండవుల వనవాస ప్రారంభంలో ఓ సూర్యగ్రహణ మేర్పడినదని, ద్వారకలో కనబడినదని సభాపర్వంలో విదురుడు చెబుతాడు.
11.భీష్మపర్వంలో (3.29) ఓ సూర్యగ్రహణం పక్షం వ్యవధి లోపల మరో చంద్రగ్రహణం యేర్పడినదని, ఇది కురుక్షేత్రలో కనపడినదని చెప్పబడినది.
12.సభాపర్వంలోని మొదటి సూర్యగ్రహణానికి, భీష్మ పర్వంలోని రెండవ సూర్యగ్రహణానికి మధ్య వ్యవధి 15 సంవత్సరాలని చెప్పబడినది.
13.మౌసలపర్వం ( 2.19-2.20 ) లో మరో సూర్యగ్రహణం కురుక్షేత్రలో దర్శనమిచ్చినట్లు వున్నది. 14.భీష్మపర్వంలోని సూర్యగ్రహణానికి మౌసలపర్వంలోని సూర్యగ్రహణానికి మధ్య 35 సంవత్సరాల వ్యవధి వున్నట్లు చెప్పబడినది. మౌసల పర్వంలోని గ్రహణ సమయంలో గురుగ్రహము మీనరాశిలో స్వక్షేత్రంలో, స్వనక్షత్రమైన పూర్వాభాద్ర నుంచి ఉత్తరాభాద్రకు మారడం జరిగినది.
15.అనుకూలించనటు వంటి గ్రహస్థితులు కురుక్షేత్ర యుద్ధ ప్రారంభమైన కార్తీక పూర్ణిమకు, దానికి ముందున్న సూర్యగ్రహణానికి మధ్యన జరిగినట్లుగా భీష్మపర్వం ( 3.14-3.19 )లో చెప్పబడినది.
16.యుద్ధ ప్రారంభమైన 8 వ రోజున శని గ్రహం రోహిణి నక్షత్రంలో వుండి, కుజ గ్రహం అనూరాధ నుంచి జ్యేష్ఠా నక్షత్రంలోకి ప్రవేశించినట్లు వుంది.
17.యుద్ధం ముగిసిన 4రోజులకు లేదా కార్తీక పూర్ణిమ నుంచి 22 రోజులకు శనిగ్రహం రోహిణి నక్షత్రంలోనే వున్నది. 18. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు 13 రోజుల వ్యవధిలో సూర్య చంద్ర గ్రహణాలు జరిగినట్లు భీష్మ పర్వం చెపుతుంది.

పై ప్రకారంగా ఖగోళ సంబంధిత పంచాంగ వివరాలు మహాభారతంలో పొందుపరచబడినవి. పై వివరాలను ఆధారంగా చేసుకొని నేటి ఆధునిక వైజ్ఞానిక విజ్ఞాన సంపదతో ఆలోచిస్తే 3300 బి.సి. - 700 బి.సి. వరకు ఒక మాసంలో జంటగా వచ్చిన గ్రహణాలు 672 వున్నవి. ఇందులో 2 గ్రహణాల మధ్య 13 రోజులు వచ్చినవి కేవలం 6 మాత్రమే వున్నవి. భీష్మపర్వంలో చెప్పిన విధంగా కురుక్షేత్ర సంగ్రామానికి ముందు 13 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు వచ్చినట్లు వుంది. కానీ ప్రస్పుటంగా ఇంత కాలం అని ఉదహరించలేదు.

పైన తెల్పిన వివరాలను బట్టి యుద్ధం కార్తీకమాస పూర్ణిమకు ప్రారంభమైనదంటే, రవి వృశ్చికరాశిలో వుంటాడు. 16 వ పాయింట్ ప్రకారం శని వృషభరాశిలోను, కుజుడు వృశ్చికరాశిలోను వుంటారు. మౌసలపర్వంలో చెప్పబడిన గ్రహణ సమయంలో గురుగ్రహము మీన రాశిలో వున్నాడు ఈ గ్రహణానికి 35 సంవత్సరాల ముందు ఏర్పడిన గ్రహణంలో కురుక్షేత్ర సంగ్రామం కీలకమైనది. ఆ సమయానికి గురుగ్రహం ఎక్కడ వున్నాడో వెనక్కి వెళ్ళాలి.

కార్తీక పూర్ణిమ నాడు యుద్ధ ప్రారంభమైనది. కనుక రవి వృశ్చికంలో వుంటే చంద్రుడు వృషభంలో వుంటాడు. 2 వ పాయింట్ ప్రకారం అమావాస్య నాటి నక్షత్రం జ్యేష్ఠ అని తెల్పబడినది. పంచాంగ గణిత రీత్యా ఆ రోజు కార్తీక అమావాస్య అవుతుంది. కనుక యుద్ధం కార్తీకపూర్ణిమ నాడు ప్రారంభమైనదని చెప్పాలి. మహాభారతంలో గ్రహణసమయంలో గురు శుక్ర రవి కుజ శనులు ఏఏ నక్షత్రాలలో సంచారం చేస్తున్నారో ఇవ్వటం జరిగినది. యుద్ధసేనలు యుద్ధభూమిలో మొహరించినది పుష్యమీనక్షత్రం ( 3 వ పాయింట్ ) అయితే అది ఆశ్వీయుజ బహుళ సప్తమి అయితేనే పుష్యమీ నక్షత్రం అవుతుంది.

అనగా యుద్ధానికి 24 రోజుల ముందుగా యుద్ధసేనలు మొహరించాయన్నమాట. కృష్ణుడు రాయబారానికి కార్తీకమాస రేవతి నక్షత్రంలో వెళ్ళాడంటే, ఆ రోజు యుద్ధ ప్రారంభమైన కార్తీక పూర్ణిమకు ముందు 4 రోజులే అవుతుంది. దీనిని బట్టి ఆనాడు ఏర్పడిన గ్రహస్థితిగతులను బేరీజు వేసుకొని మహాభారత యుద్ధం సరిగ్గా ఏనాడు ప్రారంభమైనదనే ఆసక్తికరమైన విశేషాలను ఇంకా ఇంకా పరిశోధించవలసిన వుందని తెలియజేస్తున్నాను ...... మీ శ్రీనివాస గార్గేయ

Thursday, June 18, 2009

మకర మాలికా యోగము - నవరత్నాల ధారణపై ప్రభావాలు, పరిహారాలు

15 జూన్ 2009 నుంచి ప్రారంభమైన మకర మాలికా యోగ దుష్ఫలితాలు, రాహు శనుల షష్టష్టక స్థితి ముగిసేవరకు ద్వాదశ రాశులపై ప్రభావము చూపుతాయి. మకర రాశిలో రాహువు, కుంభ రాశిలో గురువు, మీనంలో చంద్రుడు, మేషంలో కుజ శుక్రులు, వృషభంలో బుధుడు, మిధునంలో రవి, కర్కాటకంలో కేతువు, సింహంలో శనిగ్రహం మాలికా యోగంగా సంచారములున్నవి.

పన్నెండు రాశులలో జన్మించిన జాతకులు ఈ మకర మాలికా యోగ ఫలితాల నుంచి పరిహారం పొందడానికి చాల సుళువుగా పాటించదగిన జాగ్రత్తలున్నవి. ఈ క్రింద తెల్పిన జాగ్రత్తలు తీసుకోనినచో మాలికా యోగ దుష్ఫలితాలు లేకుండా కొంత శుభకర ఫలితాలను అనుభవించెదరు.

మేష వృశ్చిక రాశులు : ఈ రాశుల జాతకులు రాహు శనుల షష్టష్టకము. ముగిసేవరకు అనగా ఇప్పటి నుంచి 09.09.2009 వరకు వచ్చే అన్ని మంగళ వారాలలో అనగా జూన్ 23 - 30, జూలై 7 - 14 - 21 - 28, ఆగష్ట 4 - 11 - 18 - 25, సెప్టెంబర్ 1 - 8 తేదీలలో ఎరుపురంగు గానీ, తెలుపు రంగు గానీ దుస్తులను ధరించవద్దు. అలాగే ఆయా మంగళవారాలలో కుజ శుక్ర రత్నాలైన పగడము గానీ, వజ్రము గానీ ధరించకుండా వుండండి. నవరత్న ఉంగరాన్ని ఈ రాశి జాతకులు పైన తెల్పిన తేదీలలో ధరించవద్దు.

వృషభ తులా రాశులు : ఈ రాశుల జాతకులు 9 సెప్టెంబర్ వరకు వచ్చే అన్ని శుక్రవారాలలో అనగా జూన్ 26, జూలై 3 - 10 - 17 - 24 - 31, ఆగష్టు 7 - 14 - 21 - 28, సెప్టెంబర్ 4 తేదీలలో ఆకుపచ్చరంగు దుస్తులను ధరించవద్దు. అలాగే బుధ రత్నమైన మరకతమును, నవరత్న ఉంగరాన్ని పై రాశులవారు శుక్రవారాలలో ధరించవద్దు.

మిధున కన్య రాశులు : ఈ రాశుల జాతకులు 9 సెప్టెంబర్ వరకు వచ్చే అన్ని బుధవారాలలో అనగా జూన్ 24, జూలై 8 - 15 - 22 - 29, ఆగష్టు 5 - 12 - 19 - 26, సెప్టెంబర్ 2 - 9, తేదీలలో ఎరుపురంగు దుస్తులను ధరించవద్దు. అలాగే సూర్య రత్నమైన కెంపును, నవరత్న ముద్రికను కూడా పై రాశులవారు బుధవారాలలో ధరించవద్దు.

కర్కాటక రాశి : ఈ రాశి జాతకులు 2009 సెప్టెంబర్ 9 వరకు వచ్చే అన్నీసోమవారాల్లో చిత్రాతి చిత్రమైన రంగులు కల ( కలగూరగంప ) దుస్తులను ధరించవద్దు. కేతు రత్నమైన వైడూర్యమును గానీ, నవరత్న ముద్రికను కూడా సోమవారాల్లో అనగా జూన్ 22 - 29, జూలై 6 - 13 - 20 - 27,ఆగష్టు 3 - 10 - 17 - 24 - 31, సెప్టెంబర్ 7 తేదీలలో ధరించకండి.

సింహ రాశి : ఈ రాశి జాతకులు సెప్టెంబర్ 9 వరకు వచ్చే అన్నీ ఆదివారాలలో నీలం రంగు దుస్తులను గానీ, శని రత్నమైన నీలమును గానీ, నవరత్న ముద్రికను కూడా దరించవద్దు. జూన్ 21 - 28, జూలై 5 - 12 - 19 - 26, ఆగష్టు 2 - 9 - 16 - 23 - 30, సెప్టెంబర్ 6 సింహ రాశి వారు ధరించకూడని తేదీలు.

మకర రాశి : మకర మాలికా యోగం జరుగుచున్న తరుణంలో మకర రాశిలో రాహువున్న కారణంగా రాహు శనుల షష్టష్టకము ముగియు వరకు అన్నీ శనివారాలలో అనగా జూన్ 20 - 27 , జూలై 4 - 11 - 18 - 25, ఆగష్టు 1 - 8 - 15 - 22 - 29 , సెప్టెంబర్ 5 తేదీలలో మకర రాశి జాతకులు బూడిదరంగు వస్త్రాలు గానీ, గోమేధిక రత్నాన్ని గానీ ధరించవద్దు. అలాగే నవరత్న ముద్రికను మకరం వారు శనివారం ధారణ చేయకండి.

కుంభ రాశి : మకర మాలికా యోగంలో కుంభ గురువున్న కారణంగా, 9 సెప్టెంబర్ వచ్చే అన్నీ శనివారాలలో బంగారు రంగు దుస్తులకు దూరంగా వుండండి. గురు రత్నమైన కనకపుష్యరాగాన్ని గానీ, నవరత్న ముద్రికను గానీ కుంభ రాశి వారు శనివారాలలో అనగా జూన్ 20 - 27 , జూలై 4 - 11 - 18 - 25, ఆగష్టు 1 - 8 - 15 - 22 - 29, సెప్టెంబర్ 5 తేదీలలో ధరించవద్దు.

ధనూ మీనా రాశులు : ఈ రాశుల జాతకులు 09.09.2009 వరకు వచ్చే అన్నీ గురువారాలలో తెలుపురంగు దుస్తులను గానీ చంద్ర రత్నమైన ముత్యమును గానీ, నవరత్న ముద్రికను గానీ ధరించవద్దు. జూన్ 18 - 25, జూలై 2 - 9 - 16 - 23 - 30, ఆగష్టు 6 - 13 - 20 - 27,సెప్టెంబర్ 3 తేదీలలో ధరించవద్దు.

పైన తెల్పిన ప్రకారంగా పన్నెండు రాశుల వారు జాగ్రత్తలు తీసుకోన్నచో నవగ్రహముల ప్రభావము మాలికా యోగ కారణంగా జాతకులపై వుండదు. ఈ పోస్టింగ్ ని మీ ప్రియ మిత్రుడికి ఈ-మెయిల్ పంపి మకర మాలికా యోగ దుష్ఫలితాలను అరికట్టడానికి ప్రయత్నించండి ......... శ్రీనివాస గార్గేయ

Wednesday, June 17, 2009

మకర మాలికా యోగ దుష్ఫలితాలకు మొదటి పరిహారం

2009 జూన్ 15 రాత్రి నుంచి 18 ఉదయం వరకు 55 గంటల పాటు జరిగే అరుదైన మకర మాలికా యోగ కారణంగా పన్నెండు రాశులపై దాని ప్రభావము వుంటుంది. అంతేగాకుండా ఈ యోగ ప్రారంభమైన ముప్పై ఎనిమిది రోజులకే సంపూర్ణ సూర్యగ్రహణము 22 జూలై 2009 న, పదిహేను రోజుల ముందు వెనకాలలో ప్రచ్ఛాయ చంద్ర గ్రహణాలు (మరో పోస్టింగ్ లో ప్రచ్ఛాయ చంద్ర గ్రహణాలు అంటే ఏమిటో తెలుసుకొందాము ) జరుగుతున్నాయి. గనుక ఈ దుష్ఫలితాలు లేకుండా వుండాలంటే దేవీఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ దుష్ఫలితాల ప్రభావము రాహు శని గ్రహాల షష్టాష్టకము వెళ్ళునంతవరకు అనగా 9 సెప్టెంబర్ 2009 వరకుండును. అంతవరకు పన్నెండు రాశుల వారు ఖడ్గమాల స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసినచో ఉపశాంతి కలుగును.

నవరంధ్రాలతో కూడిన ఈ దేహము నవచక్రములతో విరాజిల్లే శ్రీచక్రముతో సమన్వయము చేయబడినది భావనోపనిషత్ లో. శ్రీ చక్రములోని మొదటి చక్రమైన త్రైలోక్యమోహన చక్రము భూ తత్వముతో కూడినది. ఈ చక్రములోని రెండవ రేఖలో నాల్గు భుజములు కల్గి పద్మము శూలము ను ధరించి చిత్ర విచిత్రములైన ఆభరణములతో అష్టమాతృకలు వుంటారు. బ్రహ్మ యొక్క శక్తితో బ్రాహ్మీ, ఈశ్వరుని శక్తితో మహేశ్వరి, కుమారస్వామి శక్తితో కౌమారి, విష్ణుమూర్తి శక్తితో వైష్ణవి, వరాహరూపుని శక్తితో వారాహి, ఇంద్రుని శక్తితో మహేంద్రి, చందమున్డులను వధించిన శక్తి చాముండా, లక్ష్మీ సంపన్నంతో మహాలక్ష్మీ అనే అష్టమాతృకలు త్రైలోక్యమోహన చక్రంలో వుంటారు. వీరి ఆభయంతో అష్టరాశులలో ఏర్పడిన ఈ అవయోగ దుష్ఫలితాలు తప్పక తొలగగలవు. గనుక భక్తిప్రపత్తులతో 9 సెప్టెంబర్ 2009 వరకు నిత్యం స్తోత్రించినచో సకల శుభములు కలుగ గలవు.

ఇదిగాక సుందరాకాండ పారాయణం చేసినచో కూడా శుభములు కలుగగలవు. సుందరాకాండలో ఏ ఏ శ్లోకములు పారాయణము చేయవలయనో తదుపరి పోస్టింగ్ లో తెలుసుకుందాం.

మాలికా యోగ దుష్ఫలితాలకు మరో పరిహారం

మకర మాలికా యోగ దుష్ఫలితాల నుంచి ఉపశాంతి పొందుటకై ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయవచ్చును. అవకాశంలేని వారు సుందరకాండలోని ముఖ్యమైన ఈ దుగువ తొమ్మిది శ్లోకాలను నిత్యం పారాయణం చేసేది. మన పవిత్ర భారతదేశంలో వెలసిన ప్రాచీన సాహిత్యంలో వాల్మీకి రామాయణమొక మహారత్నం.

తరతరాలుగా యావత్తు మానవాళి హృదయాలను చూరగొన్న అజరామర ఆది కావ్యం రామాయణం. ఈ క్రింది తొమ్మిది శ్లోకాలను పారాయణ చేసిన వారికి బుద్ధిబలం, యశస్శు, ధైర్యం, నిర్భయత్వం, రోగవిముక్తి, నవగ్రహ ఉపశాంతి, వాక్పటుత్వం మొదలగునవి అనుగ్రహమవుతాయి.

సర్వలోక సౌఖ్యం, సంక్షేమం, పురోగతి కోసం సామూహికంగా కూడా పారాయణం చేయవచ్చును. ప్రతిదినం తొమ్మిదిసార్లు లేక ఏడుసార్లు ఏకాగ్రత చిత్తంతో, అచంచల భక్తితో, పరిపూర్ణ విశ్వాసంతో పారాయణ చేయండి.


తతో రావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శన
ఇయేష పడమన్వేష్టుం చారణ చరితేపథి (1.1) ----
సూర్య గ్రహ సంబంధిత శ్లోకం

యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ
ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు న సీదతి (1.189) ---- చంద్ర గ్రహ సంబంధిత శ్లోకం

అనిర్వేదః శ్రియోమూలం పరం సుఖం
అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తకః (12.10)----కుజ గ్రహ సంబంధిత శ్లోకం

నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ తస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః (13.59) ---బుధ గ్రహ సంబంధితం

ప్రియాన్నసంభవేత్ దుఃఖమ్ అప్రియాదధికం భయం
తాభ్యాంహియేవియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం (26.50)----గురు గ్రహ సంబంధిత శ్లోకం

రామః కమల పత్రాక్ష సర్వసత్వ మనోహరః
రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే (35.8)----శుక్ర గ్రహ సంబంధిత శ్లోకం

జయత్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబలః
దాసోహంకోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః (42.33/34)---శని గ్రహ సంబంధిత శ్లోకం

యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః
యది చాస్త్యేక పత్నిత్వం శీతో భావ హనుమతః (53.28/28)---రాహు సంబంధిత శ్లోకం

నివృతవనవాసం చ త్వయా సార్ధమరిందమం
అభిషిక్త మయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం (68.28)---కేతు సంబంధిత శ్లోకం

పైన తెల్పిన సుందరకాండ పారాయణం చేయలేని వారు ఈ మకర మాలికా యోగ దుష్ఫలితాలు నుండి చిన్న చిట్కాలతో ఉపశాంతి పొందుటకు తదుపరి పోస్టింగ్ లో వివరాలకై చూడండి.

Monday, June 15, 2009

నేటినుంచే మకర మాలికా యోగం

ఏమిటా యోగం అనుకుంటున్నారా ! అవును మరి... మకర రాశి నుంచి ఎనిమిది రాశులలో వరుసగా తొమ్మిది గ్రహాల సంచారం ఉండటంతో మకరం నుంచి గ్రహ మాలికా యోగం ప్రారంభం అవుతున్నది. మకరరాశిలో రాహువు, సింహరాశిలో శని షష్టాష్టకములుగా వుంటున్న సమయంలో, మిగిలిన కుంభ, మీన, మేష, వృషభ, మిధున, కర్కాటక రాశులలో వరుసగా ఏడు గ్రహాల గ్రహసంచారం వుండి, 40 రోజులలోపలే ఈ యోగ అష్టమాధిపతికి సంపూర్ణంగా గ్రహణం వాటిల్లటం దాదాపు నాలుగు వందల సంవత్సరాలకు పైబడి మాత్రమే వస్తున్న గ్రహస్థితి. ఇలాంటి మకర మాలికా యోగం 2009 జూన్ 15 అర్దరాత్రి దాటిన పిదప 01.57 నిమిషాలకు ప్రారంభమై, 18 వ తేదీ ఉదయం 09.15 నిమిషములకు మకర మాలికా యోగం ముగుస్తుంది.

గ్రహమాలికా యోగాలు తరచుగా వస్తుంటాయి. కానీ మకర సింహ రాశుల మధ్యను, రాహుశనుల మధ్యను రావటము అనేది చాలా అరుదు. అష్టమాధిపతికి గ్రహణం రావాలంటే, ఆ యోగం ధనుస్సురాశి నుంచి కానీ లేక మకరరాశి నుంచి కానీ వుండాలి. ఈ మాలికా యోగం కన్యారాశి నుంచి ప్రారంభమైనది అనుకుంటే, ఆది సోమ వారాల అధిపతులైన సూర్య చంద్రుల సింహ కర్కాటక రాశుల ఆచ్చాదన ఉండదు. మాలికా యోగం తులారాశి నుంచి ప్రారంభమైతే సూర్య, చంద్ర, బుధుల రాశులలో యోగ సంబంధిత గ్రహ ఆచ్చాదన ఉండదు. అలాగే యోగం మేషం నుంచి ప్రారంభమైతే గురు శని రాశులలో గ్రహ ఆచ్చాదన వుండదు. కానీ ఈ మకర మాలికా యోగములో ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని వారాల అధిపతుల రాశులలో గ్రహ ఆచ్చాదన ఉండటమే విశేషం. మకర రాశికి అధిపతి శని అష్టమరాశైన సింహంలో ఉండటము, సింహ రాశ్యాధిపతి రవికి 38రోజులలోనే సంపూర్ణ గ్రహణం ఏర్పడటం, ఆ గ్రహణానికి పదిహేను రోజుల ముందుగా ఒక ప్రచ్ఛాయ చంద్ర గ్రహణం, పదిహేను రోజుల తరువాత ఒక ప్రచ్ఛాయ చంద్ర గ్రహణం సంభవిస్తున్నాయి. ఇలాంటి గ్రహ స్థితులు 400సంవత్సరాల తదుపరి ఇప్పుడు వస్తున్నాయి.

ఈ మాలికా యోగం యాబై అయిదు గంటల పద్దెనిమిది నిమిషాలు ఉన్నప్పటికీ, దాని ప్రభావం మాత్రం రాహు శనుల షష్టాష్టకం ముగిసే వరకు వుంటుంది. అంటే 09.09.2009 వరకు ఈ మకర మాలికా యోగ అరిష్ట ప్రభావం వుంటుంది. దీనివల్లన కలిగే దుష్ఫలితాలు పన్నెండు రాశులపై లేకుండా వుండాలంటే మనం ఏం చేయాలి?

పరిహార పద్ధతులకై తదుపరి పోస్టింగ్ లో తెలుసుకుందాం.

Sunday, June 14, 2009

వివిధ ప్రాంతాలలో సూర్యగ్రహణ సమయములు

భారతదేశములోని ముఖ్య పట్టణాలకు సూర్యగ్రహణ సమయాలు భారత కాలమానం ప్రకారం ఈ క్రింది విధముగా వుండును. పువ్వు గుర్తు (*) వున్న ప్రాంతాలలో గ్రహణము సంపూర్ణముగా కనపడును.
అక్షరములు పెద్దవిగా కనబడుటకు ఇమేజ్ పై క్లిక్ చేయండి










Saturday, June 13, 2009

సంపూర్ణ సూర్యగ్రహణము

శ్రీ విరోధి నామ సంవత్సర ఆషాఢ అమావాస్య బుధవారం 22 జూలై 2009 కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్ర కర్కాటక లగ్నంలో కేతు గ్రస్తంగా కృష్ణవర్ణంలో సంపూర్ణ సూర్యగ్రహణము సంభవించును. ఈ గ్రహణం 258 కిలోమీటర్ల నిడివి గల ఛాయతో తూర్పు ఆసియా ప్రాంతంలో కనపడును. భారతదేశము, నేపాల్, చైనా, మధ్య ఫసిఫిక్ ప్రాంతాలలో సంపూర్ణం గోచరించును. భారతదేశంలో బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో వున్న కొన్ని పట్టణాలలో మాత్రమే గ్రహణము సంపూర్ణము కాగా, మిగిలిన అన్ని రాష్ట్రాలలో పాక్షికముగానే కనపడును. పాట్నా, వారణాసి(యు.పి), గయా, ఔరంగాబాద్, బాగల్పూర్, ముజఫర్పూర్ పట్టణాలలో గ్రహణము సూర్యోదయం తదుపరి ప్రారంభమై సంపూర్ణంగా కనపడును. జబల్పూర్, సూరత్, భోపాల్, ఇండోర్, ఉజ్జయినీ ప్రాంతాలలో గ్రహణంతోనే సూర్యోదయమై, సంపూర్ణ గ్రహణము గోచరించును. భారత్ మిగిలిన రాష్ట్రాలలో గ్రహణంతోనే సూర్యోదయమై, పాక్షిక గ్రహణం కనబడును. ఖగోళంలో అత్యధిక కాలం సంపూర్ణ గ్రహణ స్థిరబింబము 6 నిమిషాల 39 సెకన్లు వుండి, మధ్య ఫసిఫిక్ లో కనబడును. కానీ భారతదేశములో ముఖ్యముగా పాతలీపుత్రములో (బీహార్ రాష్ట్రములోని పాట్నాలో)మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణ స్థిరబింబము 3 నిమిషాల 43 సెకనుల పాటు గరిష్టముగా, సంపూర్ణగ్రహణ స్థిరబింబము గోచరించును.

భారత కాలమానం ప్రకారం
సూర్యగ్రహణస్పర్శకాలము : ఉ 5గం. 23ని. 24సె
సూర్యగ్రహణస్థిరబింబప్రారంభం: ఉ 6గం. 24ని. 35సె
సంపూర్ణసూర్యగ్రహణమధ్యకాలము: ఉ 6గం. 26ని. 26సె
సంపూర్ణగ్రహణ విడుపు ప్రారంభం: ఉ 6గం. 28ని. 18సె
శుద్ధమోక్షకాలము : ఉ 7గం. 29ని. 28సె
ఆద్యంతంపుణ్యకాలము : 2గం. 6ని. 04సె
సంపూర్ణ స్థిరబింబ గోచర కాలము : 3ని. 43సె

పై సమయాలు పాట్నా పట్టణానికే వర్తించును.

భారతదేశములోని వివిధ పట్టణముల సూర్యగ్రహణముల సమయములను రేపు తెలుసుకుందాం.

Thursday, June 11, 2009

దేశారిష్ట యోగములు

2009జూన్ 15 సోమవారం రాత్రి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల నుంచి 18 వ తేది గురువారం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషముల వరకు ఎనిమిది రాశులలో తొమ్మిది గ్రహములు గ్రహమాలికగా ఏర్పడుతున్నవి. మకర రాశిలో రాహువు, కుంభ రాశిలో గురువు, మీన రాశిలో చంద్రుడు, మేష రాశిలో కుజ శుక్రులు, వృషభ రాశిలో బుధుడు, మిధున రాశిలో రవి, కర్కాటక రాశిలో కేతువు, సింహ రాశిలో శని గ్రహము వరుసగా గ్రహములన్నియు సుమారు 62 గంటల పాటు ఒక మాలికగా ఏర్పడనున్నవి. తదుపరి జూలై 3 వ తేది రాత్రి తొమ్మిది గంటల నలబై ఒక్క నిమిషము నుంచి ఆగష్టు 16 మద్యాహ్నం మూడు గంటల యాబై ఎనిమిది నిమిషముల వరకు వృషభ రాశిలో వున్న కుజుడికి, సింహ రాశిలో వున్న శనికి పరస్పరము వీక్షణలు వుండటం కూడా ఒక దేశారిష్టమే. తదుపరి జూలై 22 వ తేదిన కర్కాటక రాశిలో కేతుగ్రస్తంగా 258 కిలోమీటర్ల నిడివి గల ఛాయతో సంపూర్ణ సూర్య గ్రహణము ఏర్పడనుంది. గనుక 2009 జూన్, జూలై, ఆగష్టు నెలలు దేశారిష్ట మాసములుగా పరిగణించాలి. ఇలాంటి గ్రహస్థితులు సంభవిస్తే 12 రాశులపై ఫలితాలు ఎలా వుంటాయి? పరిష్కారాలు ఏమిటి? అనే ఆసక్తికర అంశాలను రేపు తెలుసుకుందాం.

Saturday, June 6, 2009

ముందుమాట

అసంఖ్యాకమైన మేధావులకు భరతభూమి పుట్టినిల్లు. మన హైందవ ప్రాచీన మేధావుల గురించి చెప్పుకోవడం మొదలు పెడితే, అది తరిగే విషయం కాదు. మహా ఋషులే ప్రాచీనకాలం లోని శాస్త్రవేత్తలు. జగమెరిగిన పురాణ ప్రసిద్ధులు అనేకమంది వున్నారు. ప్రాచీన మహర్షులు ఏకాగ్రతతో తపస్సులు చేస్తూ, మనోనిశ్చలత, వాక్సుద్ధి, దివ్యదృష్టి వంటి అద్భుత శక్తులను సంపాదించేవారు. తాము సాధించిన శక్తితో సృష్టి, ప్రకృతిల గురించి తెలియజేస్తూ, ఎంతో శాస్త్రీయ పరిజ్ఞానం వున్న వేదాలను వ్రాసుకొచ్చారు. యజ్ఞ యాగాలనే ప్రయోగాలతో ప్రకృతి శక్తులను కైవసం చేసుకోవడం తెలుసుకున్నారు. దుష్టులను సంహరించటానికి అస్త్రాలను కూడా రూపొందించారు. లోక కళ్యాణానికి ఎన్నో - ఎన్నెన్నో మార్గాలను చూపించారు.విశ్వం స్వరూప స్వభావాలను గురించి, ప్రకృతి శక్తుల గురించి వేద ఋషులు స్పష్టాతి స్పష్టమైన సిద్ధాంతాలను మనకు అందించారు. గ్రహగతులకు మానవుని భవిష్యత్తుకు అవినాభావ సంభంధం ఉన్నదని మూడువంతుల ఖగోళ విజ్ఞానమును ఋగ్వేదంలో వుంచారు.

దీన్ని బట్టి వేద ఋషుల యొక్క ఖగోళశాస్త్ర పరిజ్ఞానం ఎంత అపారమైనదో తెలుస్తుంది. నక్షత్ర సమూహాలైన గెలాక్సీ గురించి, రాశిచక్రాన్ని గురించి, విషువత్తుల గురించి, ధ్రువతార మార్పులను గురించి, సౌరశక్తిని గురించి, గ్రహాల గురించి, భూమి వర్ణన...దాని చలానాలను గురించి, ఉత్తరద్రువం, ఋతువుల గూర్చి... ఇలా... ఎన్నో... ఎన్నెన్నో అంతరిక్ష ఖగోళ విజ్ఞానాంశాలు నిండిన గ్రంధమే ఋగ్వేదం. పైన తెల్పిన విశేషాలపై ఆధారపడే జ్యోతిష్యశాస్త్రం పుట్టింది. జ్యోతిషం కోసం గ్రహగతులను లెక్కించాలి. కనుక జ్యోతిషంతో పాటు గణితం కూడా చెట్టాపట్టాలు వేసుకొని పెరిగింది. అటు జ్యోతిషంలోను ఇటు గణితం లోను ఆరితేరిన మేదావులైన పరాశరుడు, ఆర్యభట్ట, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు లాంటివారు అతి ప్రాచీన కాలంలోనే తమ శాస్త్రీయ పరిజ్ఞానంతో మన హిందూ జాతిని ముందుకు నడిపించిన మేధావులు. ఇట్టివారిని మనం మననం చేసుకుంటూ, నిత్యం నమస్కరించుకోవాలి.

ఇందుచే వేద పురుషుని చక్షువుగా జ్యోతిశ్శాస్త్రం గుర్తింపబడినది. ఆకాశంలో కనపడే సూర్యచంద్రులు, నక్షత్రములు, గ్రహములు మొదలైన వాటిని మానవుడు పరికిస్తూ, కాలగమనంలో క్రమం తప్పకుండా వస్తున్న మార్పులను జ్యోతిష శాస్త్రం ద్వారా గమనించటం జరుగుతుంది.గనుక ప్రకృతిలోని సమస్తవస్తు జాలముల సృష్టి స్థితి లయములకు కాలమే హేతువవుతోంది. ఈ కాలమును అతిక్రమించుట ఎవ్వరికీ సాధ్యము కాదు. దేవతలు, రాక్షసులు, రాజులు, ప్రజలు, జంతువులు, సర్వప్రాణులు కాలవశముననే జనించుట, నశించుట జరుగుతుంది. ప్రాచీన మహర్షులు కాలమునకు రూపం కల్పించి కాలపురుషునిగా గ్రహించారు. ఇందులో కొన్ని సమయములు కొన్ని సంఘటనలకు కారణములుగా చెప్పబడతాయి. ఈ సంఘటనలు గ్రహప్రభావములచే అకస్మాత్తుగా కొత్త మార్గం లో ప్రయాణిస్తాయి. నిర్ణయాత్మకమైన మార్పులచే మానవుని సాంఘిక జీవితలో వివిధ రకాలుగా ప్రయోజనాన్ని కల్గించే శాస్త్రాలలో అత్యంత ప్రాధాన్యత కల్గిన శాస్త్రముగా జ్యోతిష్యశాస్త్రం నిలబడిపోయింది.

మానవుని అవసరాలకు, కోరికలకు జ్యోతిష్యపరమైన విచారణకు, పరిశీలనకు ఎల్లప్పుడూ ప్రేరేపణ శక్తులుగా వుంటున్నాయి. ఈ కారణములే మానవుని జీవితంలో విభిన్న సందర్భాలలో ఏర్పడే ఘటనలకు జ్యోతిష ఫల శాస్త్రమునకు గల అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. ఈ శాస్త్రముననుసరించే జీవితంలోని సంఘటలను వీలైనంత ఖచ్చితంగానే చెప్పవచ్చును. 19 వ శతాబ్ది ఉత్తరభాగము నాటికి మానవుని జనన కాలమును ఖచ్చితంగా నమోదు చేయుటకు ప్రామాణిక గడియారాలు లేకపోవడం, అత్యల్ప సంఖ్యలోనే విధ్యావంతులున్డటం, సక్రమమైన గణితాలతో పంచాంగాలు అందుబాటులో లేకపోవడమనే ముఖ్య లోపాలు వుండేవి. 20 వ శతాబ్ది మధ్యభాగం నాటికి ఇవన్నీ పూర్తిగా సమకూరడంతో జ్యోతిషరంగం ప్రపంచ ప్రజల సమస్యలకు ధీటుగా జవాబు చెప్పగల స్థాయిలో ఉందనుటలో సందేహంలేదు.

మహాపుణ్య ప్రదంగా, ప్రత్యక్ష నిదర్శనంచే రహస్యమైనదిగా సూర్యచంద్రుల సాక్షులు కల్గినదిగా, వేదములచే ప్రభోదించ బడినదిగా, శ్రౌత స్మార్తాదిగా అన్ని కార్యములకు ఉపయుక్తమైనదిగా, కాలాన్ని సూచించునది, మానవునికి జన్మకర్మల ప్రకారము ప్రాప్తించే శుభాశుభ ఫల నిర్ణయం చేయునదైన ఈ జ్యోతిష్య శాస్త్రం ద్వారా భవిష్య ఫలితాలను, అనేక పురాణ ఇతిహాస సారాంశాలను, ధర్మ సందేహాలకు సమాధానాలను, రాబోయే గ్రహ సంచార స్థితి గతులను సకాలంలో సకుటుంబ సపరివార సమేతంగా సందర్శించటానికై సనాతన సంప్రదాయ సమాచార సంగ్రహాన్ని సగర్వంగా మీకు అందించనుంది మా " గ్రహభూమి ". క్రమం తప్పక సందర్శకులు ఆసక్తితో చదవగలరని ఆశిస్తూ

- దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ